Webdunia - Bharat's app for daily news and videos

Install App

#2Point0Review : ఫోన్ టెక్నాలజీ వల్ల భవిష్యత్ వినాశనం... రీలోడెడ్ వెర్షన్ 2.O

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (09:26 IST)
చిత్రం 2.O
నిర్మాణ సంస్థ : సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌
నటీనటులు: రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌ తదితరులు
సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌
నిర్మాత: ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం
రచన, దర్శకత్వం: శంకర్‌
విడుదల తేదీ: 29-11-2018
 
దర్శకుడు శంకర్, సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌లు నాలుగేళ్ళపాటు శ్రమించి తీసిన చిత్రం '2.O'. ఈ చిత్రం కోసం ఏకంగా రూ.550 కోట్ల వరకు పెట్టుబడిపెట్టారు. ఇంత భారీ బడ్జెట్‌తో నాలుగేళ్ళపాటు శ్రమించి చిత్రం తీసిన సాహసానికి వారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సాంకేతికంగా అద్భుతాల సృష్టికర్త శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
అందుకే రోబో '2.O' మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త‌ర‌చూ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నప్పటికీ.. ర‌జ‌నీ అభిమానులు ఎక్క‌డా నిరుత్సాహప‌డ‌కుండా ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. ఆ నిరీక్ష‌ణ ఫ‌లించింది. '2.O' వ‌చ్చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? ర‌జ‌నీ - శంక‌ర్ స్థాయికి త‌గ్గ‌ట్టు సాగిందా? రోబోతో పోలిస్తే '2.O'లో ఉన్న ప్ర‌త్యేక‌త‌లేంటో పరిశీలిద్ధాం?
 
కథ.. 
భూమ్మీద‌ ఉన్న‌ట్టుండి అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూమ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గుర్తిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపేందుకు శాస్త్రవేత్తలంతా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఓ నిర్ణయానికి వస్తారు.
 
అదే చిట్టి.. 'ది రోబో'ను మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని నిర్ణయిస్తారు. ఇందుకోసం వశీకర్ (రజనీకాంత్) సాయం కోరుతారు. ఆయన సమ్మతించడమే కాకుండా, ఆయన చేసిన ప్రయత్నంలో సక్సెస్ అవుతాడు. అలా చిట్టి మ‌ళ్లీ రంగ ప్ర‌వేశం చేసి - అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? అస‌లు ఆ ప‌క్షిరాజు క‌థేమిటి? అనేదే మిగిలిన చిత్ర కథ. ఇది తెలియాలంటే 2.O మూవీ చూడాల్సిందే. 
 
కథ ఎలా ఉందంటే.. 
డెరెక్టర్ శంకర్ ఎపుడు కూడా సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్నే ఎంచుకుని సెల్యులాయిడ్‌పై తీస్తుంటారు. వాటిని సాంకేతికంగా ఉన్న‌తంగా చూపిస్తుంటాడు. ఈసారి సాంకేతిక విష‌యాన్నే ఎంచుకోవ‌డం మ‌రింత క‌లిసొచ్చింది. 2పాయింట్ఓ చిత్రం విషయంలోనూ మొబైల్ ఫోన్లను లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ ఫోన్ల వల్లే వ‌చ్చే శ‌బ్ద‌త‌రంగాల వ‌ల్ల ప్ర‌కృతి ఎంత న‌ష్ట‌పోతోందో, భ‌విష్య‌త్తులో ఎన్ని వినాశాలు చూడాల్సి వ‌స్తుందో... ఈ సినిమాలో క‌ళ్ల‌కు కట్టినట్టు చూపించారు. వాటి చుట్టూ ర‌జ‌నీకాంత్ ఇమేజ్‌ని మ్యాచ్ చేసుకుంటూ ఓ క‌థ అల్లారు. ఈ చిత్రం తొలి భాగంలో సెల్ ఫోన్ల మాయం, ప‌క్షిరాజు చేసే విధ్వంసం వీటిపైనే దృష్టి పెట్టారు. ఎప్పుడైతే చిట్టి రంగ ప్ర‌వేశం చేస్తాడో.. అప్పుడు ఓ ర‌స‌వత్త‌ర‌మైన పోరు చూసే అవ‌కాశం ద‌క్కుతుంది. ప‌క్షిరాజుగా అక్ష‌య్ కుమార్‌ని చూపించడంలో తొలి అర్థభాగం పూర్తవుతుంది. 
 
ఆ తర్వాత చిత్రం రెండో అర్థభాగమంతా చిట్టి - ప‌క్షిరాజుల ఆధిప‌త్య పోరే చూపించారు. అస‌లు ప‌క్షిరాజు క‌థేమిటి? ఎందుకు ఈ విధ్వంసం సృష్టిస్తున్నాడు? అనే విష‌యాల్ని ఫ్లాష్ బ్యాక్‌లో చెప్పారు. ఆ ఎపిసోడ్ హృద‌యాన్ని హ‌త్తుకునేలా తెర‌కెక్కించాడు. అస‌లు ఈ సినిమాలో ఎమోష‌న్ పండింది అంటే... ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే. ప‌తాక స‌న్నివేశాల్ని విజువ‌ల్‌గా ఓ స్థాయిలోకి దర్శకుడు శంకర్ తీసుకెళ్లాడు. కొన్ని స‌న్నివేశాలు రోబోలో చూసిన‌ట్టే అనిపిస్తుంటాయి. చిత్రాలు చూసిన‌వాళ్ల‌కు ఈ సినిమా క‌థ‌పై ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డి ఉంటుంది. వాటికి లోబ‌డే సినిమా ఉంటుంది.
 
కథాపరంగా విశ్లేషిస్తే.. 
ఈ చిత్రంలో శంకర్ అద్భుతాలేం చేయలేదు. త‌న దృష్టినంతా విజువ‌ల్ వండ‌ర్‌‌పైనే కేంద్రీకరించి, ఆ దిశగానే చిత్రాన్ని తీర్చిదిద్దారు. కొన్ని స‌న్నివేశాల్లో గ్రాఫిక్స్ అబ్బుర‌ప‌రుస్తాయి. ఇంకొన్ని చోట్ల సాదాసీదాగా సాగాయి. రోబోలో ఐశ్వ‌ర్య రాయ్ వంటి హీరోయిన్ ఉండటంతో ఆ పాత్ర‌కు వెయిటేజ్ ఇవ్వ‌గ‌లిగాడు. ఈసారి మాత్రం ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్‌లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
 
పాత్రల తీరుతెన్నులు... 
ఈ వ‌య‌సులోనూ ఇలాంటి విన్యాసాలు చేయ‌డం, జోరుగా స్టెప్పులేయ‌డం ర‌జ‌నీకే చెల్లింది. త‌న ఈజ్‌కి, స్టైల్‌కి మ‌రోసారి సెల్యూట్ చేయాల్సిందే. అయితే కొన్ని చోట్ల డూప్‌తో లాగించేసిన‌ట్టు అర్థ‌మైపోతుంటుంది. పైగా, ఏది విజువ‌ల్ ఎఫెక్ట్స్ ర‌జ‌నీకాంతో, ఏది నిజ‌మైన ర‌జ‌నీనో తెలీక కొంత అయోమయానికి గురవుతారు. అక్ష‌య్ ప‌రిస్థితీ అంతే. ఆయ‌న ప‌క్షిరాజుగా క‌నిపించింది ఎక్కువ‌. నిజ‌మైన రూపాన్ని చూసే అవ‌కాశం చాలా తక్కువే. అయితే... అక్ష‌య్ గెట‌ప్ అదిరిపోయింది. అమీజాక్స‌న్‌ని మిన‌హాయిస్తే... తెలుగు ప్రేక్ష‌కుల‌కు తెలిసిన న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌రు. శంక‌ర్ ఈ చిత్ర క‌థ‌ని ర‌జ‌నీ - అక్ష‌య్‌ల పోరాటం మ‌ధ్యే చిత్రాన్ని నడిపాడు.
 
టెక్నికల్ పరంగా.. 
ఈ చిత్రం టెక్నికల్ విలువలు మాత్రం చెప్పుకోదిగిన స్థాయిలో లేవు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మ‌రీ హాలీవుడ్ స్థాయిలో లేవు గానీ... మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని మాత్రం అబ్బుర‌పరిచేలా ఉన్నాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే... ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి. పాట‌లేం విన‌సొంపుగా లేవు. కాక‌పోతే ఆర్‌.ఆర్‌లో రెహ్మాన్ మార్క్ క‌నిపించింది. ప్ర‌తీసారీ బ‌ల‌మైన క‌థ‌ని ఎంచుకుంటూ సినిమాలు తీసే శంక‌ర్ ఈసారి కేవ‌లం టెక్నాల‌జీకే పెద్ద పీట వేశాడు. దాంతో తెరంతా భారీ హంగుల‌తో మెరిసిపోతుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments