Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా రాజకీయాల్లో భారతీయుల సంఖ్య ఎలా పెరుగుతోంది?

బిబిసి
శనివారం, 26 అక్టోబరు 2024 (18:33 IST)
“16 ఏళ్ల వయసులో ఒంటరిగా అమెరికాకు వచ్చినప్పుడు నా జేబులో డబ్బుల్లేవు. ఇప్పుడు నేను అమెరికన్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి భారత సంతతి మహిళను”. ఫిలడెల్ఫియాలోని ఇండియన్ అమెరికన్లతో సమవేశంలో కేరళకు చెందిన ప్రమీలా జయపాల్ ఇలా ప్రసంగాన్ని మొదలు పెట్టినప్పుడు, ఆమె తర్వాతి మాటలు చప్పట్ల హోరులో వినిపించకుండా పోయాయి.
 
“నేనే మొదటదాన్ని, కానీ ఆఖరిదాన్ని మాత్రం కాదు” అని ఆమె అన్నారు. 2016 నవంబర్‌ 8న ప్రమీలా జయపాల్ హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ సభకు ఎన్నికయ్యారు. అదే రోజు రాత్రి అమెరికన్ సెనేటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి అమెరికన్‌గా కమలా హారిస్ రికార్డులకెక్కారు. అమెరికన్ రాజకీయాల్లో భారత సంతతి మహిళల ప్రాతినిధ్యానికి ఇది కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పటికి చాలా మారింది. కమలా హారిస్ ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ, డెమొక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్నారు.
 
మనవాళ్లే 'నువ్వు గెలవలేవు' అన్నారు
వాషింగ్టన్ రాష్ట్రంలోని సెవెంత్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎన్నికైన జయపాల్ ఇప్పుడు ఐదోసారి ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్నారు. 2024 సంవత్సరం కేవలం భారత సంతతికే కాకుండా, అమెరికన్ రాజకీయాల్లో భారత సంతతి మహిళలకు కీలకమైనదిగా మారింది. అమెరికా చరిత్రలో తొలిసారిగా 2024 అధ్యక్ష ఎన్నికల రేసులో ముగ్గురు భారత సంతతి అమెరికన్లు, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసు కోసం జరిగిన పోటీలో డోనల్డ్ ట్రంప్‌తో పాటు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ పోటీ పడ్డారు. ఈ ముగ్గురిలో రిపబ్లికన్ పార్టీ డోనల్డ్ ట్రంప్‌కు మద్దతు పలికింది.
 
డెమొక్రటిక్ పార్టీ తరపున కమలా హారిస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. ఈ మహిళలకు గెలుపు అంత తేలిగ్గా రాలేదు. అనేక కష్టాలను ఎదుర్కొని వారు ఈ విజయం సాధించారు. ఫిలడెల్ఫియాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రమీలా జయపాల్ బీబీసీతో మాట్లాడారు. “నేను మొదట పోటీ చేసినప్పుడు భారత సంతతి వారిని సంప్రదించాను. ఈ కమ్యూనిటీలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. నేనువారిని సాయం కోరినప్పుడు ‘మీరు గెలుస్తారని అనుకోవడం లేదన్నారు” అంటూ ఆమె గతాన్ని గుర్తు చేసుకున్నారు.
 
1957లో తొలి అడుగు
కమలా హారిస్, ప్రమీలా జయపాల్ మాత్రమే కాదు, భారత సంతతికి చెందిన అనేక మంది గత 10ఏళ్లలో అమెరికన్ రాజకీయాల్లో చోటు సంపాదించుకున్నారు. వాస్తవానికి, డెమొక్రటిక్ పార్టీ తరపున దలీప్ సింగ్ 1957లోనే అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగు పెట్టారు. ఆయన తర్వాత 50 ఏళ్ల పాటు భారత సంతతి అమెరికన్లు ఎవరూ ఆ దిశగా విజయం సాధించలేదు. ఈ 50 ఏళ్ల నిశ్శబ్దాన్ని 2005లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన బాబీ జిందాల్ భగ్నం చేశారు. అయితే ఆయన తనను తాను మొదట అమెరికన్‌గా ఆ తర్వాతే భారతీయుడిగా గుర్తించాలని కోరారు.
 
2015లో ఆయన రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థి రేసులోకి ప్రవేశించినప్పుడు “మనం భారతీయ అమెరికన్లం, ఆఫ్రికన్ అమెరికన్లం, ఐరిష్ అమెరికన్లం, ధనిక అమెరికన్లం, పేద అమెరికన్లం కాదు. మనం అమెరికన్లం మాత్రమే” అని అన్నారు.
 
వేగం ఎందుకు నెమ్మదించింది?
“ఇది కొన్ని తరాలకు సంబంధించినది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో చాలా మందికి ఇదొక నూతన వ్యవహారం” అని గత పదేళ్లుగా కాలిఫోర్నియాలో సిక్స్త్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుస్తున్నఅమీ బెరా చెప్పారు. “నేను అమెరికాలో పెరిగినప్పుడు, ఇక్కడ కేవలం 10వేలమంది భారతీయులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడే పెరిగిన ఒక తరాన్ని మీరు చూడవచ్చు. మా తరం టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో ముందుంది. అయితే కొత్త తరం కూడా ప్రభుత్వంలో తమకు ప్రాతినిధ్యం ఉండాలని ఆశిస్తోంది” అని వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలో అమీ బెరా అన్నారు.
 
ప్రభుత్వంలో పదవులు చేపట్టడంతో పాటు, ప్రధాన పార్టీలకు నిధులు సమకూర్చడంలోనూ భారతీయ-అమెరికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో 2015లో రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటైంది. భారతదేశంలో నరేంద్రమోదీ, అమెరికాలో డోనల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామం ఇది.
 
ట్రంప్, భారత సంతతి ఓటర్లు
రిపబ్లికన్ హిందూ కూటమి వ్యవస్థాపకుడు శలబ్ శైలీ కుమార్ షికాగోలో ఉంటారు. భారత అమెరికన్లతో ఆయన నిర్వహించిన సమావేశాలకు అనేకసార్లు డోనల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించారు. దీంతో అప్పటి వరకు సంప్రదాయబద్దంగా డెమొక్రాట్ పార్టీకి మద్దతు పలుకుతున్న భారతీయ అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ పార్టీ వైపు ఆకర్షితులు కావడం మొదలుపెట్టారు. డోనల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు భారత సంతతి అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపారు.
 
2019లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి హోదాలో అమెరికాలో పర్యటించినప్పుడు హ్యూస్టన్‌లో జరిగిన సభలో “అబ్‌కీ బార్ ట్రంప్ సర్కార్” అని పిలుపిచ్చారు. నరేంద్రమోదీ పరోక్షంగా ట్రంప్‌కు మద్దతు పలికినప్పటికీ అమెరికాలోని భారతీయ అమెరికన్లు 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల వైపు మొగ్గు చూపినట్లు ఎన్నికల విశ్లేషకులు తెలిపారు. పార్టీల వైఖరి మారడం వల్లనే ఇలా జరిగిందని రిపబ్లికన్ హిందూ కూటమి వ్యవస్థాపకుడు శలబ్‌ శైలీ కుమార్ చెప్పారు.
 
“హిందూ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీని కేవలం వైట్ అమెరికన్స్ పార్టీగా భావించారు. 2016లో ట్రంప్ హిందూ అమెరికన్లకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆ అభిప్రాయాన్ని మార్చేశారు. అయితే కొన్నేళ్లుగా రిపబ్లికన్ పార్టీ క్యాంపెయిన్ మేనేజర్లు పాత పద్దతుల్నే పాటిస్తున్నారు” అని శైలీ కుమార్ చెప్పారు.
ఈసారి, ఎక్కువ మంది భారతీయులు 'లోటస్ ఫర్ పోటస్' అంటే కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్షురాలు కావాలని నినదిస్తున్నారు. అమెరికాలోని భారతీయుల్లో ఎక్కువ మంది డెమొక్రటిక్ పార్టీ, దాని అనుబంధ సంస్థలలో పని చేస్తున్నారు. దక్షిణాసియా దేశాలకు చెందిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి మాట్లాడుతున్నారు.
 
ఇంటింటి ప్రచారం
వాల్‌స్ట్రీట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సుబా శ్రీని, ఆమె స్నేహితురాలు శుభ్ర సిన్హా కూడా ప్రచారానికి వెళ్లారు. వారితో కలిసి మేము పది ఇళ్లకు వెళ్లాం. ఎనిమిది ఇళ్లలో ఎవరూ కనిపించలేదు. ఒక ఇంట్లో డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు, మరో ఇంట్లో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు ఉన్నారు. రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నవారు మాతో మాట్లాడేందుకు నిరాకరించారు. “ఇది చాలా కష్టమైన పని. టైమ్ తీసుకుంటుంది. కేవలం 20 శాతం మంది మాత్రమే ఇంట్లో కలుస్తారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మనం ఒక్కరి మనసు మార్చగలిగినా చాలు” అని సుబా చెప్పారు.
 
క్యాంపెయిన్ ఆఫీసు వాళ్లు ఈ వలంటీర్లకు ఓటర్ల ఇళ్ల జాబితాను అందిస్తారు. పార్టీ తరపున ప్రచారం చేస్తున్న వలంటీర్లు ప్రజలతో మాట్లాడటమే కాకుండా, తాము ఆ పార్టీని ఎందుకు బలపరుస్తున్నారో కూడా వివరిస్తారు. సోఫీ కూడా తాను నివసించే ప్రాంతంలో ఇంటింటికీ వెళుతున్నారు. ఒక ఇంట్లో రిపబ్లికన్ మద్దతుదారుడితో చాలాసేపు మాట్లాడారు. “నేను వాళ్లకు నా కుటుంబం ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పాను. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మాపై ఎలాంటి ప్రభావం పడిందో వివరించాను. మనం ఏం చెబుతున్నప్పటికీ గౌరవంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఇది అమెరికా. ఇక్కడ ఓటర్లకు తమకు నచ్చినవారికి ఓటు వేసే స్వేచ్చ ఉంది” అని ఆమె చెప్పారు.
 
ఈ వలంటీర్లను 2016లో ఏర్పడిన 'ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్' అనే సంస్థ ఒకచోటకు తీసుకువస్తోంది. ఇది ఇండియన్-అమెరికన్ నాయకుల కోసం నిధులను సేకరిస్తుంది. ప్రచారంలో సహాయపడుతుంది. అమెరికాలోని భారతీయ ఓటర్లందరు ఓటు వేసేలా ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం, ఈ సంస్థ అమెరికాలోని స్వింగ్ స్టేట్స్‌లో ప్రచారం చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఓటర్లు ఇంకా ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై నిర్ణయం తీసుకోలేదు.
 
ప్రచారంలో ప్రభావిత వ్యక్తులు
నేను చింతన్‌ పటేల్‌ను కలిశాను. ఆయన ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఈ సంస్థ స్వింగ్ స్టేట్ పెన్సిల్వేయాలోని ఫిలడెల్ఫియా కేంద్రంగా పని చేస్తుంది. స్వింగ్ స్టేట్స్‌లో సౌత్ ఏషియన్ దేశాలకు చెందిన ఓటర్ల గురించి తమ సంస్థ ఇటీవల ప్రత్యేక సర్వే నిర్వహించినట్లు ఆయన చెప్పారు. "ఈ సర్వేలో భాగంగా అధ్యక్ష ఎన్నికల గురించి వారి అభిప్రాయాలు ఏంటనే దానిపై ప్రశ్నించాం. దక్షిణాసియా ఓటర్లలో కమలా హ్యారిస్‌ను బలపరుస్తున్నవారికి, ఇతరులను బలపరుస్తున్న వారికి మధ్య 50 పాయింట్లు తేడా ఉన్నట్లు మా సర్వేలో తేలింది" అని చింతన్ పటేల్ చెప్పారు. ఆయన నమ్మకం ఎంత వరకు నిజమో నవంబర్ 5న తేలనుంది.
 
దక్షిణాసియా ఓటర్ల మద్దతు పొందేందుకు డెమొక్రటిక్ పార్టీ ఇంపాక్ట్ వంటి సంస్థల సహాయం తీసుకుంటోంది. వలంటీర్లతో ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. భారతీయులు అధికంగా ఉండే ఫిలడెల్ఫియాలో జరిగిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. భారత సంతతికి చెందిన పద్మాలక్ష్మి, బంగ్లాదేశ్ గాయకుడు అరిఫ్ అఫ్సర్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. “అమెరికాలో అధ్యక్ష పదవి ఏ జాతి, మహిళా, పురుషుడా అనే అంశానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇంకా అనేక అంశాలతో ముడిపడి ఉంది” అని పద్మాలక్ష్మి అన్నారు.
 
“కమలా హారిస్ నల్లగా ఉండి ఉంటే ఎన్నికల సర్వేల్లో ముందుండేవారు. అయితే ఈ ఎన్నికలు మనందరిపైనా ప్రభావం చూపుతాయి. అందుకే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే ఇది భవిష్యత్ తరాలను ప్రభావితం చేస్తుంది” అని ఆమె అన్నారు. 2002లో అమెరికన్ జనాభా లెక్కల సంస్థ ప్రకారం ఆదేశంలో భారతీయ సంతతి అమెరికన్ల సంఖ్య 48 లక్షలు. ప్యూ సర్వే ప్రకారం 68 శాతం రిజిస్టర్డ్ భారతీయ అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనుబంధం ఉన్నవారు. కేవలం 29శాతం మాత్రమే రిపబ్లికన్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments