ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోవున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దానిబలం నామమాత్రమేనని తేలిపోయింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోవున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం దానిబలం నామమాత్రమేనని తేలిపోయింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలన్న పట్టుదలతో టీడీపీవుంది. ఇందులోభాగంగా, మొత్తం 115 సీట్లకుగాను కేవలం 36 సీట్లు ఇస్తే సరిపోతుందన్న లెక్కల్లో టీడీపీ నేతలు ఉన్నారు.
కాగా, ఈ ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని తెరాస ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన తెలుగుదేశం - కాంగ్రెస్ తదితర పార్టీల మహాకూటమిలో సీట్ల లెక్క ఇంకా తేలలేదు. తెలుగుదేశం పార్టీ తమకు కనీసం 36 సీట్లను కేటాయించాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల ఫలితాల సరళిని గుర్తుచేస్తున్న ఆ పార్టీ నేతలు, లెక్కలు చెబుతూ, తమకు కావాల్సిన సీట్లను అడుగుతుండగా, అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన టీడీపీ, 72 స్థానాల్లో పోటీ చేసి, 15 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ 15 సీట్లతో పాటు, టీడీపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచిన 16 అసెంబ్లీ సీట్లను, వాటికి అదనంగా తమకుపట్టున్న మరో 5 సీట్లను... మొత్తం కలిపి 36 సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ అడుగుతోంది. అప్పటిఎన్నికల్లో టీడీపీకి 51 చోట్ల కనీసం 20 వేల ఓట్ల కన్నా అధిక ఓట్లు వచ్చాయి.
ఇప్పటికే మహాకూటమి నేతలైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్.రమణ, కోదండరామ్ తదితరుల మధ్య జరిగిన మొదటి దఫా చర్చలు, సీట్ల ఖరారు విషయమై ఏ విధమైన స్పష్టతరాకుండానే ముగిశాయి. ఇప్పుడు రెండో దఫా చర్చలకు సిద్ధమవుతున్న మహాకూటమి పార్టీలు, సాధ్యమైనంత త్వరగా, సీట్ల పంపకాల విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చి, ప్రచారపర్వాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నాయి.