Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ ఫండ్: దిల్లీ సామూహిక అత్యాచార ఘటన అనంతరం ఏర్పాటు చేసిన ఈ నిధి సంగతేంటి? దీన్ని ఎలా ఖర్చు చేస్తున్నారు?

Webdunia
బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (18:03 IST)
దిల్లీలో సామూహిక అత్యాచార ఘటన జరిగిన ఏడాది తర్వాత, 2013లో ప్రతిష్ఠాత్మక ''నిర్భయ ఫండ్''ను భారత్ ఏర్పాటుచేసింది. మహిళలపై హింసను తగ్గించడమే దీని లక్ష్యం. అయితే, ఈ నిధి తన లక్ష్యాలను అందుకోలేకపోతోందని స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదికలో తేలింది. దీనిపై బీబీసీకి చెందిన అపర్ణ అల్లూరి, షాదాబ్ నజ్మీ అందిస్తున్న కథనం. మామయ్య తనపై అత్యాచారం చేశారని ఒడిశాలోని మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన కవిత (ఈ కథనంలో బాధిత మహిళల పేర్లు మార్చాం) 2017లో ఫిర్యాదు చేశారు.

 
''అయితే, పోలీసులు మా మామయ్యను పిలిచి మాట్లాడారు. ఆ తర్వాత నన్ను మా పుట్టింటికి పంపేశారు''అని ఆమె చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. ఇది ''ఆ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం''అని పోలీసులు చెబుతున్నారు.

 
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 42ఏళ్ల పింకీ 2019లో ఒక రోజు రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తన భర్త చితకబాదడంతో ఈ దెబ్బలు తగిలాయని ఆమె పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేయడానికి పోలీసులకు గంటల సమయం పట్టింది. ఆ తర్వాత ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని లఖ్‌నవూకు పారిపోయారు. అక్కడ కూడా ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే అక్కడున్న ఓ పోలీసు అధికారి తనను ''పై నుంచి కింద వరకు''చూసి.. తప్పు తనదేనని చెబుతూ కేసు నమోదు చేసుకున్నారని ఆమె వివరించారు.

 
గత ఏడాది 18ఏళ్ల ప్రియ ఒడిశాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో తనను ప్రేమించానని చెప్పి మోసం చేసిన యువకుడిపై ఫిర్యాదుచేశారు. తనతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చానని, అయితే తనపై అత్యాచారం చేశాక, అతడు మాయం అయ్యాడని ఆమె వివరించారు. ''ప్రేమలో పడే ముందు నువ్వు ఏమైనా మమ్మల్ని అడిగావా? ఇప్పుడు మాత్రం సాయం చేయాలంటూ వస్తున్నావు''అని అక్కడున్న ఓ అధికారి తనతో అన్నారని ఆమె తెలిపారు. చివరిగా, తనను పెళ్లి చేసుకొని వదిలేశాడనే ఆరోపణలతో ఆమె కేసు పెట్టేలా చేశారు. ఈ ఆరోపణలు రుజువైనా నిందితుడికి శిక్ష పడేది తక్కువకాలమే.

 
భారత్‌లో గృహహింస, లైంగిక హింస బాధితుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్తల నుంచి లాయర్ల వరకూ.. ఎవరిని కలిసినా ఇలాంటి కథలు బయటకు వస్తూనే ఉంటాయి. అయితే, బాధితులకు సాంత్వన చేకూర్చేందుకు భారత ప్రభుత్వం ఏర్పాటుచేసిన లక్షల డాలర్ల ప్రభుత్వ నిధి మాత్రం వారికి పూర్తిగా చేరడం లేదు. 2012లో దిల్లీలో సామూహిక అత్యాచారం అనంతరం హత్యకు గురైన యువతి పేరుపై ఈ నిధికి ''నిర్భయ ఫండ్''గా పేరు పెట్టారు. భారత్‌లో అత్యాచార బాధితుల పేర్లను బయటకు వెల్లడించకూడదు. అందుకే ఆ అత్యాచార బాధితురాలిని ''నిర్భయ''గా పిలుస్తూ ఆనాడు మీడియాలో వార్తలు వచ్చాయి.

 
ఆమెపై అత్యాచారం అనంతరం భారత్‌లో దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. దీనికి సంబంధించిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలిచాయి. ఆ తర్వాత వరుస అత్యాచార నిరోధక చట్టాలు, వైద్య పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు, లైంగిక హింస బాధితులకు కొత్త కౌన్సెలింగ్ విధానాలను ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఆ సమయంలోనే నిర్భయ ఫండ్‌ను ఏర్పాటుచేశారు. అయితే, నిర్భయ ఫండ్‌ను ''విధానపరమైన అడ్డంకులు'', తక్కువ కేటాయింపులు, కేటాయించిన నిధులను సరిగా ఖర్చుపెట్టకపోవడం తదితర సమస్యలు వేధిస్తున్నాయని ఆక్స్‌ఫామ్ ఇండియా తాజా నివేదిక తెలిపింది. ఇంతకీ అసలు ఈ నిధిని ఎలా ఖర్చు చేస్తున్నారు? ఎక్కడ లోపాలు ఉన్నాయి.

 
అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు..
నిర్భయ నిధిలో చాలావరకు పోలీసు వ్యవస్థను పర్యవేక్షించే భారత హోం మంత్రిత్వ శాఖకే వెళ్తోంది. అయితే, అత్యవసర ప్రతిస్పందన సేవలు (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్), ఫొరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునికీకరణ, సైబర్ క్రైమ్ విభాగాల విస్తరణ తదితర కార్యక్రమాలకు ఈ నిధిని ఉపయోగిస్తున్నారని ఆక్స్‌ఫామ్ ఇండియాకు చెందిన అమృత పిత్రే చెప్పారు. మహిళలకు ప్రత్యేకంగా ఈ నిధితో ఎలాంటి లబ్ధీ చేకూరడంలేదని ఆమె అన్నారు.

 
రైల్వేల నుంచి రోడ్ల వరకు.. మెరుగైన లైట్లు, మరిన్ని సీసీటీవీల ఏర్పాటు, ప్రభుత్వ రవాణా వ్యవస్థను సురక్షితంగా మార్చడం లాంటి అంశాలపై ఈ నిధులను ఖర్చు పెడుతున్నారు. వాహనాల్లో ప్యానిక్ బటన్లపై పరిశోధనలకు కూడా ఈ ఫండ్ నుంచే నిధులు కేటాయించారు. ''టెక్నాలజీ ఆధారిత సమాధానాలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే, 80 శాతం కేసుల్లో ఈ పరిష్కారాలు ఎందుకూ ఉపయోగపడవు. ఎందుకంటే ఈ కేసుల్లో నిందితులు మహిళలకు తెలిసినవారే''అని అమృత చెప్పారు.

 
మౌలిక సదుపాయాల కల్పనకు ఎక్కువగా ఈ నిధులు ఉపయోగిస్తున్నారు. దీనిపై నిర్భయ తల్లి ఆశా దేవి కూడా విమర్శలు చేశారు. ''మహిళల భద్రత, సాధికారతకు నిర్భయ నిధిని ఉపయోగించాలి. కానీ రోడ్ల నిర్మాణం లాంటి పనులకు ఆ నిధిని ఉపయోగిస్తున్నారు''అని 2017లో ఆమె వ్యాఖ్యానించారు. లైంగిక, గృహ హింసలతో బాధితులపై పడే ప్రభావం గురించి పోలీసులకు తగిన శిక్షణ ఇచ్చుంటే కవిత, పింకీ లాంటివారికి కొంచెం మేలు జరిగి ఉండేదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

 
పింకీనే ఉదాహరణగా తీసుకుంటే, లఖ్‌నవూ పోలీస్ స్టేషన్‌లో ఆమె గంటన్నర వేచి చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో అక్కడి ఇన్‌స్పెక్టర్ బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు. చివరగా ఆయన ఆమెతో మాట్లాడటానికి వచ్చారు. ''ఇది నీకు, నీ భర్తకు మధ్య వ్యవహారం. ఎవరైనా పరాయివ్యక్తి వస్తేనే మేం జోక్యం చేసుకుంటాం''అని ఆ అధికారి చెప్పినట్లు ఆమె వివరించారు.

 
తన మామయ్యపై కేసు పెట్టడానికి కవితకు మూడేళ్లు పట్టింది. ఆమెను కేసు పెట్టకుండా నిలువరించిన ఆ అధికారితో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మాట్లాడారు. నిందితుడు మామయ్య కాబట్టి, ఇది గృహహింస చట్టం కిందకు వస్తుందని, అత్యాచారం కాదని ఆయన చెప్పారు. ''ఆయన మాటలు వినగానే నేను షాక్‌కు గురయ్యాను. అసలు చట్టాల గురించి తెలుసుకోకుండా ఆయన ఇన్‌స్పెక్టర్ ఎలా అయ్యారు''అని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చెప్పారు. సీసీటీవీలు కొని అమర్చడంతో పోలిస్తే.. వ్యక్తుల ఆలోచనా విధానాలు మార్చడం చాలా కష్టం. ఖర్చుతో కూడుకున్నపని. చాలా నిధులు ఖర్చుపెట్టకుండా అలా వదిలేయడానికి ఇదొక కారణం.

 
ఖర్చుపెట్టకపోవడం మరో సమస్య
కేంద్ర హోం శాఖ తమకు కేటాయించిన నిధులను చాలావరకు ఏదో ఒక విధంగా ఖర్చు పెడుతుంటే.. చాలా ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అసలు వీటిని ముట్టుకోవడమే లేదు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖను తీసుకుంటే, 2019 వరకు తమకు కేటాయించిన నిధుల్లో కేవలం 20 శాతాన్నే ఖర్చుపెట్టారు. 2013 నుంచి 2019 వరకు మొత్తంగా నిర్భయ ఫండ్ నుంచి వెచ్చించిన నిధుల్లో నాలుగో వంతు ఈ శాఖనే ఖర్చుపెట్టింది. అత్యాచారం లేదా గృహహింస బాధితుల కోసం సంక్షోభ కేంద్రాలు (క్రైసిస్ సెంటర్లు), మహిళలకు షెల్టర్లు, మహిళా పోలీసు వాలంటీర్ల నియామకం, మహిళల కోసం ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం కోసం ఇక్కడ నిధులను ఉపయోగించారు.

 
''ఈ నిధులు సరిపోవు. పథకాలను మెరుగ్గా అమలు చేసేందుకు అడ్డుపడుతున్న విధానపరమైన అవరోధాలను మొదట తొలగాంచాలి''అని అమృత అన్నారు. ''కొత్తగా సంక్షోభ కేంద్రాలను ఏర్పాటు చేయడం, బృందాలను నియమించడం తేలికే. అయితే, వాటిని కొనసాగించడమే చాలా కష్టం. నిజమే, చాలా ప్రాంతాల్లో క్రైసిస్ సెంటర్లు చాలా మంచి పనులు చేస్తున్నాయి. అయితే, వీటిని సిబ్బంది కొరత వేధిస్తోంది. సిబ్బందికి జీతాలు, రవాణా ఖర్చులు కూడా సరిగా అందడం లేదు. ఒకవేళ అర్థరాత్రి మహిళలు ఇక్కడకి చిరిగిన లేదా రక్తంతో తడిసిన బట్టలతో వస్తే పరిస్థితి ఏమిటి? వారికి కట్టుకోవడానికైనా బట్టలు ఉండాలిగా''అని ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తెలిపారు.

 
'ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయితే, రేప్ కిట్లు సరిగా అందుబాటులో లేవు. ఆధారాలను తరలించేందుకు అవసరమయ్యే స్వాబ్లు, జిప్ లాక్ బ్యాగ్‌ల కొరత కూడా వేధిస్తోంది''అని గృహ హింస బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చే న్యాయవాది సుభాంగి సింగ్ చెప్పారు. ఆక్స్‌ఫామ్ గణాంకాల ప్రకారం.. ''నిర్భయ ఫండ్''ను నిధుల కొతర వేధిస్తోంది. ఏదైనా హింసకు బాధితులైన 60 శాతం మంది మహిళలకు సదుపాయాలు, సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 1.3 బిలియన్ డాలర్లు అవసరం అవుతాయి.

 
మరి అలాంటప్పుడు, కేటాయించిన నిధులను ఎందుకు ఉపయోగించడం లేదు? ''విధానపరమైన అడ్డంకులే మొదటి సమస్య. ముందుగా మనం చాలా పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది''అని ఎకానమిస్ట్ రీతికా ఖేరా చెప్పారు. ''ఒకవేళ నిధి మిగిలిపోతే, వచ్చే ఏడాది నిధిలో దాన్ని కలుపుతారన్న నమ్మకం కూడా ఉండదు''అని ఆమె వ్యాఖ్యానించారు. చాలా రాష్ట్రాలు నిధుల కోసం దరఖాస్తు చేసుకోవడం లేదు. ఉన్న నిధులను ఖర్చుచేయడానికి వెనకడుగు వేయడానికి ఇదే కారణం. నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండటంతో.. భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించుకోలేని పథకాలను మొదలుపెట్టేందుకు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు నిబద్ధత చూపడంలేదు.

 
నిధులు పెరుగుతున్నాయని చెప్పలేం
2013లో 113 మిలియన్ డాలర్లతో ఈ నిధిని ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నుంచి ఏటా అస్తవ్యస్తంగానే కేటాయింపులు జరుగుతూ వస్తున్నాయి. కొన్ని పథకాల రూపంలో ఈ నిధులను కేటాయిస్తున్నారు. అయితే, ఈ పథకాల పేర్లు ఏటా మారుతూ వస్తున్నాయి. దీంతో కేటాయింపుల ఆధారంగా కంటే విడుదల చేసిన నిధుల ఆధారంగా ఈ నిధులను లెక్కించడం కాస్త సులభం అవుతుంది.

 
''ప్రతిసారీ మార్పులు చేస్తూ.. ఏదో నిధులు పెరుగుతున్నట్లు చూపిస్తున్నారు. ఇలాంటి మార్పుల వల్ల గత ఏడాదితో నిధులను సరిపోల్చడం చాలా కష్టం''అని ఖేరా చెప్పారు. మహిళలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా తీసుకొచ్చిన ''జెండర్ బడ్జెట్''లో నిర్భయ ఫండ్ కూడా ఒక భాగం. అయితే, ఏటా జెండర్ బడ్జెట్ తగ్గుతూ వస్తోంది.

 
జెండర్ బడ్జెట్ తీరు ఇదీ..
ఈ ఏడాది కేటాయించిన 21.3 బిలియన్ డాలర్ల జెండర్ బడ్జెట్‌లో మూడో వంతు ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పథకానికే వెళ్లిపోతోంది. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. అయితే ఆ ఇంటికి యజమాని లేదా తోటి యజమానిగా మహిళలను గుర్తించాలి. గత రెండు బడ్జెట్లలోనూ ఈ పథకానికే ఎక్కువ నిధులను కేటాయిస్తున్నారు. జెండర్ హక్కుల కార్యకర్తలు ఈ కేటాయింపులను స్వాగతిస్తున్నారు. అయితే, ఇప్పటికే అరకొరగా ఉన్న జెండర్ బడ్జెట్‌లో ఇంత మొత్తాన్ని గృహ నిర్మాణానికి కేటాయించడం సబబేనా? అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతోంది. ''ఎకానమిక్స్ అంటే రాజకీయ లెక్కలు. కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఓట్లు వేస్తారు''అని ఆర్థికవేత్త వివేక్ కౌల్ వ్యాఖ్యానించారు.

 
హక్కుల సంగతేంటి?
దిల్లీ సామూహిక అత్యాచారం అనంతరం మహిళలపై నేరాలు తగ్గినట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు. ఇప్పటికీ న్యాయం అనేది వారికి అందని ద్రాక్షలానే మిగిలిపోతోంది. 2012 తర్వాత వరుస అత్యాచార కేసులు మళ్లీ వార్తల్లో నిలిచాయి. ఒకవేళ బాధిత మహిళ నిరుపేద లేదా అణగారిన కులానికి చెందిన వారు అయితే.. ఆమె మరిన్ని అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ''అవినీతి కంటే చెడ్డది ఏదైనా ఉందంటే.. అది ఉదాసీనతే. మనం మహిళా విచారణకర్తలను, మహిళా పోలీసు అధికారులను, మహిళా జడ్జిలను నియమించుకోలేకపోతున్నాం. నిధులను సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం''అని ఉత్తర్ ప్రదేశ్ మాజీ డీజీపీ విక్రమ్ సింగ్ వ్యాఖ్యానించారు.

 
''పోలీస్ కానిస్టేబుళ్ల నుంచి ఉన్నతాధికారుల వరకు చాలా మందిలో కనిపించే పురుషాధిక్య భావజాలాన్ని తుడిచిపెట్టేసేందుకు కచ్చితమైన సంస్కరణల అవసరం ఉంది. ముఖ్యంగా అధికారులపై వచ్చే ఆరోపణల మీద విచారణకు స్వతంత్ర సంస్థ ఉండాలి''అని ఆయన చెప్పారు. ఉదాసీనత, మహిళలపై చిన్నచూపు అనేది పోలీసులకు మాత్రమే పరిమితం కాలేదు. డాక్టర్లు, జడ్జిల్లోనూ కనిపిస్తోంది. దర్యప్తుల్లో డాక్టర్లు కీలక పాత్ర పోషించేటప్పటికీ, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి నిధులను కేటాయించడంలేదు. అన్నింటికంటే విద్యా సంస్కరణలే కీలకమని ఉద్యమకారులు చెబుతున్నారు. అబ్బాయిలంతా పురుషుల్లా మారడానికి ముందే వారి ఆలోచనల్లో విద్యా వ్యవస్థ ద్వారా మార్పు తీసుకురావాలని అంటున్నారు.

 
నిధులు కేటాయించడం అనేది సమస్యకు ఒకవైపు పరిష్కారం మాత్రమేనని ఉద్యమకారులు చెబుతున్నారు. మహిళలు తమ హక్కుల కోసం పోరాడేలా వారికి సాధికారత కల్పించాలని అంటున్నారు. శిక్షల తీవ్రత పెంచే కంటే నిందితులందరికీ శిక్షలు ఖరారైతే నేరాలు తగ్గుతాయని చెబుతున్న ఓ పరిశోధనను వారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇలా జరగాలంటే మహిళలు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు నమోదు చేయగలగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం