స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆపదలో వున్నా.. ఆ ఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారే కానీ... ప్రమాదంలో వున్న వ్య
స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆపదలో వున్నా.. ఆ ఘటనను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకే చాలామంది ఆసక్తి చూపుతున్నారే కానీ... ప్రమాదంలో వున్న వ్యక్తుల్ని కాపాడేందుకు ముందుకు రావట్లేదు. ఇలాంటి ఘటనే పుణేలో చోటుచేసుకుంది.
ఓ వైపు పక్క మనిషి రక్తమోడుతూ కొనవూపిరితో కొట్టుకుంటుంటే.. అటువైపుగా వెళ్లే పాదచారులు చూస్తూ ఉన్నారే కాని ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించలేదు. పైగా మానవత్వం మరిచి ఫోటోలు.. వీడియోలు తీసుకుంటూ చోద్యం చూశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... పుణెకు చెందిన 25ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీష్ ప్రభాకర్ మెటే భోసారి ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రోడ్డుపై రక్తమోడుతూ రోడ్డుపై పడివున్న ఆ వ్యక్తి ఎవ్వరూ కాపాడేందుకు ప్రయత్నించలేదు. పాదచారులు ఆయన్ని కాపాడకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ చూస్తుండిపోయారు. కొద్ది సేపటికి భోసారికి చెందిన డెంటిస్టు కార్తీక్‌రాజ్ రక్తంలో పడి ఉన్న సతీష్‌ను గమనించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
తలకు తీవ్ర గాయం కావడంతో అతని ప్రాణాలను కాపాడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే అతడిని చూసిన వాళ్లు ఫొటోలు, వీడియోలు తీసుకోకుండా ఆసుపత్రికి తరలించి ఉంటే అతడు ప్రాణాలను కోల్పోయే వాడు కాదని కార్తీక్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.