Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి వరదలు: సహాయ శిబిరానికి వెళదామంటే కరోనావైరస్, ఊళ్లో ఉందామంటే వరద

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (13:17 IST)
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఈ దశాబ్దకాలంలోనే అత్యధికంగా నీటి మట్టం నమోదయ్యే దిశలో సాగుతోంది. 2006 తర్వాత ఇవే పెద్ద వరదలుగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఎగువన ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం నుంచి కోనసీమ గ్రామాల వరకూ వరద భయం వెంటాడుతోంది. ఇప్పటికే వందల గ్రామాల్లో గోదావరి నీరు చేరింది.

 
పోలవరం ముంపు గ్రామాల్లో పరిస్థితి దయనీంగా మారింది. ప్రభుత్వ సాయం మాత్రం అందడం లేదని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ వాసులు వాపోతున్నారు. క్షేత్రస్థాయిలో వరదల్లో చిక్కుకున్న వారికి తగిన సహాయం అందించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

 
ఎడతెరిపిలేని వర్షాలు, ఉప్పొంగుతున్న గోదావరి, ఉపనదులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కురిసిన వర్షాల తాకిడికి నదులన్నీ పొగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉపనదుల నుంచి భారీగా వరదల జలాలు వచ్చి చేరుతున్నాయి. దాంతో గోదావరి నది నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం 6 గంటల సమయానికి కాళేశ్వరం వద్ద నీటిమట్టం 10.19 మీటర్లకు చేరింది. పేరూరి వద్ద 16 మీటర్లుగా నదీ ప్రవాహం నమోదయ్యింది. దుమ్ముగూడెం వద్ద 58.1 అడుగుల నీటి మట్టంతో నది ఉధృతి కనిపించింది.

 
భద్రాచలం వద్ద 58.1 అడుగులకు చేరింది. కూనవరం వద్ద శబరి నదీ ప్రవాహంతో 22.79 మీటర్లకు చేరింది. కుంట వద్ద 15.02 మీటర్లుగా నమోదయ్యింది. కోయిడా వద్ద 27.580 మీటర్ల మేర ప్రవాహం సాగుతోంది. పోలవరం కాఫర్ డ్యామ్ చేరుకునే సరికి అది 29.75 మీటర్లుగా నమోదయ్యింది. పోలవరం వద్ద 14.82 మీటర్లు, రాజమహేంద్రవరం పాత బ్రిడ్జి వద్ద 17.84 మీటర్ల ఉధృతిలో గోదావరి పరుగులు పెడుతోంది. దవళేశ్వరం బ్యారేజ్ వద్ద 16.8 అడుగులకు చేరకుని మూడో ప్రమాద స్థాయికి చేరింది.

 
ఈ దశాబ్దంలోనే పెద్ద వరద దిశగా..
ఎగువ నుంచి వస్తున్న నదీ జలాలను యధావిధిగా సముద్రంలోకి వదిలేందుకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ అధికారులు ఏర్పాట్లు చేశారు. 175 క్రస్ట్ గేట్లను పూర్తిగా ఎత్తేశారు. వస్తున్న ఇన్ ఫ్లోస్ ని పూర్తిగా దిగువకు వదులుతున్నారు. ఉదయం 10గంటలకు భద్రాచలం వద్ద 60 అడుగులకు నీటి మట్టం చేరగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మూడో ప్రమాద స్థాయికి చేరింది. 17.5 అడుగులకు నీటి మట్టం చేరడంతో 18లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

 
ఇది మరింత పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ ప్రవాహపు వడి గురించి ధవళేశ్వరం గోదావరి హెడ్ వర్క్స్ ఈఈ మోహన్ రావు బీబీసీతో మాట్లాడారు. ‘‘ఎగువ నుంచి ఇంకా ప్రవాహం పెరుగుతోంది. సీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం ఈరోజు సాయంత్రం వరకూ ఈ ప్రవాహం పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చనే ఆశాభావం ఉంది.

 
వర్షాలు తగ్గకపోతే కొనసాగే ప్రమాదం కూడా ఉంటుంది. దవళేశ్వరం వద్ద డిశ్ఛార్జ్ 22 లక్షల క్యూసెక్కుల వరకూ చేరుతుందని భావిస్తున్నాము. అదే జరిగితే ఈ దశాబ్దంలోనే అత్యధిక ప్రవాహం అవుతుంది. 2006 తర్వాత పెద్ద వరదగా నమోదవుతుంది. 2013లో 21లక్షల క్యూసెక్కుల నీటిని వదిలాము. ఇప్పుడు దానికి మించి వస్తే కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టే భావించాలి. దానికి తగ్గట్టుగా అప్రమత్తమయ్యాము’’ అంటూ వివరించారు. వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు చత్తీస్‌ఘడ్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈసారి వరద జలాలు పెరగడానికి కారణంగా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.

 
సహాయం కోసం మన్యం వాసుల ఎదురుచూపులు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాఫర్ డ్యామ్ సిద్ధం అయిన తర్వాత వరుసగా రెండో ఏడాది కూడా వరదలు వచ్చాయి. గత ఏడాదికి మించి ఈసారి వరదలు రావడంతో నిర్వాసితులు తీవ్రంగా ఇక్కట్లు పాలవుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సహకారం లేదని బాధితులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం రేపాక గుమ్మం గ్రామానికి చెందిన పి రాజన్నదొర బీబీసీ తో మాట్లాడారు.

 
‘‘మా గ్రామంలో గంటకు అడుగున్నర చొప్పున వరద పెరుగుతోంది. అందరి ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరింది. ఒక్క బోటు కూడా పంపించలేదు. మమ్మల్ని బయటకు తీసుకెళ్ళేందుకు కూడా ఎవరూ రాలేదు. రాత్రి అంతా బిక్కుబిక్కు మంటూ బతికాము. తెల్లారిన తర్వాత కూడా మా పట్ల నిర్లక్ష్యమే. అధికారులు కనీసం మా వైపు చూడడం లేదు. భయం గుప్పిట్లో ఉన్నాము. వరద ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. మా పిల్లలు, దూడలు అన్నీ ఏమీ కావాలో అర్థం కావడం లేదు’’ అంటూ వాపోయారు.

 
సహాయ శిబిరానికి వెళదామంటే కరోనా.. ఊళ్లో ఉందామంటే వరద
దేవీపట్నం మండలంలో కూడా దాదాపుగా అలాంటి పరిస్థితి ఉంది. గత ఏడాది వరదల సమయంలో ఆహారం గ్రామ గ్రామానికి అందించిన అధికారులు ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని పూడిపల్లి గ్రామానికి చెందిన కే సత్యన్నారాయణ బీబీసీకి తెలిపారు.

 
‘‘పోలవరం పునారావస ప్యాకేజీ అందించాలని అడుగుతున్నాం. అది ఇస్తే ఇళ్లు ఖాళీ చేస్తామని చెప్పాము. కానీ మాకు ముందు గ్రామం వదిలి కాలనీ కి వెళ్లండి అంటున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా ఊరు వదిలి వెళ్లనందుకు ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదా.. నిరుడు కనీసం మంచినీరు, ఆహారం ప్యాకేట్లు పంపించారు. ఈసారి అంతకన్నా పెద్ద వరద వచ్చింది. అయినా పట్టించుకోవడం లేదు. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత ఏటా మునిగిపోతున్నా మా పట్ల దయ చూపడం లేదు. ఫోన్ చేసి మా కష్టాలు చెప్పాము. కరెంట్ లేదు. కనీసం కిరోసిన్ అయినా పంపించండి అని అడిగాము. కానీ కనికరం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని ఆదుకోవాలి. మేము ఇంకా గ్రామంలోనే ఉన్నాము. సాయంత్రానికి పెరిగితే ఊరంతా మునిగిపోతుంది. అప్పుడేమి చేయాలన్నది అంతుబట్టడం లేదు. పునరావాస కాలనీకి వెళదామంటే కరోనా భయం. ఊళ్లో ఉందామంటే వరద భయంతో దిక్కుతోచడం లేదు’’ అని తెలిపారు.
 
 
ముందుగానే అప్రమత్తం చేశామంటున్న అధికారులు
గోదావరి వరద ప్రవాహం పెరగబోతున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలను ముందుగా అప్రమత్తం చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘సహాయక చర్యల కోసం అధికారుల బృందం రంగంలో ఉంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు కూడా వచ్చాయి. గ్రామాల్లో చిక్కుకున్న వారందరినీ పునరావాస కేంద్రాలకు రావాలని కోరాము. వారంతా సహకరించాలి. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఎవరికీ ఎటువంటి సమస్య రాకుండా భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాము. అన్ని గ్రామాలకు బోట్లు పంపించి , వరద బాధితులందరినీ వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాలని రంపచోడవరం, చింతూరు అధికారులను ఆదేశించాము. ఇప్పటికే దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి’’ అంటూ వివరించారు.

 
గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా గ్రామాల్లో ఉన్న వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఏపీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన పోలవరం మండలంలోని పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలు నాలుగు రోజుల క్రితమే నిలిచిపోయాయి. సమస్యలతో ఉన్న వారిని తరలించడం పెద్ద సమస్య అవుతోంది. మరోవైపు పోలవరం పనులన్నీనిలిపివేశారు. యంత్రాలు, సామాగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments