డైరెక్టర్స్ కట్ సినిమా బ్యానర్‌పై వీరబ్రహ్మం నక్కా దర్శకత్వంలో తనే స్వయంగా నిర్మిస్తున్న చిత్రం నో రామ.. రావణ్స్ ఓన్లీ. 14 సంవత్సరాల లోపు పిల్లలను సరైన దారిలో పెట్టకపోతే జరిగే పరిణామాల నేపథ్యంలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో జబర్ధస్త్ పణి చేతుల మీదుగా విడుదల చేశారు. దర్శకుడు వీరబ్రహ్మంతో పాటు అంకిత్ నాయుడు, శివ బలరామ్, తిరుపతి, రిషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం దర్శకనిర్మాత వీరబ్రహ్మం నక్కా మాట్లాడుతూ, నో రామ.. రావణ్స్ ఓన్లీ.. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో.. సినిమా కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులందరూ చూడాల్సిన సినిమా ఇది. తమ పిల్లలను పెంచాల్సిన టైమ్‌లో సరిగా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనేది.. మంచి మెసేజ్‌తో ఈ చిత్రంలో చూపించాం. తల్లిదండ్రులనే కాదు. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే మంచి మెసేజ్‌ని ప్రేక్షకులకు ఈ చిత్రంలో చెప్పడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఆ విషయం అర్థమై ఉంటుంది. ఈ చిత్రం విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తాము.. అని తెలిపారు.
ఈ చిత్రానికికెమెరా: అశోక్ కుమార్ మట్టపూడి, కొరియోగ్రఫీ: మురళీకృష్ణ, అర్జున్, అంజా గౌడ్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అంకిత్ నాయుడు, పబ్లిసిటీ డిజైనర్: డిజైన్ స్టూడియో