విద్యార్థులను వారి కన్న తల్లిదండ్రులకంటే మిన్నగా ప్రేమించి, జ్ఞానదానం చేసిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయలోకానికి ఆదర్శప్రాయులు. వారి వాగ్దాటి, ఉపన్యాసాలు విద్యార్థులనే కాదు, పెద్దలనూ ఉర్రూతలూగించేవి.
రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థించారు. దీనికి ఆయన నవ్వుతూ 'నా పుట్టినరోజుకు బదులు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది' అని సూచించారు.
అప్పట్నించి (1962) ఏటా రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినంగా దేశం జరుపుకొంటోంది.
మహా తత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్ కడు పేదరికాన్ని అనుభవించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలిరోజుల్లో అన్నం తినడానికి ఒక పళ్ళెం కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపై భోజనం చేసేవారు.
ఒక్కోసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులేకపోతే, నేలపై నీటితో శుభ్రం చేసుకుని ఆ నేలపైనే అన్నం వడ్డించుకుని తిన్నారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పతకాలను అమ్ముకోవాల్సి వచ్చింది.