సంతకాలు ఫోర్జరీ చేశారా.. మరి శశికళ క్యాంపులో ఉన్నదెవరు?
అక్రమాస్తుల కేసులో శశికళ భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలిపోతుండగా తమిళనాడు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న వార్తల నేపథ్యంలో గవర్నర్ శశికళ సమర్పించిన జాబితాలోని సంతకాలను పరిశీలన చేయిస్తున్నారు. దీనికి కొసమెరుపుగా కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్
అక్రమాస్తుల కేసులో శశికళ భవితవ్యం మరి కొద్ది గంటల్లో తేలిపోతుండగా తమిళనాడు ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న వార్తల నేపథ్యంలో గవర్నర్ శశికళ సమర్పించిన జాబితాలోని సంతకాలను పరిశీలన చేయిస్తున్నారు. దీనికి కొసమెరుపుగా కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్యే మనోరంజితం తాను ఎమ్మెల్యేల సమావేశానికే హాజరు కాలేదని చెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ప్రజాభిప్రాయం మేరకు తాను పన్నీర్‌కు మద్దతిస్తానన్నారు. మనోరంజితం చేసిన ఆరోపణలు నిజమే అయితే శశికళ క్యాంపులో ఉన్నది ఎమ్మెల్యేలేనా అనే సందేహం అలుముకుంది. కానీ ప్రభుత్వం తరపున శిబిరంలోకి వెళ్లిన పోలీసు బాసులు 119 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్చందంగా శశికళ వర్గంలో ఉన్నామని, తమనెవరూ బలవంతం చేయడం లేదని చెప్పడంతో ఏది నిజం, ఏది అబద్ధం అనేది గందరగోళంగా మారింది.
ఈరోజు ఉదయం 10 గంటలకు సుప్రీకోర్టు శశికళ అక్రమాస్తుల కేసులో తీర్పు ఇవ్వనుండటంతో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరికి పిలుపివ్వాలి అనే అంశం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. ఈలోగా సెంగోట్టియన్‌కు పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవి ఇవ్వడంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై అసంతృప్తితో ఢిల్లీలోనే ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని శశికళ వర్గం ఖండించింది. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని గవర్నర్‌కు రోహత్గీ సూచించినట్లు తెలిసింది.
గవర్నర్ నిర్ణయం సాగదీయడం వెనుక కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ ఇంకా సాగదీస్తే కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. శశికళ సీఎంగానే ఢిల్లీకి వస్తారని ధీమాగా చెప్పారు. గవర్నర్ రాజ్యాంగానికి బ్రేకులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీని విమర్శిస్తే అంతు చూస్తామని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.