Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నా 40వ పుట్టినరోజు వరకూ నేను ఉండకపోవచ్చు’ అని స్వామి వివేకానంద ఎందుకన్నారు?

బిబిసి
గురువారం, 4 జులై 2024 (17:23 IST)
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించిన కొందరు ప్రముఖులు 40 ఏళ్లలోపే చనిపోయారు. వారిపై ‘‘చోటీ ఉమ్ర్ .. బడీ జిందగీ’’ పేరుతో బీబీసీ ప్రత్యేక కథనాలను 2023లో ఒక సిరీస్‌లా ప్రచురించింది. అందులో భాగంగా అందించిన తొలి కథనం స్వామీ వివేకానందది. ఆయన వర్థంతి (జులై 4) సందర్భంగా మరోసారి అందిస్తున్నాం. 
 
‘‘రసగుల్లా’’ అంటే స్వామీ వివేకానందకు చాలా ఇష్టమని మీకు తెలుసా?
‘‘స్వామీ వివేకానంద ద ఫీస్టింగ్, ఫాస్టింగ్ మాంక్’’ ఇది ఆయన జీవిత చరిత్రకు పెట్టిన పేరు. ఈ పేరులోనే భోజనం అంటే ఆయనకు ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. వేదాలు, వేదాంతాలపై పుస్తకం కొనుగోలు చేయకముందే, ‘‘ఫ్రెంచ్ కుకింగ్ ఎన్‌సైక్లోపీడియా’’ పుస్తకాన్ని ఆయన తీసుకున్నారు. పండ్లల్లో ఆయనకు జామ పండు అంటే చాలా ఇష్టం. లేత కొబ్బరి గుజ్జును పంచదార, ఐస్ వేసుకొని కూడా ఆయన ఇష్టంగా తినేవారు. గాంధీజీలానే ఆయన కూడా మేక పాలు తాగేవారు. వివేకానంద అమితంగా ఇష్టపడే ఆహార పదార్థాల్లో ఐస్‌క్రీమ్ కూడా ఒకటి. ఐస్‌ను ఆయన కుల్ఫీ అని పిలిచేవారు. అమెరికాలోని కనిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య కూడా చాక్లెట్ ఐస్‌క్రీమ్‌ను ఆయన ఆస్వాదించేవారు.
 
ఒకరోజు తన బంధువుల్లో ఒకరైన రామచంద్ర దత్తా... దక్షిణేశ్వర్ దేవాలయానికి రావాలని వివేకానందను కోరారు. అక్కడ రామకృష్ణ పరమహంస అందరికీ రసగుల్లా ఇస్తున్నారని చెప్పారు. ‘‘అక్కడ రసగుల్లా ఇవ్వకపోతే నీ చెవిని నులిమేస్తా’’ అని వివేకానంద అన్నారు. అయితే, అక్కడ అనుకున్నట్లుగానే వివేకానందకు రసగుల్లా ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో రామకృష్ణ పరమహంసకు శిష్యుడిగా వివేకానంద మారారు.
 
వివేకానంద గురించి ఆసక్తికర అంశాలు
వేదాలు, వేదాంతాలపై పుస్తకం కొనుగోలు చేయకముందే, ఫ్రెంచ్ కుకింగ్ ఎనసైక్లోపీడియాను వివేకానంద కొనుగోలు చేశారు. ఆయన రోజూ మేక పాలు తాగేవారు. జామకాయ ఆయనకు ఇష్టమైన పండు. ఐస్‌క్రీమ్ అంటే ఆయనకు మరింత ఇష్టం. శాస్త్రీయ సంగీతంలో ఆయన శిక్షణ తీసుకున్నారు. చాలా సంగీత వాయిద్య పరికరాలను ఎలా వాయించాలో ఆయనకు తెలుసు. మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్‌లో కొన్ని రోజులపాటు ఆయన పాఠాలు చెప్పారు.
 
అప్పుడప్పుడు తనను తాను ‘‘మోటా స్వామీ’’ అని ఆయన పిలుచుకొని జోకులు వేసేవారు. ఆయనకు నిద్ర సరిగా పట్టేది కాదు. ఒక్కోసారి ఎంతో కష్టపడితే ఒక 15 నిమిషాలు నిద్ర పట్టేది. ఒకసారి ఆయన రైలులో వెళ్తున్నప్పుడు, ఆయనను చూసేందుకు ఒక చిన్న రైల్వే స్టేషన్‌లో ప్రజలు పట్టాలపై అడ్డంగా పడుకొని రైలును ఆపారు. జంతువులను పెంచడమంటే కూడా వివేకానందకు చాలా ఇష్టం. తన పెంపుడు కుక్క ‘బాఘా’ను గంగా నదీ తీరంలోని ఒక ప్రార్థనా స్థలం ఆవరణలో పాతిపెట్టారు. ఒకసారి నీరు తాగొద్దని, ఉప్పు కూడా తినొద్దని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో 21 రోజులపాటు ఆయన నీటిని తాగలేదు.
 
చిన్నప్పటి నుంచే సన్యాసి కావాలని..
చిన్నప్పటి నుంచే వివేకానంద కాస్త దురుసుగా ఉండేవారు. కొన్నిసార్లు ఆయనను శాంతింపచేసేందుకు తలపై నీళ్లు పోసేవారు. అయితే, సన్యాసులతో కలిసి తిరగడమంటే ఆయనకు చాలా ఇష్టం. సాధువుల స్వరం వినిపించిన వెంటనే గబగబా ఇంటి నుంచి బయటకు వచ్చేవారు. ఒక్కోసారి ఆయన్ను నిలువరించేందుకు, గదిలో పెట్టి తాళం వేసేవారు. సాధువులు వెళ్లిన తర్వాతే మళ్లీ ఆ గదిని తెరిచేవారు. పిల్లలు అక్షరాలు నేర్చుకునే వయసులోనే వివేకానందకు చదవడం, రాయడం కూడా వచ్చు. అంతేకాదు ఆ వయసులోనే సన్యాసి అవుతానని ఆయన చెప్పేవారు. ఆయన మేధాశక్తి అద్భుతంగా ఉండేది. ఒకసారి చదివితే చాలు, ఆ పుస్తకంలో విషయాలన్నీ ఆయనకు గుర్తుండేవి. స్విమ్మింగ్, కుస్తీ, కర్రసాము అంటే కూడా ఆయనకు ఇష్టం.
 
రాయ్‌పుర్‌లో ఉండేటప్పుడు చదరంగం (చెస్) ఆడటంలోనూ ఆయన నైపుణ్యం సాధించారు. శాస్త్రీయ సంగీతంలోనూ ఆయన శిక్షణ తీసుకున్నారు. పఖావజ్, తబలా, ఇస్‌రాజ్, సితార్ లాంటివి కూడా ఆయన మెరుగ్గా వాయించేవారు. అయితే, పాటలు పాడటం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ పాటలే ఆయన్ను తన గురువు రామకృష్ణ పరమహంసకు చేరువ చేశాయి. ఒకసారి రామకృష్ణ పాటలు వింటూనే వివేకానంద "జ్ఞాన సమాధి"లోకి వెళ్లిపోయారు.
 
పరమహంసకు శిష్యుడిగా..
అందరి తండ్రుల్లానే వివేకానంద తండ్రి కూడా తన కొడుక్కు పెళ్లి చేయాలని భావించేవారు. కానీ, రామకృష్ణ పరమహంస దీనికి వ్యతిరేకం. బ్రహ్మచర్యం తీసుకొని, జీవితాంతం సన్యాసిలా బతకాలని వివేకానంద భావించారు. అయితే, తండ్రి చనిపోయిన తర్వాత ఇంట్లో పెద్దకొడుకు కావడంతో కుటుంబ భారం వివేకానందపై పడింది. అప్పుడే మెట్రోపాలిటన్ ఇన్‌స్టిట్యూట్‌లో పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు వివేకానంద. వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస నైతిక ఆధ్యాత్మికత, నిరాడంబరతకు పెట్టింది పేరు. తన సందేశం ప్రపంచం మొత్తానికి వివేకానంద ద్వారా చేరాలని రామకృష్ణ భావించేవారు.
 
అయితే, 1886లో రామకృష్ణ ఆరోగ్యం చాలా వేగంగా విషమించడం మొదలైంది. ఆయనకు గొంతు క్యాన్సర్ వచ్చింది. అప్పుడే తన శిష్యులను పిలిచి వివేకానంద తన వారసుడని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత 1886, ఆగస్టు 16న రామకృష్ణ మహాసమాధిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత రామకృష్ణ మిషన్‌ను వివేకానంద ఏర్పాటుచేశారు. 1898లో కోల్‌కతాలో ప్లేగు మహమ్మారి విజృంభించింది. దీంతో వేల మంది కోల్‌కతాను వదిలి తమ సొంత ఊళ్లకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. ప్రజల్లో భయాన్ని తొలగించేందుకు నగరంలో సైన్యాన్ని మోహరించారు. అప్పుడు వివేకానంద కోల్‌కతాలోనే ఉన్నారు. ప్రజల కోసం ఆయన సహాయక చర్యలు మొదలుపెట్టారు.
 
మంచి వ్యక్తిత్వం
వివేకానంద సరైన సమయంలో తెలివైన నిర్ణయాలను ఆయన తీసుకునేవారు. ఆయన ఆలోచనలు కూడా చాలా తార్కికంగా ఉండేవి. శారీరకంగానూ ఆయన దృఢంగా ఉండేవారని ‘‘లైఫ్ ఆఫ్ వివేకానంద’’ పుస్తకంలో రోమ్యా రోలా పేర్కొన్నారు. ‘‘స్వామీ శరీరం చాలా దృఢంగా, కుస్తీ యోధుడిలా ఉండేది. ఆయన ఎత్తు 5.8 అడుగులు. ఛాతీ విశాలంగా ఉండేది. స్వరం కూడా అద్భుతంగా వినిపించేది’’ అని రోమ్యా చెప్పారు. ‘‘విశాలమైన ఆయన నుదురు, గుండ్రని పెద్ద కళ్లు అందరి దృష్టిని ఆకర్షించేవి. ఆయన అమెరికా వెళ్లినప్పుడు ఒక జర్నలిస్టు ఆయన బరువు 102 కేజీలు ఉండొచ్చని అంచనా వేశారు. కొన్నిసార్లు వివేకానంద తనను ‘‘మోటా స్వామీ’’అని నవ్వుతూ చెప్పుకొనేవారు’’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఆయనకు అన్నింటికంటే పెద్ద సమస్య నిద్ర. మంచంపై అటూఇటూ చాలాసేపు దొర్లేవారు. కానీ, నిద్ర మాత్రం వచ్చేది కాదు. ఒక్కోసారి ఎంతో కష్టపడితే కేవలం 15 నిమిషాలు మాత్రమే ఆయనకు నిద్రపట్టేది.
 
మైసూర్ మహారాజానే పంపించారు..
ప్రపంచం మొత్తాన్ని చుట్టిరావాలని ఒకసారి వివేకానంద భావించారు. మొదట ఆయన వారణాసికి వెళ్లారు. అక్కడే చాలా మంది పండితులు, సన్యాసులతో ఆయన మాట్లాడారు. ఆ తర్వాత బుద్ధుడు తన తొలి ఉపదేశమిచ్చిన సార్‌నాథ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అయోధ్య, లఖ్‌నవూల మీదుగా ఆయన ఆగ్రా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన బాంబేకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన పుణె వెళ్లారు. అనుకోకుండా అప్పుడు ఆయన, బాల్ గంగాధర్ తిలక్ ఒకే కారులో ప్రయాణించారు. అప్పుడే తిలక్, వివేకానందల మధ్య లోతైన చర్చ జరిగింది. పుణెలో తన ఇంటికి రావాలని వివేకానందను తిలక్ ఆహ్వానించారు. దీంతో పది రోజులు అక్కడే వివేకానంద ఉన్నారు. ఆ తర్వాత రైలులో బెంగళూరుకు వెళ్లారు.
 
అక్కడి నుంచి ఆయన మైసూరుకు వెళ్లారు. మహారాజా అతిథిగా అక్కడ కొన్ని రోజులు బస చేశారు. ఒక రోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అని మహారాజా ఆయన్ను అడిగారు. దీంతో అమెరికాకు వెళ్లి భారత సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉందని స్వామీజీ చెప్పారు. వెంటనే అమెరికా పర్యటకు అయ్యే ఖర్చు మొత్తాన్నీ తానే భరిస్తానని మహారాజా చెప్పారు. మొదట దానికి వివేకానంద అంగీకరించలేదు. కానీ, కొన్ని రోజుల తర్వాత ఒప్పుకున్నారు.
 
ధర్మ సంసద్‌లో ప్రసంగం
1893 మే 31న మద్రాసు నుంచి స్టీమర్ ‘పెనిన్‌సులా’లో తన అమెరికా ప్రయాణాన్ని వివేకానంద మొదలుపెట్టారు. మాతృభూమి కనుచూపు మేరలో కనిపించేంత వరకూ ఆయన స్టీమర్ డెక్‌పైనే నిలబడ్డారు. కొలంబో, పెనాంగ్, సింగపూర్, హాంకాంగ్‌ల మీదుగా ఆ స్టీమర్ నాగాసాకీ చేరుకుంది. జులై 14న జపాన్ పోర్టు యోకోహామా నుంచి ‘ఈంప్రెస్ ఆఫ్ ఇండియా’ నౌకపై ఆయన అమెరికాకు పయనమయ్యారు. అప్పుడు భారత్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలో ఒకరైన జమ్‌శెద్‌జీ టాటా కూడా వివేకానందతో ఉన్నారు. వీరిద్దరి మధ్య అలా స్నేహబంధం చిగురించింది.
 
వైంకువర్ నుంచి ఆయన షికాగోకు రైలులో వెళ్లారు. ఆనాడు షికాగోలో జరిగిన ధర్మ సంసద్‌లో ప్రపంచ దేశాలకు చెందిన వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో అత్యంత చిన్న పిన్న వయస్కుడు వివేకానందానే. ‘ద ప్రొఫెట్ ఆఫ్ మోడెర్న్ ఇండియా, స్వామీ వివేకానంద’లో ఆనాడు షికాగోలో చోటుచేసుకున్న పరిణామాలను గౌతమ్ ఘోష్ రాసుకొచ్చారు. '‘మాట్లాడేవారి వరుసలో వివేకానంద సంఖ్య 31. కానీ, చివర్లో మాట్లాడతానని వారిని ఆయన అభ్యర్థించారు. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. మొదట గొంతు కూడా భయంతో పూడుకుపోయింది.
 
నిజానికి ఆయన ప్రసంగాన్ని సిద్ధం చేసుకోలేదు. కానీ, సరస్వతీదేవిని ఒకసారి తలచుకొని వేదికపైకి అడుగుపెట్టారు. డాక్టర్ బైరోజ్ ఆయన పేరును పిలిచిన వెంటనే.. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అంటూ ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దీంతో రెండు నిమిషాలపాటు అక్కడకు వచ్చినవారు చప్పట్లు కొడుతూనే ఉన్నారు’’ అని గౌతమ్ రాశారు.
 
సర్వమత సమానత్వం కోసం
చప్పట్లు ఆగిన వెంటనే తన ప్రసంగాన్ని వివేకానంద మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆయన భారత్ తరఫున అమెరికాకు ధన్యవాదాలు చెప్పారు. హిందూమతం ప్రపంచానికి ‘‘సహనం’’ అనే పాఠాన్ని నేర్పిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచంలో ఏ మతం తక్కువా కాదు, ఏ మతం ఎక్కువా కాదు అని ఆయన అన్నారు. అన్ని మతాలు ఏదో ఒక రూపంలో దేవుడిని చేరుకునేందుకు మార్గం చూపిస్తాయని వివరించారు. ఆయన ప్రసంగం తర్వాత, అమెరికాలోని చాలా నగరాలకు చెందిన ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ఈ ప్రసంగమే ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులను తీసుకొచ్చింది. ఆ ఏడాది మొత్తంలో అమెరికాలోని తూర్పు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.
 
భారత్‌కు తిరిగివచ్చేటప్పుడు ఆయన కొన్నిరోజులు ఇంగ్లండ్‌లో ఉన్నారు. అప్పుడే ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. బిపిన్ చంద్రపాల్‌ను కూడా ఆయన ఇంగ్లండ్‌లోనే కలిశారు. వివేకానంద భారత్‌కు వచ్చినప్పుడు, ఆయనకు స్వాగతం పలికేందుకు వీధుల్లో ప్రజలు వరుసగా నిలబడ్డారు. మొదట ఆయన మద్రాసులో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన కుంభకోణం వెళ్లారు. ప్రతిచోటా ఆయన్ను చూసేందుకు ప్రజలు వరుసకట్టారు. అయితే, ఒక చిన్న స్టేషన్‌లో ప్రజలు ఆయన్ను చూసేందుకు రైలు పట్టాలపై అడ్డుగా పడుకున్నారు. దీంతో ఆ స్టేషన్‌లో రైలును ఆపాల్సి వచ్చింది.
 
అనారోగ్యంతో..
1901 డిసెంబరులో కాంగ్రెస్ సమావేశాలు కోల్‌కతాలో నిర్వహించారు. వీటిలో పాల్గొనేందుకు వచ్చిన చాలా మంది నాయకులు బేలూర్ వచ్చి స్వామిని చూసేవారు. రాజకీయ, సామాజిక, మతపరమైన అంశాలపై వారితో స్వామీజీ మాట్లాడేవారు. అలా వచ్చిన వారిలో బాల గంగాధర్ తిలక్‌, జగదీశ్ చంద్రబోస్ కూడా ఉన్నారు. వివేకానందకు జంతువులను పెంచడమంటే కూడా ఇష్టం. తన ఆశ్రమం పరిసరాల్లో బాతులు, గొర్రెలు, ఆవులు, మేకలు కూడా ఆయన పెంచేవారు. వాటిని ఆహారాన్ని స్వయంగా ఆయనే పెట్టేవారు. తన పెంపుడు కుక్క ‘బాఘ’’ అంటే ఆయనకు చాలా ఇష్టం. అది మరణించిన తర్వాత, గంగా నదీ తీరంలోని ఒక ప్రార్థనా స్థలం ఆవరణలో సమాధి చేశారు.
 
స్వామి వివేకానంద ఆరోగ్యం ఎప్పుడూ బావుండేది కాదు. ఆయన కాళ్లు ఎప్పుడూ వాచిపోయి ఉండేవి. కుడి కంటి చూపు కూడా నెమ్మదిగా మందగించింది. ఆయనకు ఎప్పుడూ జ్వరం ఉండేది. శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యేది. ఎడమ ఛాతీలో ఆయనకు తరచూ నొప్పి వస్తుండేది. తండ్రిలానే ఆయనకు కూడా మధుమేహం ఉండేది. వారణాసి నుంచి ఇంటికి వచ్చి తర్వాత ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. అప్పుడే ప్రముఖ వైద్యుడు సహానంద్ సేన్‌గుప్తాను ఆయన కలిశారు. అప్పుడే నీరు తాగొద్దని, ఉప్పు కూడా తీసుకోవద్దని స్వామీజీకి సూచించారు. ఆ తర్వాత 21 రోజులు స్వామీజీ నీరు తీసుకోలేదు.
 
చివరి రోజు మూడు గంటలు ధ్యానం
మరణానికి రెండు రోజుల ముందు, తనతోపాటు పనిచేసే సిస్టర్ నివేదితకు తన చేతులోనే భోజనం వడ్డిస్తానని స్వామీజీ చెప్పారు. చేతులు కడుక్కోవడానికి నీరు కూడా ఆయన ఇచ్చారు. ‘‘నిజానికి ఇలాంటివన్నీ మీకు మేం చేయాలి’’అని ఆ రోజు నివేదిత అన్నారు. ‘‘ఏసు ప్రభు కూడా తన శిష్యులు చేతులు కడుక్కోవడానికి నీరు ఇచ్చేవారు’’అని ఆయన సమాధానం ఇచ్చారు. మహాసమాధి జరిగిన రోజున వివేకానంద చాలా త్వరగా లేచారు. ఆ తర్వాత ప్రార్థనా స్థలంలోని గర్భాలయంలోకి వెళ్లి తలుపులు, కిటికీలను ఆయన మూసివేశారు. మూడు గంటలపాటు ఆయన లోపల ధ్యానం చేశారు. ఆ తర్వాత శిష్యులతో కలిసి ఆయన భోజనం చేశారు.
 
నాలుగు గంటల సమయంలో ఆయన వేడి పాలు తాగారు. ఆ తర్వాత బాబూరాం మహారాజ్‌తో కలిసి వాకింగ్‌కు వెళ్లారు. సాయంత్రం ప్రార్థనల గంట మోగినప్పుడు, వివేకానంద తన గదిలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ధ్యానం చేస్తూ కనిపించారు. సాయంత్రం 8 గంటలకు ఒక శిష్యుడిని పిలిచి తల దగ్గర ఫ్యాన్ పెట్టాలని సూచించారు. అప్పుడు ఆయన నిద్రపోతూ కనిపించారు. గంట తర్వాత ఆయన నుదుటపై చెమటలు కనిపించాయి. ఆయన చేతులు కూడా వణికేవి. అప్పుడు ఆయన దీర్ఘ శ్వాస తీసుకున్నారు. అంతా అయిపోయిందని చెప్పడానికి అది సంకేతం కావచ్చు. రాత్రి 9.10 గంటలకు ఆయనను నిద్ర లేపేందుకు స్వామి ప్రేమానంద్, స్వాతి నిశ్చయానంద్ ప్రయత్నించారు. కానీ, స్వామి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
 
కార్డియాక్ అరెస్టుతో
వెంటనే స్వామిని చూసేందుకు డాక్టర్ మహేంద్రనాథ్ మజుమ్‌దార్ వచ్చారు. కృత్రిమ శ్వాసను అందించేందుకు ప్రయత్నించారు. కానీ, ఫలితం కనిపించలేదు. దీంతో కార్డియార్ అరెస్టుతో ఆయన మరణించినట్లు ధ్రువీకరించారు. తెల్లవారుజామునే సిస్టర్ నివేదిత వచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలవరకూ స్వామి చేతులను పట్టుకుని ఆమె అలానే కూర్చుకున్నారు. 39 ఏళ్ల ఐదు నెలల 22 రోజులకు ఈ ప్రపంచాన్ని వదిలి స్వామీ వివేకానంద వెళ్లిపోయారు. తను 40 ఏళ్ల వరకూ బతకనేమోననే ఆయన అంచనాలే నిజమయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments