భార్యాభర్తలను విద్యుత్ తీగలు బలి తీసుకున్నాయి. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో చోటుచేసుకుంది. క్షణాల వ్యవధిలో దంపతులు విద్యుతాఘాతానికి బలైపోవడం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. అరకు లోయలోని విద్యుత్ ఉద్యోగుల క్వార్టర్స్‌లో ఓ ఇద్దరు దంపతులు నివాసముంటున్నారు. భార్య బట్టలు ఉతుకుతుండగా, వాటిని భర్త ఆరేస్తున్నాడు.
విద్యుత్ సర్వీస్ వైర్‌పై భర్త బట్టలు ఆరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దీంతో అప్రమత్తమై భార్య భర్తను కాపాడబోయి.. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరూ స్పృహ కోల్పోయారు.
వీరిద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ ఆంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో ఇంటి వద్దే ఆ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.