కేధార్‌నాథ్‌లో పెను ప్రమాదం తప్పింది. హెలికాప్టర్ అదుపు తప్పింది. దీంతో అక్కడి జనం జడుసుకున్నారు. అలాగే హెలికాఫ్టర్ లోని ప్రయాణీకులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకుని హడలిపోయారు. వివరాల్లోకి వెళితే.. కేధార్‌నాథ్‌లో ప్రయాణికులతో హెలీప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే సమయంలో అదుపుతప్పి గింగిరాలు కొట్టింది.
ల్యాండ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ లో పైలట్ సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. అయితే పైలట్ సమర్థవంతంగా హెలికాప్టర్‌ను నియంత్రించి.. ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు.
కానీ ల్యాండ్ అయ్యే ప్రాంతంలో కాకుండా ఖాళీ ప్రదేశంలో హెలికాప్టర్ గింగిరాలు కొడుతూ భూమిని తాకింది. దీంతో హమ్మయ్య అంటూ హెలికాఫ్టర్ లోని ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.