Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం: ఇక్కడ శవ దహనానికి టోకెన్ తీసుకోవాలా? ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

Webdunia
గురువారం, 20 మే 2021 (16:50 IST)
విశాఖపట్నంలో జ్ఞానాపురం కైలాస భూమి (శ్మశానం) నుంచి వచ్చే చితి మంటల వెలుగులు... పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం కనిపిస్తూనే ఉన్నాయి. ఉదయం ఏడు గంటలకే శ్మశానాల ముందు అంబులెన్సుల వరుసలు కనిపిస్తున్నాయి. శ్మశానాలపై ఒత్తిడి పెరుగుతుండటంతో టోకెన్ విధానంలో శవ దహనాలు చేస్తున్నామని సిబ్బంది చెబుతుండగా, సౌకర్యాల పెంపుపై దృష్టి పెట్టామని అధికారులు చెబుతున్నారు.

 
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ మరణాలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. విశాఖపట్నంలోని శ్మశాన వాటికల్లో సిబ్బంది 24 గంటలూ షిఫ్టుల్లో పని చేసినా... ఇంకా దహన సంస్కారాల కోసం ఎదురు చూసే మృతదేహాలు క్యూలో ఉంటున్నాయి. దాదాపు అన్ని మతాల శ్మశాన వాటికల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నంలో మే 19న కోవిడ్ బారిన పడి 11 మంది మరణించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటెన్‌ పేర్కొంది. గత 15 రోజుల బులెటిన్లు చూస్తే మృతుల సంఖ్య ప్రతి రోజూ 9 నుంచి 12 మధ్యే ఉన్నట్లు అర్థమవుతోంది.

 
అయితే, విశాఖలోని కోవిడ్ మృత దేహాల దహనానికి అనుమతులున్న జ్ఞానాపురం శ్మశాన వాటికకు రోజూ 60 నుంచి 70 వరకు మృతదేహాలు వస్తున్నట్లు అక్కడ సిబ్బంది చెప్తున్నారు. మామూలు రోజుల్లో ఈ వాటికకు 10- 15 మృత దేహాలు మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు దానికి నాలుగైదు రెట్లు అధికంగా వస్తున్నాయి.

 
మృత దేహాలకు టోకెన్లు
జీవీఎంసీ నిర్వహిస్తున్న జ్ఞానాపురం శ్మశాన వాటికలో దహనాల కోసం ఆరు ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. అయితే ఇక్కడికి వస్తున్న మృత దేహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటంతో ఖాళీగా ఉన్న ప్రతి చోటా దహనం చేస్తున్నారు. విశాఖలోని కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే శ్మశాన ప్రాంగణమంతా కూడా భగభగమండే మంటలు 24 గంటలూ కనిపిస్తున్నాయి. ఆ చితి మంటలు రగులుతూ ఉండగానే... మరిన్ని మృతదేహాలు దహనాలకు సిద్ధంగా ఉంటున్నాయి.

 
''ఇక్కడ 24 గంటలూ పని చేస్తూనే ఉంటున్నాం. అయినా క్యూలైన్‌ మాత్రం తగ్గడం లేదు. రోజూ ఇంత పెద్ద ఎత్తున శవ దహనాలు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. మా కుటుంబ సభ్యులు భయపడుతుండటంతో నేను ప్రస్తుతం విధులకు వెళ్లడం లేదు. రోజూ అక్కడే పని చేసే నేనే ఈ దృశ్యాలను చూడలేక పోయాను'' అని దహన సంస్కారాలకు రశీదు ఇచ్చే రాము అనే ఉద్యోగి బీబీసీతో అన్నారు. అంత్యక్రియల కోసం ఒక్కొక్కరు పది పదిహేను గంటలు వేచి చూడాల్సి వస్తోందని, కొందరు సిబ్బందితో గొడవ కూడా పడుతున్నారని రాము చెప్పారు. ''ఎమ్మెల్యేలు కూడా ఫోన్‌లు చేసి తమకు తెలిసిన వారి డెడ్‌బాడీకి త్వరగా అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మృతదేహాల దహనానికి టోకెన్ నంబర్లు ఇవ్వడం ప్రారంభించాం'' అని రాము వెల్లడించారు.

 
అటు మండుటెండలు... ఇటు చితి మంటలు
ఉత్తరాంధ్రలో వైద్యానికి పెద్ద దిక్కు విశాఖపట్నమే. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల నుంచి కూడా వైద్యం కోసం విశాఖకే వస్తుంటారు. తూర్పు, పశ్చిమ గోదావరి నుంచి కూడా కోవిడ్ బాధితులు మెరుగైన వైద్యం కోసం విశాఖలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్నారు. వీరిలో ఎవరు మరణించినా వారి అంత్యక్రియలు విశాఖలోనే చేస్తున్నారు. దీంతో విశాఖ శ్మశానాలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.

 
సిబ్బంది సరిపోక పోవడంతో స్వచ్ఛంద సంస్థలు కూడా వీరికి సహాయం చేస్తున్నాయి. "విశాఖలో అతి పెద్ద శ్మశాన వాటిక జ్ఞానాపురమే. ఇక్కడ 12 మంది సిబ్బంది ఉన్నారు. కోవిడ్ బారిన పడటంతో వారిలో సగంమంది విధులకు హాజరు కావడం లేదు. కొందరు స్వచ్ఛందంగా వచ్చి మాకు సహకరిస్తున్నారు. పీపీఈ కిట్లు వేసుకుని వస్తే కుటుంబ సభ్యులే దహన సంస్కారాలు చేసుకోవచ్చు. కానీ భయపడి చాలామంది అలా రావడం లేదు'' అని శ్మశానం ఇంఛార్జ్‌ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి విశ్రాంతి కూడా దొరకడం లేదని, మండుటెండలో పీపీఈ కిట్లు వేసుకుని గంటల తరబడి చితి మంటల వద్ద ఉండటం చాలా కష్టంగా ఉందని ప్రసన్న కుమార్ అంటున్నారు

 
శ్మశానంలో మంటలు కాదు.. మంటల్లో శ్మశానం
ఒక శవం కాలే లోపు పది శవాలు వస్తున్నయని జ్ఞానాపురం శ్మశాన వాటిక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు చెబుతున్నారు. ''ఇక్కడి చితి మంటలు చూస్తే శ్మశాన వాటికే మంటల్లో ఉందా అనిపిస్తోంది'' అని ఇక్కడ స్వచ్ఛంద సాయం అందిస్తున్న మణికేశ్వర్ వ్యాఖ్యానించారు. ఈ శ్మశాన వాటికలో ఉన్న ఎలక్ట్రికల్ క్రిమేటోరియంలో రోజుకు 10 కంటే ఎక్కువ దహనాలు చేయలేరు. దాంతో మిగతావన్నీ కట్టెలతో చేయాల్సి వస్తోందని మణికేశ్వర్ అన్నారు.

 
దహన సంస్కారాల తర్వాత చాలామంది అస్తికలు తీసుకోవడానికి కూడా రావడం లేదని, కొందరు హోం సర్వీసు లేదంటే ఫలానా ప్రదేశానికి తీసుకు రావాల్సిందిగా కోరుతున్నారని మణికేశ్వర్ చెప్పారు. ''ఫస్ట్ వేవ్‌లో 20 శవాలు వస్తే, సెకండ్ వేవ్‌లో 40 వస్తున్నాయి. ఇక్కడున్న కట్టెలు కూడా సరిపోవడం లేదు. అంతిమ క్రియలు చేసే సమయం కూడా ఉండటం లేదు. దీంతో అన్నింటిని మమ అనిపిస్తున్నాం'' అని ఇక్కడ పని చేస్తున్న పురోహితుడొకరు అన్నారు.

 
శ్మశానం నిండుకుంది...
"విశాఖలో క్రిస్టియన్ల కోసం జీవీఎంసీ సమీపంలోని 'వాల్తేరు సెమెట్రీ' ఉంది. అది సమాధులతో నిండిపోయింది. ఇక్కడ 10వేల సమాధులకే చోటు ఉంది. 1864 నుంచి చనిపోయిన క్రిస్టియన్లను ఇక్కడే సమాధి చేస్తున్నారు. ఇప్పుడు కోవిడ్ సమయంలో మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఇక్కడ చోటు సరిపోవడం లేదు. ఏ చిన్న ఖాళీ ఉన్నా అక్కడే సమాధి చేస్తున్నాం" అని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరమ్ అధ్యక్షుడు అలీవర్ రాయ్ చెప్పారు.

 
ముస్లిం మతస్తులకు విశాఖలో పలు చోట్ల శ్మశానాలు ఉన్నాయి. అయితే అవి చిన్నవి. దీంతో ముస్లింలకు కూడా ఈ కోవిడ్ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. "కోవిడ్ మృతులు పెరుగుతున్న నేపథ్యంలో మేం ఆయా ప్రాంతాల్లో మసీదు కమిటీలను ఏర్పాటు చేశాం. వారే కోవిడ్ మృతులను ఏ శ్మశానంలో సమాధి చేయాలనే నిర్ణయం తీసుకుంటారు. కోవిడ్ అదుపులోకి రాకపోతే మాత్రం ఖబరస్థాన్‌లను పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది'' అని మర్రిపాలెం మసీదు కమిటీ సభ్యుడు ఇస్మాయిల్ అన్నారు.

 
అందరి అంత్యక్రియలు ఇక్కడే...
విశాఖలో ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులైన కేజీహెచ్‌, విమ్స్‌, చెస్ట్ ఆసుపత్రులతో పాటు అనేక ప్రైవేటు ఆసుపత్రులు కూడా కోవిడ్‌కు వైద్యం అందిస్తున్నాయి. వీటన్నింటిలో రోజూ కనీసం 50 మంది కంటే ఎక్కువే మరణిస్తున్నారు. మార్చురీలలో ఉన్న మృతదేహాలు వీటికి అదనం. "జ్ఞానాపురం శ్మశాన వాటికపై ఒత్తిడిని తగ్గించేందుకు మరో 15 శ్మశాన వాటికలను ఎంపిక చేశాం. సమీప ఆసుపత్రుల్లో మృతి చెందిన కోవిడ్‌ బాధితుల మృతదేహాలను అక్కడికి తరలించి అంత్యక్రియలు నిర్వహించాలని జీవీఎంసీ అధికారులకు సూచించాం'' అని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ జీఎస్ఎల్‌జీ శాస్త్రి బీబీసీతో అన్నారు.

 
శ్మశానానికి వచ్చే అన్ని మృత దేహాలూ కోవిడ్ మరణాలు కాదన్నారు డాక్టర్ శాస్త్రి. ఇతర వ్యాధులతో చనిపోయేవారు, సహజ మరణాలు కూడా ఉంటాయని, కోవిడ్ కారణంగా మరణించిన వారిని వారి సొంత ప్రాంతాలకు తీసుకు వెళ్లడం లేదని, దీంతో విశాఖ శ్మశాన వాటికలపై ఒత్తిడి పెరుగుతోందని డాక్టర్ శాస్త్రి వివరించారు.

 
సీసీటీవీలు... టోల్ ఫ్రీ నెంబర్...
విశాఖలో అంత్యక్రియల సమస్య తీవ్రం కావడంతో అధికారులు శ్మశానాల బాట పట్టారు. జీవీఎంసీ కమిషనర్ సృజన, మేయర్ హరివెంకట కుమారి.... జ్ఞానాపురంతో పాటు ఇతర శ్మశానాలను పరిశీలించారు. కోవిడ్ మృతుల కోసం ప్రత్యేకంగా కొన్ని శ్మశాన వాటికలను ఎంపిక చేశారు. ఇక్కడ అంత్యక్రియల నిర్వహణకు సిబ్బంది, కట్టెలు, ఇంధనం వంటి ఖర్చులతో కలిపి రూ.3 వేలు రుసుం నిర్ణయించారు. అలాగే ఏ జోన్‌లో మరణిస్తే వారిని ఆ జోన్ శ్మశాన వాటికల్లోనే దహనం చేసేలా నిర్ణయించారు.

 
''సిబ్బంది ఎక్కువ వసూలు చేసినా, ఏవైనా ఇతర సమస్యలున్నా బాధితులు ఫోన్ చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబరు (180042500009) ఏర్పాటు చేశాం. అలాగే సీసీటీవీలను పెంచాలని అధికారులను ఆదేశించాం. కొత్తగా మరిన్ని శ్మశాన వాటికల ఏర్పాటు జరుగుతుండటంతో అంత్యక్రియల సమస్యలు త్వరలో తీరిపోతాయి" అని జీవీఎంసీ కమిషనర్ సృజన వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha : త్రిష సంచలనం నిర్ణయం.. సినిమాలను పక్కనబెట్టి విజయ్‌తో పొలిటికల్ జర్నీ?

టికెట్ రేట్లు పెంచడంకంటే కంటెంట్ చిత్రాలు తీయండి : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కానిస్టేబుల్స్ అంటే నాకు చాలా ఇష్టం : కమీషనర్ సి.వి.ఆనంద్

సంబరాల ఏటిగట్టు సెట్ లో సాయిదుర్గ తేజ్ ఫ్యాన్స్ కు ఏంచెప్పారో తెలుసా

శివరాత్రికి ప్రజ్వల్ దేవరాజ్ రాక్షస సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినాలో ఘనంగా రంగోలి పోటీలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

డయాబెటిస్‌‌‌‌కు బై చెప్పే సూపర్ టీ.. రోజుకు 2 కప్పులు.. 3 వారాలు తీసుకుంటే?

జాతీయ బాలికా దినోత్సవం 2025 : సమాజంలో బాలికల ప్రాముఖ్యత ఏంటి?

తర్వాతి కథనం
Show comments