Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై జగన్ ఎలా పైచేయి సాధించారంటే...

Webdunia
గురువారం, 30 మే 2019 (17:27 IST)
చంద్రబాబు పేరెత్తగానే గుర్తొచ్చే మాట 'విజన్ 2020'. కరెక్టుగా 2020కి ముంగిట చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా నిలిచింది. తెలుగుదేశం పార్టీ తన 37 యేళ్ల ప్రస్థానంలో ఎన్నడూ లేనంత దారుణమైన పరాజయం మూటగట్టుకుంది. పొత్తుల్లేకుండా తొలిసారి బరిలో దిగిన చంద్రబాబు తెలుగుదేశం పోటీ చేసిన మొత్తం 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలకే అంటే 7వ వంతుకు లోపే పరిమితమైంది.
 
నాడు 1983లో ఎన్టీఆర్ అధ్వర్యంలో ప్రాంతీయ పార్టీ ప్రభంజనం ఒక రికార్డు అయితే ఇవాళ దానికి రివర్స్‌లో అదే పార్టీకి మరో రికార్డు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన రీతిలో తిరుగులేని ఆధిపత్యం చాటింది.
 
రాయలసీమ నాలుగు జిల్లాల్లో బావ, మరిది, ఔర్ వో.. అన్నట్టు చంద్రబాబు, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్.. ఈ ముగ్గురు మాత్రమే తెలుగుదేశం నుంచి గెలిచారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు అదే రకమైన పరిస్థితి.
 
1984 పార్లమెంట్‌లో ప్రతిపక్షం హోదా పొందిన ప్రాంతీయ పార్టీ, ఆ రికార్డు ఇవ్వాల్టికీ తన పేరునే నిలుపుకున్న పార్టీ, ఇవాళ మూడుసీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 1989 మాదిరి కేంద్రంలో చక్రం తిప్పుదాం అనుకుని ప్రాంతీయ పార్టీల నాయకులందరినీ కలుస్తున్న చంద్రబాబు ఆశలపై రాష్ర్ట ఫలితాలు, కేంద్ర ఫలితాలు డబుల్ బ్యారెల్ షాట్స్ లాగా పడ్డాయి.
 
విజయవాడ వారధి దగ్గర ఒక ఆసక్తికరమైన ఫ్లెక్సీ కనిపించింది. దాని మీద ఎన్టీఆర్, జగన్ ఫొటోలున్నాయి. ప్రాంతీయ పార్టీలను స్థాపించి ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన మహానాయకులు అనేది దానిమీద వ్యాఖ్యానం సారాంశం. పదజాలం సంగతి పక్కన పెడితే సాంకేతికంగా చూస్తే అది సరైన పోలికే. కాకపోతే జగన్‌ను వైఎస్ రాజశేఖర రెడ్డికీ, ఆయన సంక్షేమ పథకాలకీ వారసునిగా జనం చూస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎప్పుడో బదలాయింపు అయిపోయింది. కాంగ్రెస్ ఒట్టిపోయి ఉంది.
 
జగన్ ప్రభావం బలంగా ఉంది అనేది ప్రజాస్పందనలో తెలుస్తున్నప్పటికీ, తెలుగుదేశం చివరి నెలరోజుల్లో చేసిన ప్రయత్నాలు ముఖ్యంగా పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ ఎలా పనిచేస్తుందో అనే అనుమానాలైతే ఉండినాయి. అలాగే పవన్ కల్యాణ్ చీల్చబోయే ఓట్లు ఎవరికి గండికొడతాయో అనే అనుమానాలు కూడా ఉండినాయి. కానీ, అవేవీ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేయలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రం మూల మూలలా జగన్ వేవ్ అన్నింటిని అధిగమించగలిగింది. పైపెచ్చు కాపు రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబు వైఖరిని జనం విశ్వసించలేదని ఆ ఓటుబ్యాంకు ఈ సారి చంద్రబాబుకు వ్యతిరేకంగానే పనిచేసిందని ఫలితాలు తెలియజేస్తున్నాయి.
 
ఓటర్ల నాడి వినిపించనంతగా, ఫ్యాన్స్ కేరింతల భ్రమాన్వితమైన డిజిటల్ డాల్బీ సౌండ్‌లో మునిగిపోయిన పవన్ కల్యాణ్ పార్టీ ఏ ప్రభావమూ చూపించలేకపోయింది. పెద్ద మాటలు, కొన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ ధోరణిలో కన్సిస్టెన్సీ లేకపోవడం, విధానాల్లో స్పష్టత లేకపోవడం వల్ల జనం సీరియెస్‌గా తీసుకోలేదు. కనీసం గోదావరి జిల్లాల్లో కూడా. పవన్ రెండు సీట్లలో ఓడిపోయినా మరీ గుండు సున్నా కొట్టకుండా రాజోలులో రాపాకను గెలిపించి లాభం అనిపించి సరిపెట్టారు జనం. పవన్ కల్యాణ్‌కు తన మాటల మీద చిత్తశుద్ది ఉన్నట్టయితే దీర్ఘకాలిక ప్రయాణం అని ఆయన చెప్పుకునే మాటలు నిజమే అయితే ఈ ఫలితాలు ఆయనకో పెద్ద మేలుకొలుపు లాంటివి.
 
కిందటి ఎన్నికల్లో అనేక అంశాలు కలిసి వచ్చి చంద్రబాబు సిఎం అయ్యారు. అప్పుడు కూడా జగన్ బలంగానే ఉన్నారు. వైఎస్ మీద జనంలో సానుభూతి మెండుగా ఉండింది. కాకపోతే ప్రచారపు చివరి రోజుల్లో మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా చేసిన ప్రచారం, రైతు రుణ మాఫీ లాంటి హామీలు, కొత్త రాష్ట్రానికి అనుభవమున్న నేత సీఎం అయితే మంచిదేమో అన్న ఆలోచన అన్నీ కలిసి ప్రభావం చూపాయి. మోడీకున్న సానుకూలమైన ఇమేజ్, పవన్ కల్యాణ్ కున్న సామాజిక మద్దతు అన్నీ చంద్రబాబు ఖాతాలో పడ్డాయి. గట్టెక్కారు. ఈ సారి పరిస్థితులు మారాయి. మోదీతో తెగతెంపులు చేసుకోవడమేకాకుండా కేంద్రంలో ఆజన్మ ప్రత్యర్థి లాంటి కాంగ్రెస్‌తో చేతులు కలపడం చంద్రబాబుకు ఏ మాత్రం లాభించలేదు.
 
మొన్నమొన్నటి దాకా మోడీ అంతటి మహానుభావుడు భూమ్మీదే లేరు అన్నంతగా సభలోనూ బయటా పొగిడి, సడన్‌గా అంతటి దుర్మార్గుడు భూమ్మీదే లేరు అని మడతేసి దూకుడుగా చంద్రబాబు మాట్లాడడం జనానికి మింగుడు పడలేదు. ప్రభుత్వం చేయలేక పోయిన పనులన్నింటికీ మోదీని భాధ్యున్ని చేయాలనే ఎత్తుగడ ఫలించలేదు. ప్రత్యేక హోదా హామీని మోడీ నిలబెట్టుకోలేదు అనే అసంతృప్తి జనంలో ఉన్నప్పటికీ ఆ విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రకటనలను జనం నమ్మలేదు. ప్రత్యేక హోదాను ప్రధాన అస్త్రంగా విపక్ష వైసిపి జనంలోకి తీసుకెళ్తున్నపుడు అక్కర్లేదు, ప్యాకేజీ బెటర్ అని ఇంటాబయటా చెప్పిన మనిషి తర్వాత హఠాత్తుగా స్టాండ్ మార్చుకుని దానిమీద దూకుడుగా వెళ్లడాన్ని కూడా జనం పాజిటివ్‌గా తీసుకోలేదు. పెద్ద నోట్ల రద్దు ఐడియా తనదే అని తొలుత ఉత్సాహంగా చెప్పిన మనిషి తర్వాత దానిపై ప్రతికూలత పెరిగాక అది తనదే అయినా సరిగా చేయలేదు అని విమర్శలకు దిగడం జనానికి నచ్చలేదు.
 
మొత్తంగా విశ్వసనీయత విషయంలో చంద్రబాబు దెబ్బతిన్నారు. ప్రత్యర్థి బలహీనతనే బలంగా మార్చుకునే ఎత్తుగడలో భాగంగా జగన్ ఎన్నికల ప్రచారంలో అదే పనిగా విశ్వసనీయతనే నొక్కి వక్కాణిస్తూ వచ్చారు. చంద్రబాబు మాటల్లో వచ్చిన మార్పులను అవకాశవాదానికి సంకేతంగా ప్రచారం చేశారు. తన తండ్రి ఇమేజ్‌ని ఇంపోజ్ చేస్తూ వచ్చారు. ఆ విషయంలో వైఎస్‌కు ఉన్న పాపులర్ ఇమేజ్ జగన్‌కు పనిచేసింది. సోషల్ మీడియా యుగంలో ఇమేజరీ, సింబాలిజం కీలకాంశాలు. ఇక ఇసుక మాఫియా కుంభకోణాలు, చంద్రబాబు సొంత కులానికి చెందిన కొంతమంది చేసిన అతి, జన్మభూమి కమిటీల పెత్తనం వంటివన్నీ తెలుగుదేశానికి ప్రతిగా మారాయి.
 
రాజధాని, పోలవరం, రాయలసీమకు నీరు వంటి విషయాల్లో కొద్దిగా కదలిక ఉన్నప్పటికీ చేస్తున్న ప్రచారానికి చూపిస్తున్న దృశ్యాలకు చెపుతున్న మాటలకు వాస్తవాలకు మధ్య ఉన్న అగాధమే ప్రధానంగా పనిచేసింది అని చెప్పొచ్చు. విశ్వసనీయత కన్సిస్టెన్సీ వంటి విషయాలను విస్మరించి ఎలక్షనీరింగ్ వ్యూహాలు ఎత్తుగడలకు లెక్కలకే అధిక ప్రాధాన్యమిచ్చారేమో అనిపిస్తుంది. చివరకు పదేపదే అదే పనిగా చాటుకునే కియా పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న రెండు నియోజకవర్గాలు రాప్తాడు, పెనుగొండ ప్రజలు కూడా చంద్రబాబుకు ఓట్లు వేయలేదు. ఏవైతే తమకు ఓట్లు తెచ్చిపెడతాయని చంద్రబాబు ఆశించారో అవేవీ ఫలించలేదు, ఏవైతే చంద్రబాబుకు వ్యతిరేక అంశాలుగా ఉన్నాయో అవ్వన్నీ ఎన్నికల సమయానికి మహారూపమెత్తి వ్యతిరేకంగా పనిచేసినట్టు అనిపిస్తోంది.
 
పెను తుఫాను వచ్చినపుడు మర్రి చెట్లు కూడా కూలిపోతాయి. ఆంధ్రలో సంస్థానాలు అన్న స్థాయిలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్న కొన్ని రాజకీయ కుటుంబాలు ఈ సారి దెబ్బతిన్నాయి. జెసి దివాకర్ రెడ్డి, కోట్ల - కేఈ, భూమా, గజపతి, సుజయ, కిశోర్ చంద్రవేవ్ లాంటి వారందరికి ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యాక్షన్ వైరి శిబిరాలను కూడా తన గూటికిందకే తెచ్చుకుని జమిలి లాభం పొందుదామని చేసిన ప్రయత్నం ఎదురుకొట్టింది. కర్నూలులో కోట్ల - కేఈని కలిపినా జమ్మల మడుగులో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డిలను కలిపినా అవేమీ పనిచేయలేదు. కర్నూలు, కడప, నెల్లూరు విజయనగరం జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇంత ఎదురుగాలిలోనూ ఎర్రన్నాయుడి కుటుంబం మాత్రం నిలబడింది.
 
కొత్త సారధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు అనేక సవాళ్లున్నాయి. ఆయన ప్రతిపాదించిన నవరత్నాలను భరించే స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ ఉన్నదా అనేది యక్ష ప్రశ్న. విపక్షంలో ఉండి విమర్శలు చేయడం వేరు, పాలనా బాధ్యతలు వేరు. అనేకానేక సంక్లిష్ట అంశాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. సంక్షేమాన్ని అభివృద్ధినీ సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజధాని వాషింగ్టన్ డిసిలాగా ఉండాలన్నది జగన్ కల అని సన్నిహితులు కొందరు చెపుతున్నారు. చంద్రబాబు అనేక నగరాల పేర్లు చెప్పి జనంలో ఆశలు ఆచరణ సాధ్యం కాని స్థాయికి పెంచారు. ఆశలకు ఆచరణకు మధ్య సమన్వయం కత్తిమీద సాము.
 
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కోట్లు ఖర్చుపెట్టి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మంత్రులు అంతకు అనేక రెట్లు ఏదో రూపంలో గుంజుకోవాలని ప్రయత్నిస్తారు. పాలకుల మీదా అధికారులమీదా ఆమార్గాల కోసం వత్తిడి తెస్తారు. అవినీతికి తావులేని ప్రభుత్వం అందిస్తాం అని బాహాటంగా చెప్పడం వేరు, వీరిని నియంత్రించడం వేరు.
 
మిగిలిన విషయాలు, ఆరోపణలు, కేసులు అందులో వాస్తవాలు అవాస్తవాలు ఎలా ఉన్నా చురుకైన, కష్టపడే స్వభావమున్న పట్టుదల గలిగిన మనిషి అనైతే జగన్ ఇప్పటికే పేరు సంపాదించారు. మంచి పరిపాలకుడు అని కూడా అనిపించుకుంటారా లేదా అనేది భవిష్యత్తు చెపుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments