Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విమానం చక్రాల వెనుక దాక్కుని ప్రయాణం.. పదేళ్ల బాలుడి మృతి

విమానం చక్రాల వెనుక దాక్కుని ప్రయాణం.. పదేళ్ల బాలుడి మృతి
, గురువారం, 9 జనవరి 2020 (16:17 IST)
అబిద్‌జాన్ నుంచి పారిస్ వచ్చిన ఓ విమానం అండర్‌క్యారేజ్‌లో పదేళ్ల బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. విమానం అండర్ క్యారేజ్‌లో దాక్కుని వచ్చిన ఓ బాలుడి మృతదేహాన్ని పారిస్‌లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయంలో గుర్తించినట్లు ఎయిర్ ఫ్రాన్స్ కూడా ధ్రువీకరించింది.

 
ఐవరీకోస్ట్ నుంచి వచ్చిన ఈ విమానం చక్రాలు లోనికి ముడుచుకునే (ల్యాండింగ్ గేర్ వెల్) చోట దాక్కుని వచ్చేందుకు ప్రయత్నించి ఈ బాలుడు మరణించాడని ఎయిర్ ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. ఐవరీకోస్ట్‌లోని అబిద్‌జాన్ నుంచి మంగళవారం సాయత్రం ఈ ఎయిర్‌ఫ్రాన్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానం బయలుదేరింది.


బుధవారం ఉదయం పారిస్‌లో స్థానిక కాలమానం ప్రకారం 6.40 గంటలకు మృతదేహాన్ని కనుగొన్నారని అధికారులు 'బీబీసీ'కి తెలిపారు. అబిద్‌జాన్ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యానికి ఇదో ఉదాహరణని ఐవరీకోస్ట్‌కు చెందిన భద్రతాధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

 
ఇలా దాక్కుని వెళ్లినవారెవరైనా బతికిన ఉదంతాలున్నాయా?
ప్రయాణికులకు నిర్దేశించిన సీట్లలో కూర్చుని వెళ్లకుండా దొంగచాటున విమానం ఇతర భాగాల్లో దాక్కుని వెళ్లడమనేది ఇదే తొలిసారి కాదు. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 1947 నుంచి 2012 మధ్య ప్రపంచవ్యాప్తంగా 85 విమానాల్లో 96 మంది ఇలా వెళ్లేందుకు ప్రయత్నించారు.

 
అయితే, వారిలో చాలామంది తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోలేదని విమానయాన నిపుణుడు ఇరీన్ కింగ్ 'బీబీసీ'తో చెప్పారు. అమెరికన్ ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ (ఎఫ్‌ఏఏ) లెక్కల ప్రకారం 1947 నుంచి 2019 జులై 2 మధ్య ఇలాంటి ఉదంతాలను 40 దేశాల్లో గుర్తించారు. అత్యధికంగా క్యూబాలో 9, డొమినికన్ రిపబ్లిక్‌లో 8, చైనాలో 7, దక్షిణాఫ్రికాలో 6, నైజీరియాలో 6 కేసులు నమోదయ్యాయి.

 
ప్రాంతాల వారీగా చూస్తే, ఆఫ్రికాకు చెందిన 34 మంది, కరీబియన్ ప్రాంతానికి చెందిన వారు 19 మంది, యూరప్‌లో 15 మంది, ఆసియాలో 12 మంది ఇలాంటి ప్రమాదకర ప్రయాణాలకు ప్రయత్నించారు.

 
అయినా బతికిబట్టకట్టారు
* 2010లో 20 ఏళ్ల రొమేనియావాసి ఒకరు వియన్నా నుంచి హీత్రూకు ఒక ప్రైవేటు విమానంలో అలాగే ప్రయాణించి ప్రాణాలతో బయటపడ్డారు.
 
* 1969 - క్యూబాలోని హవానా నుంచి మాడ్రిడ్‌కు ప్రయాణించిన 22 ఏళ్ల అర్మాండో సోకర్రాస్ రామిరెజ్ కొద్దిపాటి అనారోగ్యంతో బయటపడ్డారు.
 
* 1996 - భారత్‌కు చెందిన అన్నదమ్ములు పర్దీప్ సైనీ, విజయ్‌లు దిల్లీ నుంచి 10 గంటలపాటు రహస్యంగా ప్రయాణించి లండన్‌కు వెళ్లారు. 23 ఏళ్ల పర్దీప్ ప్రాణాలతో బయటపడ్డారు, హీత్రూ విమానాశ్రయం సమీపిస్తుండగా విమానం నుంచి జారిపడి విజయ్ మరణించారు.
 
* 2000 - ఫ్రాన్స్‌లోని తాహితి నుంచి అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌ వరకు బోయింగ్ 747 విమానంలో 6,437 కిలోమీటర్లు ప్రయాణించి క్షేమంగా చేరుకున్నారు ఫిడెల్ మారుహి.
 
* 2002 - క్యూబా నుంచి కెనడాకు నాలుగు గంటల ప్రయాణం చేసిన 22 ఏళ్ల విక్టర్ అల్వారెజ్ మోలినా ప్రాణాలతో బయటపడ్డారు.
 
* 2014 - అమెరికాలోని హవాయ్ రాష్ట్రంలోని మావోయీ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌ వరకు బోయింగ్ 767 విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో 15 ఏళ్ల అబ్బాయి యాహ్యా అబ్ది ప్రయాణించారు.
 
ప్రాణాలు పోగొట్టుకున్నారు
* 2015 జూన్‌లో పశ్చిమ లండన్‌లోని ఒక కార్యాలయం భవనం మీద ఒక వ్యక్తి శవం కనిపించింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి లండన్ వస్తూ 427 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం నుంచి పడి అతడు చనిపోయినట్లు తర్వాత తెలిసింది. అదే విమానంలో అతనితోపాటు ప్రయాణించిన మరో వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
 
* 2012 సెప్టెంబర్‌లో మొజాంబిక్‌కు చెందిన జోస్ మటడా అనే వ్యక్తి లండన్ వీధుల్లో శవమై కనిపించారు. అంగోలా నుంచి హీత్రూ విమానాశ్రయానికి వస్తున్న విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్ నుంచి ఆయన జారిపడ్డారు.
 
* అదే ఏడాది దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరం నుంచి బయలుదేరిన విమానం హీత్రూ చేరుకున్న తర్వాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో వ్యక్తి మృతదేహం బయటపడింది.
 

కట్టుదిట్టమైన భద్రత ఉన్నా విమానంలో దాక్కోవడం ఎలా సాధ్యం
ప్రతి విమానం టేకాఫ్ అయ్యే ముందు విమానాశ్రయం గ్రౌండ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తారు. మరి, ఇలా గుట్టుగా ప్రయాణాలు చేసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారు? తనిఖీలు పూర్తయ్యాక చివరి నిమిషంలో ఇలాంటివారు విమానంలోకి చొరబడతారని.. విమానాశ్రయాల్లో పనిచేసే నైపుణ్యం లేని సిబ్బంది కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు.

 
విమానాశ్రయంలో బాగా తెలిసిన సిబ్బంది ద్వారా వెళ్లేవారు మరికొందరు ఉంటారు. అలా ప్రయాణించడం ప్రమాదకరమని, గాలిలోనే చనిపోతామని వారికి అవగాహన ఉండదన్నది నిపుణుల మాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంసంగ్ బాలీ.. ఇంటి పనులు చేస్తూ, నీడలా వెంటాడే రోబో బంతి - సీఈఎస్ 2020