Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్‌ మాకు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్‌తో సమానం: రామ్‌చరణ్‌

Webdunia
శనివారం, 11 మార్చి 2023 (09:01 IST)
charan talk show
రామ్‌చరణ్‌ ట్రిపుల్‌ ఆర్‌ గురించి, నాటు నాటు పాట గురించి, ఆస్కార్‌లో పార్టిసిపేషన్‌ గురించి, బాల్యం గురించి, హాలీవుడ్‌ ప్రాజెక్టుల గురించి, ఇంకా చాలా చాలా విషయాల గురించి టాక్‌ ఈజీ షోలో మాట్లాడారు.
 
Ram Charan, Sam Fragoso
ఆస్కార్‌ బరిలో ఉంది RRR నాటు నాటు. ఈ పాటలో చరణ్‌ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో మాట్లాడారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి స్పందించారు రామ్‌చరణ్‌. ఈ టాక్‌ కేవలంRRRతోనో, ఎస్‌ ఎస్‌ రాజమౌళితోనో, ఆస్కార్‌కి నామినేట్‌ అయిన నాటు నాటు పాటతో ఆగలేదు. అంతకు మించి సాగింది వాళ్ల సంభాషణ. మెగావపర్‌స్టార్‌ బాల్యం, ఆయన పెరిగిన విధానం, వాళ్ల తండ్రి చిరంజీవి క్రమశిక్షణ, తన దృష్టిలో ఆస్కార్‌ అంటే ఏంటి? వంటి విషయాలతో పాటు ఇంకా చాలా చాలా అంశాల మీద సాగింది డిస్కషన్‌. హాలీవుడ్‌ ఎగ్జిక్యూటివ్స్ తో టాక్స్ లో ఉన్న విషయాలను కూడా వెల్లడించారు. ఇందులో సరదా విషయం ఏంటంటే, తన మహిళా ఫ్యాన్స్ పంపిన కొన్ని మెసేజ్‌లను చరణ్‌తో చదివించడం. వాటిని చదువుతూ చరణ్‌ మొహమాటంగా, సిగ్గుపడటం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. రామ్ చరణ్‌ చెప్పిన కొన్ని విషయాలు...
 
 
*దీక్ష గురించి!*
దీక్ష సమయంలో మాకు ఓ డ్రెస్ కోడ్‌ ఉంటుంది. నేల మీద పడుకుంటాం. దీక్షలో ఉన్నప్పుడు ఎలాంటి లగ్జరీలను ఉపయోగించం. అమ్మాయిలను ముట్టుకోం. ఎదురుగా ఉన్నది భార్యయినా సరే తాకకూడదు. వీటితో పాటు ఇంకా పలు కఠినమైన నియమాలను పాటిస్తాం. నాలో నేను క్రమశిక్షణను అలవాటు చేసుకోవడానికే దీక్ష చేస్తాను. నటుడిగా జీవితంలో చాలా విషయాలను చూస్తుంటాం. చాలా అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి వాటి వెనక మనసు పరుగులు తీయకుండా, మన అధీనంలో ఉండేలా ఉపయోగపడుతుంది దీక్ష.
 
*నాటు నాటు విశేషాలు!*
నాటు నాటు పాట కేవలం వినోదాత్మకంగా ఉండదు. ఆ సీక్వెన్స్‌ని రాజమౌళి చాలా అర్థవంతంగా తెరకెక్కించారు. ఆ పాటలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ వల్లనే ఆ పాట ఆస్కార్‌ గడపను తొక్కగలిగింది. అవతలివారిని ఓడించిన తర్వాత తమలో తాము పోటీపడిన ఇద్దరు యువకులు, వారి ఆసక్తి, వారి పోటీతత్వం, ఉల్లాసం, హుషారు... ఇలాంటివన్నీ ఆ పాటను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.
 
ప్రతి అడుగూ మాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒకే ఒక స్ట్రెచ్‌ని దాదాపు రెండు రోజులు చిత్రీకరించాం. ఇద్దరి అడుగులూ, ఊపునూ ఒకేలా సింక్రనైజ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి స్టెప్పూ, ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ గా కుదిరింది. కీరవాణి అద్భుతమైన బీట్స్ ఇచ్చారు. పాట అంత అద్బుతంగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఉక్రెయిన్‌లో నాటు నాటు పాట కోసం మేం స్టెప్పులు వేస్తున్న సమయంలోనే యుద్ధమేఘాలు ఆవరించాయి. సెక్యూరిటీ కట్టుదిట్టమైంది. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ ఆయన ప్యాలస్‌లో మమ్మల్ని షూటింగ్‌ చేసుకోనిచ్చారు. చాలా బాగా అనిపించిన క్షణాలవి.
 
*జక్కన్న అపరమేధావి!*
కథ డిమాండ్‌ చేసిందనో, కేరక్టర్లు డిమాండ్‌ చేశాయనో కాదు, నన్నూ, తారక్‌నీ ఈ ప్రాజెక్ట్ లో పనిచేయించాలన్న గట్టి సంకల్పం రాజమౌళిగారిది. నా సోదరుడు తారక్‌తో పనిచేయడం అత్యంత సులువుగా, హాయిగా అనిపించింది. సెట్లో ఏక సమయంలో పది మంది స్టార్‌ హీరోలను కూడా హ్యాండిల్‌ చేయగల సత్తా రాజమౌళిగారి సొంతం. ఆయనేం చేస్తున్నారో ఆయనకు బాగా తెలుసు. సినిమా పూర్తయ్యేనాటికి ప్రతి ఒక్కరూ మెరిసి తీరుతారనే ధీమా ఆయన సొంతం. అత్యంత భారీ సినిమాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాకు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు నాకు అలౌకికానందం కలిగింది. మేం అత్యంత చాలెంజింగ్‌ షాట్‌ చేసిన ప్రతిసారీ, ఆయన దగ్గర  నుంచి మాకు దక్కే అత్యద్భుతమైన అప్రిషియేషన్‌ ఏంటో తెలుసా? 'నైస్‌' అన్నదే (నవ్వుతూ). ఆయన నైస్‌ అన్నారంటే, స్పాట్‌లో యాక్టర్‌ ఇరగదీసినట్టే!
లాక్‌డౌన్‌ సమయంలో ఓ సారి నాకు రాజమౌళి వీడియో కాల్‌ చేసి, నేను పర్ఫెక్ట్ ఫిజిక్‌తో ఉన్నానా? షేప్‌లోనే కనిపిస్తున్నానా అని చెక్‌ చేసుకున్నారు. మేం ఏ మాత్రం సోమరితనంలోకి జారకుండా, ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇన్‌స్పయర్‌ చేస్తూనే ఉన్నారు రాజమౌళి. వీకెండ్స్ లో మాత్రం మేం ఎలా ఉండాలో అలా ఉండేలా స్వేచ్ఛనిచ్చారు. మిగిలిన రోజలు ఏమాత్రం ఉపేక్షించేవారు కాదు.
 
*అత్యద్భుతమైన ట్రిపుల్‌ ఆర్‌!*
ఓ నటుడిగా నేను మా దర్శకుడి మనసులోకి దూరి, ఆయనేం అనుకుంటున్నారో అర్థం చేసుకుని కెమెరా ముందు ఆవిష్కరించాల్సి ఉంటుంది. అందులోనూ ట్రిపుల్‌ ఆర్‌ మల్టీజోనర్‌ సినిమా. ఇందులో బోలెడన్ని థీమ్స్, అంశాలున్నాయి. ఏ ఒక్క జోనర్‌లోనే తోసేసే విషయం కాదు. చిత్రంలోని ప్రతి అంశం ఆడియన్స్‌కి కనెక్ట్ కావాలి. చిత్రంలో భావోద్వేగానికున్న భాషను, ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి.
హార్డ్ హిట్టింగ్‌ సినిమాలను, రియలిస్టిక్‌ సినిమాలను, అవార్డులు పొందిన సినిమాలను చాలా చూశాను. నాకు ఈవెంట్‌ ఫిల్మ్స్ అన్నా ఇష్టమే. టెర్మినేటర్‌, గ్లాడియేటర్‌ నాకు చాలా ఇష్టమైన సినిమాలు. మెల్‌ జిబ్సన్‌ సినిమాలను చాలా ఇష్టపడతాను.
 
రామరాజు కేరక్టర్‌లో చాలా లేయర్స్ ఉంటాయి. అతని నిజమైన ఉద్దేశాన్ని అతను దాచుకుని ప్రవర్తించాలి. ఎన్నో వేరియేషన్లతో కూడుకున్న అత్యంత అందమైన కేరక్టర్‌ అది. ఆ రోల్‌ చేసిన తర్వాత నాకు చాలా అద్భుతంగా అనిపిస్తోంది.
ఇప్పటికీ ఆ పాత్రతో గట్టి అనుబంధం ఉన్నట్టు, నాకు చాలా సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తోంది ఆ పాత్ర.
 
*హాలీవుడ్‌ జర్నీ!*
సినిమాను ఆరాధించే ఏ దేశానికి సంబంధించిన చిత్రంలోనైనా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం కోరుకుంటే సరిపోదు. దానికి తగ్గట్టు ప్రణాళిక చేయాలి. దాన్ని సాకారం చేసుకోవాలి. నేను ఆ దిశగానే చర్చలు జరుపుతున్నాను. మాటల దశలో ఉన్నాయి. అయితే అవి సినిమాలుగా ఎలా షేప్‌ తీసుకుంటాయన్నది చూడాలి. కొన్ని నెలల్లో వాటికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి.
 
నాకు జూలియా రాబర్ట్స్‌తో పనిచేయాలని ఉంది. ఇండియాలో ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. టామ్‌ క్రూయిజ్‌నీ, బ్రాడ్‌పిట్‌నీ, జూలియా రాబర్ట్స్ నీ ఇష్టపడనివారు ఎవరుంటారు? ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. నన్ను ఇండియన్‌ బ్రాడ్‌పిట్‌ అంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది.
 
*భారీ ప్రాజెక్టులతో పనిచేయడం!*
నా పాత్ర గురించి, నేను చేయాల్సిన పని గురించి నాకు పూర్తిగా తెలిసినప్పటికీ, నాకంతా తెలుసన్నట్టు నేనెప్పుడూ ప్రవర్తించలేదు. నేను సెట్లోకి వెళ్లగానే, మా దర్శకుడితో ఎక్కువగా మాట్లాడేవాడిని. నాకు అంతా అర్థంకానట్టే అనిపించేది. ఎప్పటికప్పుడూ డైరక్టర్‌ని వందలాది ప్రశ్నలు అడుగుతుంటే నాకే ఇబ్బందిగా అనిపించేది. చాలా విషయాలు తెలిసినా తెలియనట్టే ఉండాలి. అన్నీ తెలుసన్నట్టు ప్రవర్తించకూడదు.
 
*నా దృష్టిలో ఆస్కార్‌!*
ఆస్కార్‌ రిజల్ట్ ఏంటని ముందే ఊహించడం కాదు. మా దృష్టిలో ఆస్కార్‌ అనేది ఓ భావోద్వేగం. అక్కడ వెయిట్‌ చేస్తున్న మా నాన్నకు ఎమోషనల్‌ విషయం. మా సినిమా నాటు నాటు ఆస్కార్‌కి రావడాన్ని మా నాన్న చాలా సెంటిమెంట్‌గా చూస్తున్నారు. దాదాపు 42 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన. ఆయన 80ల్లో ఒకసారి ఆస్కార్‌ ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఆయన వరకు అది చాలా గొప్ప అచీవ్‌మెంట్‌. ఎందుకంటే, ఆస్కార్‌ ప్రాంగణంలో అడుగుపెట్టిన తొలి సౌత్‌ ఇండియన్‌ ఆయనే. అలాంటిది ఇవాళ మా పాట నామినేట్‌ అయింది. మాకు ఈ నామినేషన్‌ విలువ తెలియకపోవచ్చు. కానీ మా నాన్నకు తెలుసు. మేం మా కోసమే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం మేం ప్రార్థిస్తున్నాం. నా వరకు, ఆస్కార్‌ అనేది ఒలింపిక్‌లో గోల్డ్ మెడల్‌ సాధించినదానితో సమానం.
 
ఇక ఆస్కార్‌కి వెళ్లడం మాకు అలవాటైపోవచ్చు. ఆస్కార్‌ మా జీవితాల్లో పునరావృతం కావచ్చు. కానీ, ఆస్కార్‌ దక్కడం అనేది మా బాధ్యతలను రెట్టింపుచేస్తోంది.
 
*పెరిగిన విధానం*
నేను పెరుగుతున్నప్పుడు, మా నాన్న అవార్డులుగానీ, మా నాన్నకు సంబంధించిన వార్తలున్న మ్యాగజైన్లు కానీ, మా ఇంటికి తీసుకొచ్చేవారు కాదు. వాటన్నిటికీ మా ఇంటి కింద ఉన్న ఇంట్లోనే ఉండేవి. ఒక ఫేమస్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్ ఆయన పెయింటింగ్‌ వేసినా, అది కూడా మా వరకు రాలేదు. ఆయన వృత్తి ప్రభావం మా ఇంట్లో వాళ్ల మీద పడకూడదన్నది ఆయన అభిప్రాయం. ఆ వైవిధ్యాన్ని  చాలా బాగా పాటించేవారు. సినిమా ఇండస్ట్రీ చాలా గ్లామరస్‌ ఇండస్ట్రీ అని అలా భావించేవారేమో. మమ్మల్ని మామూలు పిల్లలుగా పెంచడానికే ప్రయత్నించేవారు. మా నాన్న సూపర్‌స్టార్‌ అనే గర్వం మా తలకు ఎక్కకుండా చూసుకునేవారు. అందులోనూ తప్పేం లేదు. ఇవాళ నేను నా ఈఎంఐలను కట్టుకోగలుగుతున్నాను. నా అంతట నేను ఉండగలుగుతున్నాను అంటే ఆయన పెంపకం అలాంటిది.
 
చిన్నతనంలో మా స్కూల్లో నాకు  మార్కులు తక్కువగా వస్తే, నా స్కూల్‌ని మార్చేసేవారు. రెండేళ్లకు పైగా ఒకే పాఠశాలలో నేనెప్పుడూ చదవలేదు. కొన్నిసార్లు నాకు వచ్చే గ్రేడ్‌ల కోసం కావచ్చు, మరికొన్నిసార్లు నాలో క్రమశిక్షణ పెంచడం కోసం కావచ్చు.. కారణం ఏదైనా స్కూళ్లు మార్చేసేవారు. నేను స్పోర్ట్స్ లో ఉండటం వల్ల మార్కులు తక్కువగా వచ్చేవి. చిన్నతనంలో మ్యాథ్స్, హిస్టరీ చాలా ఇష్టంగా చదివేవాడిని. అల్లరి పిల్లాడిని, ఆకతాయి కుర్రాడిని మాత్రం కాదు. చాలా మంచివాడిని.
 
మా నాన్నతో ఎక్కువ సమయం గడపడానికి వీలయ్యేది కాదు. ఆయనతో కలిసి భోజనం చేసేటప్పుడు మాత్రమే మాకు సమయం దొరికేది. ఆయన్ని మిగిలిన సమయాల్లో డిస్టర్బ్ చేయకూడదు అనే రూల్‌ ఉండేది మా ఇంట్లో. నా చిన్నతనమంతా ఉమ్మడి కుటుంబంలోనే గడిచింది. ఇంట్లో చాలా మంది స్టాఫ్‌ ఉండేవారు. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిచేసేవారు. యుఎస్‌లో లాగా కాకుండా, ఇండియాలో ఉమ్మడికుటుంబాలుంటాయి.
 
నేనేమైనా చెడ్డ సినిమా  చేస్తే, మా నాన్నగారి దగ్గరకు వెళ్లి, ఎందువల్ల తప్పు జరిగిందో, ఎక్కడ తప్పు జరిగిందో అడిగి తెలుసుకుంటా (నవ్వుతూ). నా జర్నీని మా నాన్నగారు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు 67 ఏళ్లు. సెట్లో మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.
 
మా ఇంట్లో మేం ఎనిమిది మంది నటులం ఉన్నాం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. మా నాన్నగారి నుంచి మేం అందరం చాలా విషయాలు నేర్చుకున్నాం. పండగలప్పుడు అందరం కలిసి భోజనం చేస్తాం. ఇంట్లో ఉన్నప్పుడు అసలు పని గురించి మాట్లాడుకోం. మా హాలీడేస్‌ గురించి, కుటుంబం గురించి, ఆప్యాయతలు, అనుభూతులు, మధురానుభూతుల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం.
 
*భిన్నత్వంలో ఏకత్వం*
మా దేశంలో సంప్రదాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి. భిన్నత్వంలో ఏకత్వమే మా దేశానికి అందం. అదే స్ఫూర్తి మా సినిమాల్లోనూ కనిపిస్తుంది. సరిహద్దులు చెరిపేసి, ఇండియన్‌ ఫిల్మ్ ఇండస్ట్రీని సిద్ధం చేస్తున్నారు రాజమౌళిగారు. పొరుగు ఇండస్ట్రీలలోని ప్రతిభావంతులతో కలిసి పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తున్నారు.
 
మా ట్రిపుల్‌ ఆర్‌కి చాలా దేశాల్లో అద్భుతమైన అంగీకారం దక్కింది. నాకు విదేశీయుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఉంది. వాళ్లు మా సినిమాలను ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవాలని ఉంది. వాళ్లిచ్చే సందేశాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారులు.. ఎక్కడ?

పంట పొలంలో 19 అడుగుల కొండ చిలువ

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments