కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకుంది. ట్రినిడాడ్ స్టార్ పొలార్డ్ సిక్సర్ల సునామీ ధాటికి పంజాబ్ జట్టు ఖంగుతింది. దీంతో మూడు వికెట్ల తేడాతో ముంబై అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
పొలార్డ్ ఊచకోతకు కేఎల్ రాహుల్ సెంచరీ చిన్నబోయింది. ఐతే విజయానికి 4 పరుగుల దూరంలో పొలార్డ్ ఔట్ అవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. చివరి బంతికి జోసెఫ్ రెండు పరుగులు చేసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా ముంబై జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఐతే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పటికీ ఆ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాడు పొలార్డ్.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. లాడ్ 15 రన్స్ చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా అలాగే అవుట్ అయ్యారు. సూర్యకుమార్ 21, హార్ధిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. అనవసర రన్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ (7) అవుటయ్యాడు. ఐతే ఓ వైపు వికెట్లు పడుతున్నా పొలార్డ్ మాత్రం హిట్టింగ్‌తో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
31 బంతుల్లోనే 83 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 సిక్సర్లతో పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా..కర్రాన్, అశ్విన్, అంకిత్ చెరో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు తీయగా బెరెన్‌డాఫ్, బుమ్రా చెరో వికెట్ పడగొట్టారు. ఇప్పటివరకు పంజాబ్ ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ముంబై ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇకపోతే.. గురువారం రాత్రి 8 గంటలకు జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి.