Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాస రామానుజన్... డెత్ బెడ్ పైన 1729 ప్రాముఖ్యతను చెప్పిన గణిత మేధావి....

అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బ

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2016 (18:39 IST)
అపారమైన మేధస్సుతో భారతదేశపు కీర్తిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఉత్తర అర్కాట్ జిల్లా ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రామానుజన్ పన్నెండేళ్ల వయసులోనే గణితంలో అసాధారణ బాలునిగా గుర్తింపు పొందారు. రామానుజన్ ‘ఆయిలర్’ సూత్రాలు, త్రికోణమితికి చెందిన అనేక సమస్యలను సులువుగా సాధించి చూపేవారు. కుంభకోణం గవర్నమెంటు కాలేజీలో చేరిన రామానుజన్ గణితం మీదే శ్రద్ధ చూపి మిగిలిన సబ్జెక్టులపై దృష్టి పెట్టకపోవడంతో ఎఫ్.ఎ. పరీక్ష తప్పారు. ఆ తరువాత మద్రాస్‌లోని పచ్చయ్యప్ప కాలేజీలో చేరారు. 
 
అక్కడ గణితోపాధ్యాయునిగా ఉన్న ఎన్. రామానుజాచారి గణిత సమస్యలను కఠినమైన పద్ధతిలో పరిష్కరించి చూపుతుంటే, రామానుజన్ వాటిని తనదైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవారు. రామానుజన్ ప్రతిభను గమనించిన ప్రొఫెసర్ సింగారవేలు ముదలియార్, రామానుజన్‌తో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలను చర్చించి సాధిస్తుండేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ వంటి విషయాలపై రామానుజన్ విశేష పరిశోధనలు చేశారు. 
 
15 ఏళ్ళకే రామానుజన్‌లోని తెలివితేటలను ప్రపంచానికి చాటడానికి దోహదం చేసిన గ్రంథం జార్జ్ స్కూచ్‌సిడ్జ్‌కార్ రాసిన ‘సినాప్సిస్’. అందులో ఆల్‌జీబ్రా, అనలిటికల్ జామెట్రీ వంటి విషయాల మీద దాదాపు 6165 సిద్ధాంతాలున్నాయి. వీటి నిరూపణలు చాలా కష్టంగా ఉండేవి. పెద్దపెద్ద ప్రొఫెసర్‌లు సైతం అర్థం చేసుకోలేకపోయిన ఈ సిద్ధాంతాలను, సూత్రాలకు రామానుజన్ ఎటువంటి పుస్తకాలను తిరగేయకుండా వాటి సాధనలను అలవోకగా కనుక్కునేవారు. అప్పటికే అందులో చాలా సమస్యలు నిరూపించబడ్డాయన్న విషయం ఆయనకు తెలియకపోవడం చేత వాటిని తన పద్ధతితో సాధించి చూపారు.
 
1903లో మద్రాసు విశ్వవిద్యాలయంలో స్కాలర్‌షిప్ వచ్చింది. లెక్కల వల్ల కొడుకుకి పిచ్చి పడుతుందేమోనని భయపడిన రామానుజం తండ్రి ఆయనకు పెళ్ళి చేశారు. సంసారం గడవటం కోసం 25 రూపాయల వేతనం మీద రామానుజన్ గుమాస్తాగా చేరారు. చిత్తు కాగితాలను కూడా బహుజాగ్రత్తగా వాడుకుంటూ గణితమే లోకంగా బతికేవారు. గణితంలో ఆయన ప్రదర్శిస్తున్న ప్రజ్ఞను చూచి ఏ డిగ్రీ లేకపోయినా మద్రాసు విశ్వవిద్యాలయం నెలకు 75 రూపాయల ఫెలోషిప్ మంజూరు చేసింది. 1913లో మద్రాస్ పోర్ట్‌ట్రస్ట్‌కు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డా॥వాకర్ రామానుజన్ పరిశోధనలు చూసి ఆశ్యర్యపోయి, రామానుజన్ కనుగొన్న 120 పరిశోధనా సిద్ధాంతాలను ఆ కాలంలో ప్రసిద్ధుడైన కేంబ్రిడ్జి ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్డి (1877-1947)కి పంపారు. 
 
ఉన్నతస్థాయి గణితజ్ఞుడు రాయగల ఆ ఫలితాలను చూసి వెంటనే రామానుజన్‌ను జి.హెచ్.హార్డీ కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. రామానుజన్ లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన హార్డీ అసలు తాను గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ రామానుజాన్ని కనుగొనడమే అని వ్యాఖ్యానించడం విశేషం. మార్చి 17, 1914న రామానుజన్ ఇంగ్లండుకు ప్రయాణమయ్యారు. శాఖాహారపు అలవాట్లు గల రామానుజన్ ఇంగ్లాండులో తానే వండుకుని తినేవారు. అక్కడి వాతావరణం సరిపడకపోవడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, విశ్రాంతిలేని పరిశోధనలు ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 32 పరిశోధనా పత్రాలను ఆయన సమర్పించారు.
 
ఆరోగ్య పరిస్థితి విషమించడంతో 1919 మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చాడు. బొద్దుగా, కొంచెం నల్లగా కనిపించే రామానుజన్ ఇంగ్లండు నుంచి క్షీణించిన అనారోగ్యంతో రావటం చూసి ఆయన అభిమానులు చలించి పోయారు. అనేక రకాల వైద్య వసతులు కల్పించినా ఆయన కోలుకోలేకపోయారు. దీంతో 33 ఏళ్ళకే ఆయన 1926, ఏప్రిల్ 26న పరమపదించారు. రామానుజన్ ఆ కాలంలో సుప్రసిద్ధులైన లీనార్డ్ ఆయిలర్, గాస్, జాకోబీ మొదలైన సహజసిద్ధమైన గణిత మేధావులతో పోల్చదగిన వారు. 
 
1729 సంఖ్యను రామానుజన్ సంఖ్యగా పిలుస్తారు. తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా హార్డీతో 1729 సంఖ్య యొక్క ప్రత్యేకతను తెలియజెప్పి ఆయన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశారు. రామానుజన్ అనారోగ్యంతో హాస్పిటల్లో వున్నపుడు, హార్డీ ఆయనను పలుకరించటానికి వెళ్లి మాటల మధ్యలో తాను వచ్చిన కారు నంబరు 1729, దాని ప్రత్యేకత ఏమైనా ఉన్నదా ? అని అడిగారు. అందుకు రామానుజన్ తడుముకోకుండా ఆ సంఖ్య ఎంతో చక్కని సంఖ్య అని, ఎందుకంటే రెండు విధాలుగా రెండు ఘనముల మొత్తముగా వ్రాయబడే సంఖ్యాసమితిలో అతి చిన్నసంఖ్య అని తెల్పారు. (1729 = 1^3 + 12^3 = 9^3 + 10^3  ). ఈ సంఘటన గణితంపై ఆయనుకున్న అవ్యాజమైన అనురాగానికి, అంకిత భావానికి నిదర్శనం.
 
ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబరులో ‘ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి’ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కాడు. చివరిదశలో రామానుజన్ ‘మ్యాజిక్ స్క్వేర్’, ‘ప్యూర్ మాథ్స్‌కు చెందిన నంబర్ థియరీ’, ‘మాక్ తీటా ఫంక్షన్స్’ చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇనిస్టిట్యూట్‌లో, అమెరికాలోని ‘ఇలినాయిస్’ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతోంది. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును ‘జాతీయ గణితదినోత్సవం’గా ప్రకటించింది.
 
రామానుజన్ స్వరాష్ట్రమైన తమిళనాడు ఆయన సాధించిన విజయాలకు గుర్తుగా ఆయన జన్మదినమైన డిసెంబరు 22ను రాష్ట్ర సాంకేతిక దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రభుత్వం 1962లో రామానుజన్ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, సంఖ్యాశాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడుతూ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది. మద్రాసు విశ్వవిద్యాలయం 'రామానుజన్ ఇనిస్టిట్యూట్'ని నెలకొల్పింది. గత సహస్రాబ్దిలో ప్రపంచానికి అత్యుత్తమ గణితశాస్త్ర సిద్ధాంతాలను, సూత్రాలను అందించిన అత్యుత్తమ అ'గణిత' మేధావి శ్రీనివాస రామానుజన్ భారతీయుడు కావడం మనందరికీ గర్వకారణం.
 
కానీ శ్రీనివాసన్ రామానుజన్ మరణానంతరం అంతటి ప్రతిభ గల గణితశాస్త్ర వేత్తలను భారతదేశం తయారు చేసులేకపోవడం దురదృష్టకరం. మానవ నాగరికత చరిత్రకు గణితాన్ని పరిచయం చేసిన ఆర్యభట్ట, భాస్కరుడు.... ఆ తదనంతరం రామానుజన్ వంటి గణిత మేథావుల పరంపర ఆ తరువాత కొనసాగలేదు. భవిష్యత్తులోనైనా ఈ లోటును నేటి విద్యార్థి లోకం భర్తీ చేయగలదని భావిద్దాం.

- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments