Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: వారసుల ఫస్ట్ ఫైట్ గురూ... ఎవరు గెలుస్తారో?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (13:28 IST)
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి కొత్త రక్తం ఉరకలేస్తోంది. మునుపెన్నడూ లేనట్లుగా పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు అరంగేట్రం చేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు. కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ కుమారులను పోటీకి నిలపగా.. మరికొందరు మాత్రం తాము పోటీలో ఉంటుండగానే సంతానాన్నీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు.
 
అసెంబ్లీ బరిలో..
ఈసారి అసెంబ్లీ బరిలో ఉన్న రాజకీయ వారసుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ది. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడడం ఇదే తొలిసారి. మంత్రిగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన ప్రజల ముందుకు ఓట్ల కోసం వెళ్లడం ఇదే ప్రథమం. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు.
 
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీపడుతున్న గౌతు శిరీషకు ఇవే తొలి ఎన్నికలు. ఆమె తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత పలాస నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు సోంపేట నుంచి శివాజీ అయిదుసార్లు విజయం సాధించారు. శివాజీ తండ్రి గౌతు లచ్చన్న కూడా సోంపేట నుంచి అయిదుసార్లు శాసనసభకు గెలిచారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న శిరీష.. తన తాత, తండ్రిల వారసురాలిగా తొలిసారి ఎన్నికల క్షేత్రంలో దిగుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈసారి ఇద్దరు వారసులు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు.
 
విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అదితి గజపతి రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తె. అశోక్ విజయనగరం శాసనసభా స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో పలుమార్లు మంత్రిగానూ పనిచేశారు. 2014లో విజయనగరం నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశారు. ఇదే జిల్లాలో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కిమిడి నాగార్జున పోటీ చేస్తున్నారు. నాగార్జున తల్లి కిమిడి మృణాళిని 2014లో ఈ నియోజకవర్గం నుంచే గెలిచి కొద్దికాలం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. నాగార్జున తండ్రి గణపతి రావు కూడా 1999లో శ్రీకాకుళం జిల్లా ఉణుకూరు(డీలిమిటేషన్ తరువాత రద్దయింది) శాసనసభ స్థానం నుంచి గెలిచారు. గణపతిరావు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, మంత్రి కళావెంకటరావుకు స్వయానా సోదరుడు.
 
విశాఖ జిల్లాలో అరకు అసెంబ్లీ స్థానానికి పోటీపడుతున్న టీడీపీ అభ్యర్థి కిడారి శ్రావణ్ కుమార్‌కు ఇవే తొలి ఎన్నికలు. శ్రావణ్ తండ్రి సర్వేశరరావు 2014లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2018లో మావోయిస్టులు ఆయన్ను హతమార్చారు. అనంతరం కొద్దికాలానికి శ్రావణ్‌కు చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ప్రస్తుతం ఆయన తొలి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఇదే జిల్లాలోని గాజువాక స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి సోదరుడు.
 
పవన్ జనసేన పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చినా ఆయన కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ పోటీ చేయలేదు. అంతకుముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడూ పవన్ బరిలో దిగలేదు. ఇప్పుడు తొలిసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి కూడా పవన్ పోటీ చేస్తున్నారు.
 
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి భవానీకి ఇవే తొలి ఎన్నికలు. ఆమె కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమార్తె. భవానీ సోదరుడు రామ్మోహననాయుడు 2014లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు. చిన్నాన్న అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశారు.
 
పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోట వాణికి కూడా ఇవి తొలి ఎన్నికలు. ఆమె కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి. వాణి తండ్రి మెట్ల సత్యనారాయణ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజానగరం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు. రాజా తల్లి విజయలక్ష్మి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రాజా ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌తో తలపడుతున్నారు.
 
కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్‌కు ఇది తొలి ఎన్నికలు. ఆయన తండ్రి నెహ్రూ గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ జిల్లాలోని పెడన నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ కూడా తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఈయన తండ్రి కాగిత వెంకటరావు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. మైలవరంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న షబానా ఖాతూన్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె.
 
గుంటూరు జిల్లాలో గురజాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసు మహేశ్ రెడ్డి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు. కృష్ణారెడ్డి తండ్రి వెంగళరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి స్వయాన సోదరుడు. మంగళగిరి నియోజకవర్గం నుంచి చంద్రబాబు తనయుడు లోకేశ్ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గాలి భానుప్రకాశ్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి కుమారుడు.

ముద్దుకృష్ణమ నాయుడి మరణంతో ఈ ఎన్నికల్లో టీడీపీ ఆయన కుమారుడికి సీటిచ్చింది. గంగాధర నెల్లూరు నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచిన హరికృష్ణకు ఇవే తొలి ఎన్నికలు. ఆయన తల్లి కుతూహలమ్మ అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికీ ఇవే తొలి ఎన్నికలు. ఆయన తండ్రి బొజ్జల గోపాలరెడ్డి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పంతంగాని నర్సింహప్రసాద్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన చిత్తూరు ఎంపీగా పనిచేసిన శివప్రసాద్ అల్లుడు. కర్నూలు జిల్లాలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన తండ్రి టీజీ వెంకటేశ్ ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు. ఆయన తండ్రి కేఈ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
 
ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి గంగుల ప్రతాపరెడ్డి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికీ ఇవే మొదటి ఎన్నికలు. ఆయన తండ్రి శిల్పా మోహనరెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. మోహనరెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుంచి పోటీ చేస్తున్నారు. బనగానపల్లె జనసేన అభ్యర్థి అరవింద్ రాణి, శ్రీశైలం జనసేన అభ్యర్థి సుజల ఇద్దరూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెలు.

ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా ఇదే జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి బరిలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ తల్లి సునీత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి పరిటాల రవి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి తండ్రి ప్రభాకరరెడ్డి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే.
 
ఏపీ లోక్‌సభ అభ్యర్థుల్లో
ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థుల్లోనూ తొలిసారి పోటీ చేస్తున్న వారసులున్నారు. అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేస్తున్న గంటి హరీశ్ మాధుర్‌కు ఇవి తొలి ఎన్నికలు. లోక్‌సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీశ్. విశాఖ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలుస్తున్న టీడీపీ నేత భరత్ గతంలో ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసిన ఎంవీవీఎస్ మూర్తి మనవడు. అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డికి ఇవి తొలి ఎన్నికలు. ఆయన తండ్రి దివాకరరెడ్డి ఎంపీగా, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు.
 
రాజమండ్రి లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి మాగంటి రూప ఎంపీ మురళీమోహన్‌కు స్వయాన కోడలు. నరసాపురం లోక్‌సభ స్థానం జనసేన అభ్యర్థి నాగబాబు కేంద్ర మాజీ మంత్రి చిరంజీవికి సోదరుడు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్ మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్ రావు కుమారుడు. నరసరావుపేట వైసీపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయులుకు ఇవే తొలి ఎన్నికలు. ఆయన తండ్రి రత్తయ్య 2009లో మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
 
అరకు లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి శ్రుతిదేవి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి కిశోర్ చంద్రదేవ్ కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి అరకు లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. దీంతో శ్రుతి తొలి ఎన్నికల్లోనే తండ్రిపై పోటీ చేస్తున్నట్లయింది.
 
రాజకీయాలు తనకు కొత్త కాదని, 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నానని అరకు(ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైరిచర్ల శ్రుతి దేవి అన్నారు. ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''నాన్నగారికి (కిశోర్ చంద్రదేవ్) నేను రాజకీయ వారసురాలు అనుకోవడం లేదు. ఆయన పార్టీ మారిన విషయం పేపర్‌లో చూసే తెలుసుకున్నా. ఇప్పటి వరకు మా మధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు'' అని అన్నారు. సామాజిక కార్యకర్తగా, లాయర్‌గా ఇక్కడి ప్రజలకు ఎంతో సేవ చేశానని, విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వ సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. 'రాజకీయాలకు వస్తే నాన్న కంటే నేనే బెటర్ అభ్యర్థినని భావిస్తున్నా' అని శ్రుతి దేవి పేర్కొన్నారు.
 
''నాన్న ఎంపీగా ఉన్న సమయంలో మహిళా సమస్యలపై అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాను. ఆయన ఏమాత్రం స్పందించలేదు. ఇక్కడ మహిళా సమస్యలు ఏమిటో నాకు తెలుసు. అలాగే, ప్రజలతో నాకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఈసారి కచ్చితంగా గెలుస్తా'' అని అన్నారు.
 
తెలంగాణలో అభ్యర్థుల్లోనూ తొలిసారి పోటీ చేస్తున్న వారసులున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న తలసాని సాయికిరణ్ తండ్రి శ్రీనివాసయాదవ్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి. నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బంగారు శ్రుతి కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కుమార్తె. నిజామాబాద్ లోక్‌స‌భ స్థానం బీజేపీ అభ్య‌ర్థి ధ‌ర్మ‌పురి అర‌వింద్ మాజీ మంత్రి , రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ కుమారుడు. మల్కాజ్‌గిరి టీఆరెస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి స్వయాన అల్లుడు. నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments