వీధి కుక్కలకు అన్నం పెట్టిందనీ ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు ఓ మహిళకు భారీ మొత్తంలో అపరాధం విధించారు. కుక్కలకు అన్నం పెట్టడం వల్ల భవన సముదాయ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ప్రతినిధులు చెబుతున్నారు. అందుకే అపరాధం విధించినట్టు చెప్పారు. దీనిపై జంతు ప్రేమికుల నుంచి విమర్శలు వచ్చినా వారు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాధారణంగా మూగ జీవులను దగ్గరకు చేరదీసి వాటి ఆకలి తీర్చేందుకు ఎవరికీ మనసురాదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే వారిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. అభినందిస్తారు. మహారాష్ట్రంలో మాత్రం మూగజీవాలను అన్నం పెట్టిందని మహిళకు లక్షలాది రూపాయలు జరిమానా విధించారు. ఈ పనికి పాల్పడింది ఓ నివాస భవన సముదాయ సంఘం ప్రతినిధులు.
ముంబై నగరంలోని నిసర్గ్ హెవెన్ సొసైటీలో నేహా దత్వానీ అనే మహిళ నివాసముంటోంది. ఈమె స్థానికంగా ఓ ప్రైవేట్ యాడ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. స్వతహాగానే జంతు ప్రేమికురాలైన నేహా వీధి కుక్కలకు ప్రతిరోజూ అన్నంపెట్టి వాటి ఆకలిని తీర్చుతోంది.
కుక్కలను చేరదీసిన నేహా వాటికి రోజూ అన్నం పెడుతున్నందువల్లనే అవి ఆ ప్రాంతంలోని కొందరిపై మొరుగుతున్నాయనీ.. దాడి చేస్తున్నాయనీ.. ఆ కుక్కలతో అపార్టుమెంట్‌లోని సెల్లార్ అంతా అపరిశుభ్రంగా తయారవుతోందని అపార్ట్‌మెంట్ నివాసులు ఆందోళనకు దిగారు. దీంతో అపార్టుమెంట్ ఒసోసియేషన్ సొసైటీ ఛైర్మన్ మితేష్ బోరా తీవ్రంగా స్పందించి ఏకంగా రూ.3.6 లక్షల అపరాధం విధించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ, ఆ సొసైటీలో నివాసముంటున్న 98 శాతం మంది నివాసుల తీర్మానం మేరకే ఈ పనిచేశామని తమ చర్యను సమర్థించుకున్నారు. కాగా తనకు జరిమానా విధించి జంతువుల హక్కులను సొసైటీ కాలరాచిందని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని నేహా ప్రకటించారు. మరోపక్క మనుషులకు కూడా హక్కులుంటాయని వాటి సంగతేమిటని సొసైటీ వాసులు ప్రశ్నిస్తున్నారు.