సీనియర్ హీరోల్లో వెంకటేష్ ఆఫర్లతో బిజీగా వున్నాడు. దృశ్యం 2లో నటించే సూపర్ ఛాన్స్ ఆయనను వరించింది. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేసారు. ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. మోహన్ లాల్, మీనా మరోసారి మాయ చేసారంటూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తొలి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడ్నుంచే ఈ సినిమా కథ మొదలైంది. అప్పుడు చంపేసిన కుర్రాడి శవాన్ని బయటికి తీసి..పోలీసులు ఈ కేసును మళ్లీ తిరగతోడుతారు.. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నాడు వెంకటేష్.
మార్చిలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టారు దర్శక నిర్మాతలు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ అంతా పూర్తి చేయనున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్. దానికితోడు రామానాయుడు స్టూడియోస్ లో కూడా చాలా వరకు షూటింగ్ జరగనుంది. ఇందులో వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు. మరోవైపు రానా కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
Narappa young
కేవలం రెండు నెలల్లోనే ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు జీతూ జోసెఫ్. పైగా ఆయనే దర్శకుడు కావడంతో సినిమా మరింత వేగంగా పూర్తి కావడం ఖాయం. జూన్ వరకే సినిమాను పూర్తి చేసి.. జులైలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇదే కానీ జరిగితే ఎఫ్ 3 కంటే ముందుగానే దృశ్యం 2 సినిమా విడుదల కానుందన్న మాట. సురేష్ బాబు దృశ్యం 2 సినిమాను నిర్మిస్తున్నాడు. ఆశీర్వాద్ ఫిల్మ్స్, రాజ్ కుమార్ మూవీస్ తో కలిసి ఈ సినిమాను సురేష్ బాబు నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం నారప్పతో పాటు ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్న వెంకటేష్.. ఈ రెండు సినిమాలతో పాటే దృశ్యం 2పై ఫోకస్ చేస్తున్నాడు. కాస్త లేట్ గానే మొదలు పెట్టినా కూడా ఎఫ్ 3 కంటే ముందుగా దృశ్యం వస్తే అంతకంటే సంచలనం మరోటి ఉండదు.
తొలి భాగంలో నటించిన మీనా, ఎస్తర్ అనీల్, కృతిక ఇందులోనూ కనిపించనున్నారు. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న నారప్ప మే 14.. ఎఫ్ 3 ఆగస్ట్ 27న విడుదల కానున్నాయి. ఈ రెండింటి మధ్యలో దృశ్యం 2 విడుదల కానుంది.