Dr. Rajendra Prasad, journalist Udayagiri Fayaz, Raghavarao, Malleswari, Arun Kumar, Rahil Taj
ఎన్నో పాత్రలకు తన నటనతో ప్రాణం పోసిన విలక్షణ నటుడు స్వర్గీయ నాగభూషణం జీవితంలోని వివిధ విశేషాలు, సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రక్తకన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ వెర్సటైల్ యాక్టర్ నటకిరిటీ డా.రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆయన స్వగృహంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత ఫయాజ్, నాగభూషణం పెద్ద కుమారుడు రాఘవరావు, పెద్ద కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్, రాహిల్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటకిరిటీ డా.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నా జీవితంలో ఈరోజు ఎంతో అదృష్టమైన రోజు. ఎందుకంటే, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావుగారి ఇంట్లో పుట్టే అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు. ఆయనతోపాటు మహామహులను కలుసుకునే అవకాశం కలిగింది. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి నాగభూషణంగారు. రక్తకన్నీరు నాగభూషణంగారికి నాకు దగ్గరి పోలిక ఏంటంటే, నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయన విలనిజంలోనూ కామెడీ చేశారు. మరీ ముఖ్యంగా ఆయనకు డబ్బింగ్‌లో చాలా గొప్ప పేరుంది. ఆయన షూటింగ్‌లో ఏ టైమింగ్‌లో అయితే డైలాగ్ చెబుతారో అదే టైమింగ్‌తో డబ్బింగ్‌ను కళ్లు మూసుకుని మరీ చెప్పగలరు. ఇఆయన స్టేజ్ నుంచి వచ్చిన గొప్ప నటులు. సినిమాల్లో నటించే రోజుల్లోనూ ఆయన స్టేజ్ షోలను విడిచి పెట్టలేదు.
ఆయన గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో విశేషాలు చెప్పొచ్చు. అలాంటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్‌గారు పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. సీనియర్ నటులు గురించి నేటితరం వాళ్లకి ఎలా తెలుస్తుంది.. ఇలాంటి పుస్తకాల ద్వారానే. కాబట్టి ఫయాజ్‌గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ రక్తకన్నీరు నాగభూషణం పుస్తకాన్ని వాళ్ల కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించే అవకాశం రావటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరూ ఈ పుస్తకాన్ని చదవాలని కోరుకుంటున్నాను అన్నారు.
రైటర్ ఉదయగిరి ఫయాజ్ మాట్లాడుతూ నాగభూషణంగారు గొప్ప నటులే కాదు.. అంతకు మించిన సంస్కారి. తన జీవితాన్ని అతి సామాన్యంగా గడిపిన వ్యక్తి. ఆయన జీవితంలో ఏ కోణాన్ని తీసుకున్నా మనకు గొప్పగా కనిపిస్తుంది. ఆయన ఎంత గొప్ప నటుడో అంతకు మించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నాగభూషణంగారు. ఆయన గురించి పుస్తకం రాసే అవకాశం కలగటం నా అదృష్టం. దాన్ని నాకెంతో ఆప్తుడైన రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించటం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ పుస్తక రచనలో ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో సహకరించారు. ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అన్నారు.