Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే జోన్‌ ప్రకటించి ఏడాదవుతోంది, అది ఎక్కడి దాక వచ్చింది?

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (12:33 IST)
ఉత్తరాంధ్ర వాసుల చిరకాల డిమాండ్‌ను అంగీకరిస్తూ విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ఏడాది అవుతోంది. దానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ అని పేరు పెట్టింది. మరి, ఆ జోన్ ఇప్పుడు ఎక్కడిదాకా వచ్చింది? విశాఖ జోన్‌లో మార్పులు చేయాలన్న డిమాండ్లపై కేంద్రం ఏమంటోంది?

 
విశాఖ రైల్వే జోన్‌ను కేంద్రం 2019 ఫిబ్రవరి 27న ప్రకటించింది. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసింది. అందులో కొంత భాగంతో ఒడిశాలోని రాయగడ కేంద్రంగా ఒక డివిజన్ ఏర్పాటు చేసింది. మిగిలిన భాగాన్ని, అంటే విశాఖ నగరంతో పాటు విజయవాడ డివిజన్‌లో కలిపింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ జోన్ ఉంటుందని కేంద్రం ప్రకటించింది.విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వేలో ఉండడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తెలుగు ప్రాంతాల నుంచి విశాఖకు రైళ్లు నడపడం, సీట్ల విషయంలో ప్రాధాన్యం లేదనీ ఆరోపణలుండేవి. అందుకే ప్రత్యేక జోన్ డిమాండ్ వచ్చింది.

 
కేంద్రం మాత్రం ఈ రెండూ చేయకుండా కొత్తగా వాల్తేరును విభజించి కొంచెం అటు, కొంచెం ఇటు అన్నట్లు చేసింది. దేశంలో ఎక్కువగా ఆదాయం వచ్చే రైల్వే డివిజన్లలో వాల్తేరు మూడవ స్థానంలో ఉండేది. విశాఖ ఓడరేవు అందుకు కారణం. ''వాల్తేరు డివిజన్‌కు 125 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ డివిజన్‌కు ఏటా రూ. 7,053.12 కోట్ల ఆదాయం సరకు రవాణా ద్వారా లభిస్తుంది. పాసింజర్‌ టికెట్ల వల్ల రూ.536 కోట్ల ఆదాయం వస్తోంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం కావడంతోనూ, బైలదిల్లా నుంచి ఇనుప ఖనిజం, నాల్కో నుంచి అల్యూమినియం రావడంతోనూ మంచి ఆదాయం లభిస్తోంది. కేంద్రం నిధులు ఇచ్చేప్పుడు జోన్ పేరిట ఇవ్వరు. డివిజన్ పేరిట ఇస్తారు. 

 
డివిజన్లకు వచ్చిన ఆ డబ్బును పర్యవేక్షించి ఖర్చు పెట్టించడమే జోన్ల పని. జోన్ల పేరిట ఎక్కడా పైసా రాదు. దీంతో వాల్తేరు డివిజన్ రద్దు చేసి, అసలు విశాఖలో డివిజనే తీసేసి, వట్టి జోన్‌ ఇస్తే లాభమేంటి? డివిజన్‌ కేంద్రంగా జోన్‌ లేకపోతే విశాఖకు ఒక్కపైసా కూడా రాదు'' అని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్, సీనియర్ పాత్రికేయులు శివ శంకర్ బీబీసీతో చెప్పారు.కేంద్ర ప్రతిపాదన సరికాదనీ, దానివల్ల ఉత్తరాంధ్రకు మరింత నష్టమని చెబుతూ మాజీ మంత్రి కొణతాల రామక్రుష్ణ 2019 మార్చిలోనే రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కి లేఖ రాశారు.

 
''విశాఖ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. రాజకీయ పలుకుబడి లేదు కాబట్టే వాల్తేరు డివిజన్ను రద్దు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతాలను కూడా ఒడిశా జోన్‌లో కలపడం సరికాదు. ఇచ్చాపురం - రాజమండ్రి, కొత్తవలస - కోరాపుట్, విజయనగరం - కోనేరు, నౌపాడ - గుణుపూరు, పిఠాపురం - కాకినాడ, కాకినాడ - కోటిపల్లి, విశాఖ పోర్టు, ఎన్టీపీసీ, గంగవరం పోర్ట్ ప్రాంతాలు వాల్తేరు పరిధిలో ఉంచుతూ డివిజన్‌ను కొనసాగించాలి" అంటూ ఆయన లేఖలో కోరారు.

 
కేంద్రం మాత్రం ఈ అభ్యంతరాలను పరిగణించలేదు. తాము అనుకున్న ప్రకారమే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆ కొత్త జోన్ ఏర్పాటు పనులను పర్యవేక్షించేందుకు ఒక అధికారి (ఓఎస్‌డీ) ని కూడా నియమించింది. ఆయన విశాఖ కేంద్రంలో పనిచేస్తున్నారు.
రాయగడ, విజయవాడ, విశాఖపట్నాలలో ఉద్యోగుల విభజన, జోన్‌ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన పరిపాలన విషయాలు, ఇతర అభ్యంతరాలు, ఈ జోన్‌కు వచ్చే ఉద్యోగుల వివరాలను సేకరించి 2019 ఆగస్టులో దీనిపై కేంద్రానికి నివేదిక పంపారు ఓఎస్‌డీ. అంతకు మించి ఏ పనీ చేయలేదు. ఓఎస్‌డీ పంపిన నివేదికలపై ఇంకా ప్రభుత్వం స్పందించలేదు.

 
2019లో కేంద్రం ప్రకటనతో ఆందోళనలు ఆగిపోయాయి. జోన్ ఇచ్చినా ఉత్తరాంధ్రకు ఫలితం లేకుండా చేశారన్న కోపం ఉన్నా, ఎవరూ రోడ్డెక్కలేదు. ఎన్నికల తరువాత ఎవరూ జోన్ గురించి పెద్దగా మాట్లాడలేదు. దాదాపు 5 నెలలు అయినా ఓఎస్‌డీ పంపిన నివేదికపై రైల్వే శాఖ స్పందించలేదు. అయితే, వచ్చే బడ్జెట్‌లో కొత్త జోన్‌కు నిధులు వస్తాయని విశాఖ ఎంపీ అంటున్నారు.

 
''ఇప్పటికే ప్రధానిని రాష్ర్ట ఎంపీలు అందరం కలిశాం. వాల్తేరు డివిజన్‌తో కూడిన జోన్ కావాలని ప్రధానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఎంపీలందరమూ అదే విషయమై ప్రధానికి నివేదిక కూడా ఇచ్చాం. వచ్చే బడ్జెట్‌లో దీనికి నిధులు వస్తాయని, పనులు సాగుతాయని భావిస్తున్నాం'' అని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

 
కేంద్రం అనుకున్నట్టు కాకుండా, ఉత్తరాంధ్ర వారు కోరినట్టు డివిజన్ - జోన్ ఇవ్వడం సాధ్యమేనా? అని సికిందరాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరిని మేము అడిగాం. ''కొత్త జోన్ లేదా డివిజన్‌ విషయంలో ఉత్తరాంధ్ర వాసుల డిమాండ్లను కేంద్రం అంగీకరించాలంటే అందుకు రాష్ట్ర నాయకత్వం బలంగా ఉండాలి. రాజకీయంగా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎంపీలు, ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధిస్తే అవుతుంది'' అని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.

 
ఉద్యోగాల సంగతేమిటి?
ప్రస్తుతం దొండపర్తిలో ఉన్న డివిజనల్ మేనేజర్ కార్యాలయం ప్రాంగణంలోనే కొత్త జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తారని కొందరు అధికారులు చెబుతున్నారు. జోన్‌ నడపాలంటే కనీసం 1,500 మంది ఉద్యోగులు కావాలని ఓఎస్‌డీ అంచనా వేశారు. అయితే, తాత్కాలికంగా 400 మందితో నడిపించాలని రైల్వే బోర్డు సూచించిందని తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు వైజాగ్ జోన్‌కి వస్తామంటూ విజ్ఞప్తులు పంపుతున్నారు. దీనికితోడు వాల్తేరు డివిజన్‌లోనూ చాలా ఖాళీలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని ఫ్యామిలీలో వరుస వివాహ వేడుకలు... ముమ్మరంగా ఏర్పాట్లు!!

దివ్యప్రభ న్యూడ్ వీడియో... సోషల్ మీడియాలో వైరల్... పాపులారిటీ కోసమేనా (Video)

తుదిదశలో 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments