జబర్దస్త్ నటుడు వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రంలో సర్పంచి పాత్రను పోషించిన నటుడు కీసరి నర్సింగం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు దర్శకుడు వేణు ఎల్దండి శ్రద్ధాంజలి ఘటించారు. గత యేడాది వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రేక్షకాదారణ పొందడంతో నిర్మాతకు కనక వర్షం కురిపించింది.
కుటుంబ విలువలు ఇతివృత్తంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన 'బలగం' పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నర్సింగంతోపాటు మరికొందరు కళాకారులకు వేణు అవకాశం కల్పించి, వారికి గుర్తింపు తీసుకొచ్చారు.
నర్సింగం మృతిపై వేణు స్పందిస్తూ, ఈ సినిమా కథ కోసం రీసెర్చ్ చేస్తున్న సమయంలో ముందుగా నర్సింగంనే కలిశానని గుర్తుచేసుకున్నారు. 'మీ చివరి రోజుల్లో 'బలగం' సినిమా ద్వారా మీలోని నటుణ్ని చూసుకుని.. మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నా' అని పేర్కొన్నారు.
అలాగే, పలువురు నెటిజన్లు సైతం నర్సింగం మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. నర్సింగం మృతికి గల కారణాన్ని వేణు వెల్లడించలేదు. అనారోగ్యం కారణంగానే నర్సింగం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.