మెగాస్టార్ చిరంజీవితో హీరో అల్లు అర్జున్ లంచ్ మీట్‌లో పాల్గొన్నారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి స్వయంగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన పుష్పరాజ్... చిరంజీవితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత చిరంజీవి నివాసంలోనే గంటన్నరసేపు ఉన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో న్యాయపరమైన సలహాలు చిరంజీవి ఇవ్వడంతో పాటు అల్లు అర్జున్ తరపున కోర్టులో వాదించేందుకు వైకాపా నేత, లాయర్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు.
కాగా, సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఏ11 నిందితుడుగా ఉన్న విషయం తెల్సిందే. ఈ కేసులో ఆయనను ఇటీవల అరెస్టు చేయగా, తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో 24 గంటలు తిరగకముందే ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా అల్లు కుటుంబానికి అల్లుడైన మెగాస్టార్ చిరంజీవి అండగా నిలిచారు.
అరెస్టు వార్త తెలియగానే చిరంజీవి తన విశ్వంభర చిత్రం షూటింగ్ రద్దు చేసుకుని బన్నీని కలిసేందుకు చిరంజీవి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, భద్రతా కారణాల రీత్యా పోలీసులు ఆయనను స్టేషన్‌లోకి అనుమతించలేదు. దీంతో చిరంజీవి అక్కడ నుంచి అల్లు అరవింద్ నివాసానికి చేరుకున్నారు. బన్నీ రిలీజ్‌కు సంబంధించిన లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ కీలకంగా వ్యవహరించారు.
ఈ క్రమంలోనే జైలు నుంచి రిలీజ్ అయిన అల్లు అర్జున్ ఆదివారం మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లారు. భార్యతో కలిసి మధ్యాహ్నం చిరు ఇంటికి చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో తన అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై బన్నీ చర్చించినట్టు సమాచారం.