Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానంది దివ్యచరిత్ర... తెలుసా?

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (20:17 IST)
పూర్వం కర్నూలు మండలం లోని కొంత ప్రాంతాన్నినందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు. అతను నిత్యవచనుడు, పరమ దయా భాసురుడు, పరమేశ్వర భక్తుడు. నిత్యము శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టాపరుడు. అతను ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు. అందుకే ప్రత్యేకంగా ఆవులమందను పోషించేవాడు. అన్ని ఆవులలోను ఓ కపిలక్షీరము ప్రత్యేకంగా అభిషేకానికై వినియోగించేవాడు. ఆ గోసంరక్షణకు గోపాలుడనే అతి నమ్మకమైన బంటును నియమించాడు.
 
గోపాలుడు ప్రతి దినము ఉదయమే ఆవులను తోలుకొని అడవికి వెళ్లేవాడు. చక్కని పచ్చిక బయళ్లతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు. గో క్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు. అదే అతని నిత్యకృత్యము. శివార్చనకై వినియోగించే క్షీరప్రసాదిని కపిల. ఆ కపిల సొగసే సొగసు.సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది. భువన రక్ష చేసే జగన్మాతలా ఉండేది. 
 
సర్వప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది. ఆ గోవుపాలు గంటెడు తాగినా అమృతపానం. చక్కని కొమ్ములతో, అతి చక్కని మూపురంతో నంది నాట్యమాడినట్లు నడిచే నడకలతో పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్లతో సాక్షాత్తు నంది దేనువులా ఉండేది ఆ కపిల. 
 
ఒక రోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యధారీతి పాలు తీయుటకు వెళ్లగా అమావాస్యనాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు. పాలకై వదిలిన దూడను తన్నినది గోవు. పాలు తీయుటకు వెళ్లిన గోపాలునీ తన్నినది. తల్లిని మించిన తల్లి. సాధువులలో సాధువు. నా తల్లి నన్నేల తన్నినది, కుంభంలా ఉండే పొదుగేల చిక్కినది. పాలేమైనవి. అర్ధంకాని గోపాలుడు ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు. వ్రతభంగానికి రాజు చింతించి దిష్టి తీయించినాడు. ఆవుకు సేవలు చేసినాడు. 
 
మరుసటి రోజు యధాప్రకారమే అయినది. మూడవ రోజునా అంతే జరిగినది. రాజునకు కోపం వచ్చి గోపాలుని శిక్షించలేక, వ్రత భంగమునకు ఓర్వ లేక గోపాలుని కఠినంగా శాసించాడు. మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు. ఎవరో తనను మోసగించి పాలు పిదుకుకొని వెళుచున్నారని వూహించిన గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినాడు. సాయంకాలమైంది. ఆవులనన్నింటిని మళ్లించుకొని రాజకోష్టము వెళ్లినాడు. కానీ కధ యధాప్రకారమైనది.
 
రాజు గారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించాడు. వికల మనస్కుడై ఇంటికి చేరినాడు. ఎప్పుడూ జరగనది ఇలా జరుగుతున్నదేమిటి. ఎవరు దీనికి కారకులు. మనుషులా... దైవమాయా.. ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను. ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి. ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు.
 
ఆ ఆలోచనతోనే నిద్రపోయాడు గోపాలుడు. అతనికన్నీ కలలే. కల నిండా గో సమూహము అన్నీ కపిలలే. ఎటు చూసినా గోక్షీరం క్షీర సముద్రంలాగా పాలమయం. ఆ పాల మధ్య పరమేశ్వర సమేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసిబాలునిలా మారి పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు. తెల్లవారింది. కల అర్ధం తెలియక ఆందోళనతో ఆనాడు విషయం తెలుకోవాలనే పట్టుదలతో ఆవుల మందతో వెళ్లాడు గోపాలుడు. 
 
అన్ని ఆవులను తప్పించుకొని వెళ్లసాగింది కపిల. దానిని అనుసరించాడు గోపాలుడు. అది వెళ్లి వెళ్లి ఓ పుట్ట వద్ద నిలిచింది. సరిగా పుట్టపై నిలిచింది. వల్మీకాగృంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది. గోవు ధారగా పాలు పితక సాగింది. జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు ఆ క్షీరాన్ని త్రాగసాగాడు. అద్బుతం...ఆశ్చర్యం... ఆనందం...
 
పాలు పితికిన గోవు తిరుగుముఖం పట్టింది. యధావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు. నందనరాజుకు విషయం తెలియలేదు. ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు. ఆ రోజు రాత్రి నాల్గవ జాములో పరమేశ్వరీ సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమైనాడు. నందనరాజా నీవు ధన్యుడవు. నీ రాజ్యము ధన్యము. నీ గోవూ గోపాలుడూ ధన్యులే. ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు నేనే. నిన్నూ నీ రాజ్యాన్ని అనుగ్రహించటానికే వచ్చాను. ఆ పుట్ట ఉన్నచోటే నాకొక ఆలయాన్ని నిర్మించు. అక్కడే ఒక కోనేరు త్రవ్వించు. నా దేవి గంగాభవాని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలుకువ వచ్చింది.
 
నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్లాడు. సాయంకాలం దాకా కాచుకొని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు. అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు. ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది. ఆ అడుగు పుట్టపై పడింది. ఆ కపిల ఆ బాలుడు అదృశ్యమైనారు. రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు. తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు  ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు. సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు. ఆ పుట్టలో వెలసియున్న శివ లింగరూపుడు మహానందీశ్వరుడు. ఆ క్షేత్రమే మహానంది దివ్యక్షేత్రము.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీంకోర్టు జడ్జీలకు చేదు అనుభవం... విమానంలో మందుబాబుల వీరంగం

'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)

చెన్నైకు 480 కిమీ దూరంలో తీవ్ర వాయుగుండం.. ఏపీకి భారీ వర్షాలు

అయ్యప్పమాల ధరించిన ఆర్టీసీ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ (Video)

లోక్‌సభ సభ్యురాలిగా ప్రియాంకా గాంధీ ప్రమాణ స్వీకారం

అన్నీ చూడండి

లేటెస్ట్

వృశ్చికరాశి జాతకం 2025.. కెరీర్, ఉద్యోగం ఎలా వుంటుంది..?

2025 రాశి ఫలితాలు.. ఏ రాశికి శుభం.. చాలామంది మాంసాహారం మానేస్తారట!

27-11-2024 బుధవారం ఫలితాలు - ప్రముఖుల సలహా పాటిస్తే మంచిది..

టిటిడికి రూ. 2.02 కోట్లు విరాళం కానుకగా ఇచ్చిన చెన్నైకి చెందిన భక్తుడు

జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

తర్వాతి కథనం
Show comments