Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ! ఓ 10 రోజులు నేను మీ భార్యను కాదు!'... ఎందుకని?

Webdunia
గురువారం, 16 మే 2019 (19:11 IST)
మీరెప్పుడైనా స్పితీ వెళ్లారా? అది హిమాలయాల్లోని మారుమూల లోయలో జనం పెద్దగా లేనిచోటు. మొబైల్ కనెక్టివిటీ లేనిచోటు. అందుకే నేను అక్కడికి వెళ్లాను. స్వేచ్ఛగా గడపటానికి.. సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం! మేం ఇద్దరు యువతులం.. మాతోపాటు డ్రైవర్ ఉన్నాడు. ఆ రాత్రి నాకింకా గుర్తుంది.

మా డ్రైవర్ పేపర్ కప్పులో నాటు సారా తెచ్చి ఇచ్చాడు. సంతోషించే విషయమేమిటంటే.. మేం ఆ చేదు విషాన్ని రుచి చూశాం. ఆహా ఏమి ఆనందమది! నేను కారు టాప్ ఎక్కి కూర్చున్నాను. వడి గాలి నా మేనుకు, ఆత్మకు ప్రాణం పోసింది.
 
మూడు పదుల వయసులోని ఓ మధ్య తరగతి వివాహితకు ఇది ఊహించలేనిది. నా భర్తకు, ఇంటికి దూరంగా.. తెలియని మనుషులతో తెలియని ప్రదేశంలో కాలం గడపటం. నేనిలా చేయటానికి కారణం ఇదిచ్చే ఉద్వేగం ఒక్కటి మాత్రమే కాదు. ఏడాదిలో కనీసం ఒకటి రెండు సార్లు ఇంటికి దూరంగా.. మొబైల్ సిగ్నల్స్ కూడా అందని ప్రాంతానికి వెళ్లటానికి.. కొన్ని బలమైన కారణాలున్నాయి.
 
'పెత్తనం మొత్తం అతనిదే'
నేను, నా భర్త ఇద్దరం చిత్రకారులం. ప్రయాణం చేయటం ఇద్దరికీ ఉన్న హాబీయే. కానీ మేం కలిసి ప్రయాణం చేసేటపుడు అతడు నన్ను ఒక బాధ్యతగా చూస్తాడు. ప్రయాణం, సమయం, ఎక్కడ ఆగాలి, ఏ హోటల్‌లో దిగాలి, భద్రత ఎలా ఉండాలి వంటి విషయాలపై నిర్ణయాలన్నీ అతడే తీసుకుంటాడు. నా అభిప్రాయం అడుగుతాడు కానీ నిజానికది అతడు తీసేసుకున్న నిర్ణయానికి నా ఆమోదం అడగటమే.
 
హోటల్ రూమ్‌లోకి నేను అడుగు పెట్టటానికి ముందు అతడు తనిఖీ చేస్తాడు. మెనూ కార్డును అతడు ముందు చేతిలో పట్టుకుని.. నాకు ఏం కావాలని అడుగుతాడు. గది తలుపుకు తాళం వేయటం నుంచి, లగేజీ మోయటం వరకూ అన్నిటినీ అతడు ముందుండి నడిపిస్తాడు. 
 
'నాకొక బ్రేక్ కావాలి'
నిజానికి నాకు ఒక బ్రేక్ కావాలి. నాకు కొడుకు పుట్టిన తర్వాత ఈ విషయం నాకింకా ఎక్కువగా తెలిసివచ్చింది. నా పనికి, ప్రయాణాలకు కోతలు పడ్డాయి. కానీ నా భర్త ఎప్పటిలాగానే ఏ మార్పూ లేకుండా కొనసాగుతున్నాడు. అప్పుడు.. నాకు నేనుగా బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో కొడుకు కోసం నా భర్త ఇంట్లోనే ఉండాలి. అందుకు అతడు ఒప్పుకున్నాడు.
 
అతను లేకుండా పూర్తిగా ప్లాన్ చేసిన నా మొదటి ప్రయాణం అది. అయినాకూడా అతడు రెండు మూడు గంటలకోసారి నాకు మెసేజ్ చేయటమో, కాల్ చేయటమో చేసేవాడు. ఎక్కడికి వరకూ వెళ్లావు? బాగా ట్రాఫిక్ ఉందా? అది చెక్ చేసుకున్నావా? ఇది సరి చూసుకున్నావా? అని అడగటానికి.
 
నా భద్రత గురించి అతడు పట్టించుకుంటున్నాడని నాకు బాగా తెలుసు. కానీ నిమిషనిమిషానికీ ఇలా అప్‌డేట్ చేస్తుండటం నాకు విసుగొచ్చేసింది. నన్ను గమనిస్తూ ఉన్నట్లుగా నా మీద నిఘా ఉంచినట్లుగా నా ప్రయాణాన్ని పసిగడుతున్నట్లుగా అనిపించింది. అందుకే మొబైల్ కనెక్టివిటీ లేని ప్రదేశాల కోసం వెదకటం మొదలుపెట్టాను. ఆటవిడుపు కోసం, ఆనందం కోసం ప్రయాణం చేస్తున్నపుడు.. ఘడియకోసారి ఇంటికి ఫోన్ చేయటం, భర్త అన్నం తిన్నాడా? పిల్లాడు హోంవర్క్ చేశాడా? అని ఇంటి ప్రశ్నలు అడగటం, అలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పటం నాకు నచ్చలేదు.
 
నేను మధ్య వయసులోని మధ్య తరగతికి చెందిన వివాహితనన్నది, ఇప్పుడు ఏడేళ్ల వయసున్న కొడుకుకు తల్లినన్నది నిజం. కానీ నా గుర్తింపు అదొక్కటేనా? ఒక భార్య.. ఒక తల్లి! వివాహిత తన భర్తతో కలిసి మాత్రమే సెలవు ప్రయాణాలు చేయాలనే రూల్ ఏదైనా ఉందా? నేను భూటాన్ పర్యటనకు వెళ్లినపుడు నా కొడుకు స్కూల్‌లో పేరెంట్ - టీచర్ మీటింగ్ జరిగింది. నా భర్త ఆ మీటింగ్‌కు వెళ్లాడు. నా కొడుకు స్నేహితుడి తల్లితో జరిగిన ఈ సంభాషణ వివరించాడు.
 
'నీ భార్య ఎక్కడ?' అని ఆమె నా భర్తను అడిగింది.
'ఆమె ఊర్లో లేదు' అని అతడు జవాబిచ్చాడు.
'ఓహో... పని మీద వెళ్లారా?' అని ఆమె ఊహించింది.
'లేదు.. లేదు... ఊరికే సరదా ప్రయాణం' అని అతడు వివరించి చెప్పాడు.
 
'ఓ.. నిజమా? అదెలా? మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి?' అంటూ.. నేనేదో అతడిని పూర్తిగా వదిలేసి వెళ్లిపోయినట్టు దిగ్భ్రాంతితో కూడిన స్వరంతో ఆమె ప్రశ్నించింది.
అప్పుడు నా భర్త నవ్వేశాడు. ఈ జోకుని నాకు చెప్పాడు. కానీ నాకిది నవ్వులాటగా అనిపించలేదు.
అదే మహిళ కొన్ని నెలల కిందట నాతో ఇలాంటి సంభాషణే చేసింది. అప్పుడు ఆమె భర్త బైక్ సాహస ప్రయాణం కోసం వెళ్లివున్నాడు. ఆ విషయాన్ని ఆమె చాలా గర్వంగా వివరిస్తోంది.
 
'అతడు నిన్ను ఒంటరిగా వదిలేశాడా? నిన్ను పూర్తిగా వదిలేసినట్టు?' అని అప్పుడు నేను ఆమెను అడగలేదు. ఆమె ఒక్కరే కాదు. ఒక మహిళ తన సరదా కోసం భర్త లేకుండా ప్రయాణం చేయటమన్న ఆలోచన చాలా మందికి వింతగా తోస్తుంది. మా కుటుంబాలకు కూడా అలాగే అనిపించింది. నేను మొదటిసారి ఒంటరిగా పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నపుడు మా అత్త బిత్తరపోయింది. కానీ.. నేనిలా చేయాల్సిన అవసరం ఏమిటో అర్థంచేసుకునే నా భర్త ఆమెకు వివరించాడు. దీంతో ఆమె అడ్డుచెప్పలేదు.
 
ఆ పసివాడ్ని వదిలేసి ఎలా షికారు చేస్తున్నావు?
కానీ.. నా కన్నతల్లి.. 'నా సమయం' అనే నా ఈ భావనను ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఈసారి ఆమెకు చెప్పకుండానే ప్రయాణం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆమె ఫోన్ చేసింది. 'ఎక్కడికి వెళ్లావు? నిన్నటి నుంచీ నీ కోసం ఫోన్ చేస్తున్నా.'
 
'నేను ప్రయాణంలో ఉన్నానమ్మా.'
'మళ్లీనా? ఎందుకు? ఎక్కడికి?'
'అవును. ఊరికే... కాస్త మార్పు కావాలి. ఈసారి రోడ్డు ప్రయాణం చేస్తున్నా.'
'సరే. నీ కొడుకు, మీ ఆయన ఎలా ఉన్నారు?'
'బాగున్నారు. వాళ్లు నాతో లేరు. ఇంటి దగ్గరే ఉన్నారు.'
'ఓరి దేవుడా! నువ్వేం తల్లివి? ఆ పసివాడ్ని అలా వదిలేసి ఎలా షికార్లు చేయగలవు? కన్నతల్లి నిర్లక్ష్యం చేస్తే వాడెంత బాధపడతాడో దేవుడికే తెలుసు. మీ అత్తగారు నిన్నెలా పంపించారో నాకు అర్థంకావట్లేదు.'
'అమ్మా.. నన్ను తాడుతో కట్టిపడేయాలని అనుకుంటున్నావా ఏంటి?'
 
ఇది కొత్త కాదు. నేను పర్యటన కోసం బయల్దేరిన ప్రతిసారీ ఇలా జరుగుతుంది. ఆమె దీనిని ఒప్పుకోవటంలేదని నేననుకోను. నాకు 'నా సమయం' అవసరం కన్నా.. జనం ఏమంటారో అనే ఆమె భయం పెద్దది కావచ్చు.
 
నన్ను నేను వెదుక్కుంటూ ఒంటరి ప్రయాణం
నేను నన్ను వెదుక్కుంటూ ఒంటరిగా ప్రయాణిస్తాను. నా కుటుంబం గురించి నేను పట్టించుకుంటాను. అలాగే నా గురించి కూడా నేను పట్టించుకుంటాను. నేను ఒంటరిగా ప్రయాణం చేసినపుడు నా జాగ్రత్త నేనే చూసుకుంటాను. నేనిలా బయటకు వెళ్లినపుడు.. నా బాధ్యత, నిర్ణయాలు రెండూ నావిగానే ఉంటాయి. నేను జాగ్రత్తగా ఉంటాను. అయినా సాహసం చేస్తుంటాను. పూర్తిగా వేరే మహిళను.
 
మాకు సారా ఇచ్చిన స్పితీ లోయ డ్రైవర్ అందగాడు. అతడితో కబుర్లు చెప్తూ మందు తాగటం నాకు చాలా సరదానిచ్చింది. ఆ కొండ జానపదాలను అతడు ఎంత బాగా పాడాడో. పోయినేడాది నేను నా స్నేహితురాలితో కలిసి ప్రయాణిస్తున్నపుడు మా డ్రైవర్ మమ్మల్ని ఒక హోటల్ దగ్గర వదిలిపెట్టాడు. 'కుచ్ ఔర్ ఇంతజామ్ లగేగా ఆప్కో?' (మీకు అలాంటిదేమైనా ఏర్పాటు చేయాలా?) అని అడిగాడు.
 
అతడి ప్రశ్నకు అర్థమేమిటని నేను ఇప్పటికీ ఆశ్యర్యపోతూ ముసిముసిగా నవ్వుతూ ఉంటాను. మాకు సారా కావాలా అని అడుగుతున్నాడా? లేక 'గిగోలో' (మగ వేశ్య) కావాలా అని అడుగుతున్నాడా?! ఈ అనుభవాలు, ఈ జనం నిజమైన ప్రపంచం. ఇవి ఎదురు కావాలంటే వివాహిత, భార్య, తల్లి అనే పేర్ల నుంచి కనీసం కొన్ని రోజులైనా బయటపడాలి.
 
(పశ్చిమ భారతదేశంలో నివసించే ఓ మహిళ నిజ జీవిత కథ ఇది. బీబీసీ ప్రతినిధి అరుంధతి జోషితో ఆమె చెప్పిన కథను దివ్య ఆర్య అక్షరబద్ధం చేశారు. ఆ మహిళ వివరాలను ఆమె కోరిక మేరకు వెల్లడించలేదు.)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

నరేష్‌లో 10 మందికి ఉండే ఎనర్జీ ఉంది.. రాత్రి అయితే తట్టుకోలేకపోతున్నా... : నటి పవిత్ర లోకేశ్ (Video)

నిర్మాత దిల్ రాజు నివాసాల్లో ఐటీ మెరుపుదాడులు

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments