Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలూరు: ఈ పట్టణానికి పెను ప్రమాదం పొంచి ఉందా?

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (12:48 IST)
కొల్లేరు అందాలకు ముఖద్వారంగా ఉండే ఏలూరు నగరం ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తల్లోకెక్కింది. నాలుగు రోజుల్లో సుమారు 600 మంది ఆసుపత్రి పాలుకావడం, వారికి ఎందుకలా అయిందో కారణం ఇంకా తెలియకపోవడంతో అందరిలో ఆందోళన పెరుగుతోంది. ప్రాథమిక నివేదికలో సీసం, ఆర్గానో క్లోరిన్‌‌కు సంబంధించి పేర్కొన్న అంశాలతో భయాందోళనలు కనిపిస్తున్నాయి.

 
ప్రస్తుతం లక్షణాలు కనిపించిన వారితో పాటుగా భవిష్యత్తులో ఇంకా ఎవరెవరి మీద వాటి ప్రభావం ఉంటుందోననే ఆందోళన స్థానికుల్లో ఉంది. అయితే, అధికారులు మాత్రం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. సమస్య పరిష్కారానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు.

 
స్పష్టత రావడానికి మరింత సమయం
ఏలూరులో కొత్తగా బాధితులు ఆసుపత్రికి రావడం తగ్గింది. నాలుగు రోజుల పాటు కలకలం రేపిన తర్వాత కొత్త కేసుల నమోదు దాదాపు అదుపులోకి వచ్చింది. అదే సమయంలో బాధితులు కూడా దాదాపుగా కోలుకున్నారు. మొత్తం 600 మంది బాధితుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ ఆసుపత్రిలో మరణించిన ఇద్దరు బాధితుల్లో కరోనా, ఊపిరితిత్తుల సమస్య వంటి ఇతర సమస్యలున్నాయని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

 
మొత్తం 570 మంది వరకూ డిశ్చార్జ్ కాగా ఇంకా 30 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. సీసీఎంబీ, ఎయిమ్స్, డబ్ల్యూ హెచ్ ఓ, ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలన్నీ ఏలూరులో క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నాయి. శాంపిళ్లను సేకరించి దిల్లీ, పుణే, హైదరాబాద్ లేబరేటరీలకు తరలించారు. ప్రాథమిక నివేదిక వెలువడిన పూర్తిస్థాయి స్పష్టత రావడానికి మరో వారం రోజుల సమయం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 
ఈనాటి సమస్య కాదు
ఏలూరులో తాగునీటి కాలుష్యం సమస్య సుదీర్ఘకాలంగా ఉంది. 30 ఏళ్ల కిందటే తాగునీటి కాలుష్యంపై ఇక్కడ తీవ్ర ఆందోళనలు సాగాయి. విజయవాడ నుంచి వచ్చే కృష్ణా కాలువలో మురుగునీరు కలవకుండా నియంత్రిస్తామని 1980 చివరలో అప్పటి నగర పాలక సంస్థ నిర్ణయించింది. దానికి కోటి రూపాయల వ్యయంతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని నాటి మేయర్ వెంకటేశ్వర రావు అధికారికంగా ప్రకటించారు.

 
ముఖ్యంగా ఏలూరు కాలువలో విజయవాడ నగరానికి చెందిన మురుగునీరు కలుస్తున్నందున దానిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఆనాడు ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదని ఏలూరువాసులు చెబుతున్నారు. ఏలూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కేబీ రావు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. ‘‘మొదట మాకు కృష్ణా కాలువ నుంచి మాత్రమే నీరు వచ్చేది. తాగునీటి అవసరాలకు కృష్ణా నీరు వాడుతున్న సమయంలో అందులో కలుస్తున్న వ్యర్థాల పట్ల తీవ్ర ఆందోళన సాగింది.

 
చివరకు అప్పటి విజయవాడ నగర పాలక సంస్థ పాలకవర్గం నిర్ణయం తీసుకోవడంతో ఉపశమనం దక్కుతుందని ఆశించారు. కానీ ఫలితం లేదు. ఆ తర్వాత కూడా పదే పదే మాటలు తప్ప పనులు సాగలేదు. అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించినా చర్యలు లేవు. చివరకు గోదావరి కాలువ ద్వారా నీటిని తరలించినా ఫలితం లేదు. అటు కృష్ణా కాలువ మాదిరిగానే, అటు గోదావరి కాలువకు కూడా ఏలూరు చివరి పాయింట్. దాంతో రెండు నదుల నుంచి మొదలయిన ప్రవాహంలో అనేక చోట్ల మురుగుకాలువలు, ఇతర వ్యర్థాలు నేరుగా కలుస్తున్నాయి.

 
వాటి మీద నియంత్రణ లేదు. ధవళేశ్వరం నుంచి వచ్చే గోదావరి కాలువ కూడా అదే పరిస్థితి. వాటి పలితం ప్రస్తుతం ఏలూరు వాసులు అనుభవించాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ పరిణామాలు ఓ హెచ్చరిక మాత్రమే. జాగ్రత్త పడకపోతే తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అన్నారు.

 
పెను ప్రమాదమే పొంచి ఉంది..
ఏలూరు నగరాన్ని అనుకుని ప్రవహించే తమ్మిలేరు ఒకప్పుప్పుడు పరిశుభ్రంగా ఉండేది. కానీ, ఇప్పుడది మురుగుతో నిండిపోయింది. మురుగునీటిని కొల్లేరుకి తరలించడానికి దానిని వాడుతున్నట్టుగా కనిపిస్తోంది. కొల్లేరు వైపు నీటిని పంపు చేసే చోట మోటార్లు కూడా సక్రమంగా లేవని స్థానికులు చెబుతున్నారు.

 
ఏలూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు భౌగోళికంగా అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు చుట్టూ ప్రమాదాకర వ్యర్థాలతో కూడిన మురుగునీరు చేరిపోతోందని మునిసిపల్ శాఖలో పనిచేసిన రిటైర్డ్ ఎస్ఈ పి వీరభద్రరావు బీబీసీతో అన్నారు. ‘‘ఏలూరుని కొల్లేరు పూర్తిగా ప్రభావితం చేస్తోంది. కానీ ప్రస్తుతం కొల్లేరు పూర్తిగా ఆక్వా చెరువులుగా మారిపోయింది. ఆదాయం వస్తుందనే పేరుతో ప్రభుత్వాలు చూసీ చూడనట్టు వదిలేశాయి.

 
ఫలితంగా కాలుష్యం తీవ్రమయ్యింది. ఇప్పటికే కృష్ణా కాలువ ద్వారా విజయవాడ నగరం నుంచి వచ్చే మురుగునీరు. దాంతో పాటు పాల ఫ్యాక్టరీ, రెండు చక్కెర కర్మాగారాలు, గుడివాడ పట్టణం, ఏలూరు నగరానికి చెందిన మురుగు మొత్తం ఒకే చోట చేరుతోంది. తమ్మిలేరు, రామిలేరు, బుడమేరు ద్వారా వరదలు వచ్చినప్పుడు మిగిలిన సమయమంతా మురుగునీరు మాత్రమే వస్తోంది. దాంతో అవన్నీ పేరుకుపోయిన ప్రాంతంలో కాలువ నీరు మాత్రమే కాదు, భూగర్భ జలాలు కూడా కలుషితమవుతాయనడంలో అనుమానం లేదు.

 
అందుకే ఏలూరుతో పాటుగా కొల్లేరు తీరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అధిక ప్రాంతానికి ఇలాంటి సమస్య పొంచి ఉంది’’ అన్నారాయన. డెల్టా మొత్తం అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉంది. గోదావరి జలాలు, భూ వినియోగంలో అవలంభించిన విధానాల మూలంగా గోదావరి పశ్చిమ డెల్టా ప్రాంతం ప్రమాదకర స్థితిలోకి నెట్టబడిందని పరిశోధకుడు డాక్టర్ పీఏఆర్కే రాజు అంటున్నారు.

 
గతంలో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నీటి నాణ్యతపై పరిశోధన కమిటీలో ఆయన ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలను బీబీసీకి తెలిపారు. 2015లో ప్రారంభించి 2017 వరకూ దాదాపుగా 250 గ్రామాల్లో నీటి శాంపిళ్లు సేకరించాం. పలు చోట్ల కాలువల నీటిని కూడా పరిశీలించాము. దాదాపుగా తాగు, సాగు నీరు కలుషితమయిపోయింది. ప్రధానంగా ఆక్వా సాగు విషయంలో నిబంధనలు ఉల్లఘించారు. నిర్వహణా వైఫల్యాలు ఇప్పుడు దాదాపుగా అందరూ ఆర్వో ప్లాంట్ల నుంచి నీటిని కొనుగోలు చేసి వాడాల్సిన స్థితికి చేర్చింది.

 
అదే సమయంలో ఆక్వా సాగు డెల్టాలో దాదాపు 60 శాతం విస్తరించింది. దాని ఫలితంగా తాగు, సాగు నీరు కూడా వినియోగానికి ఉపయోగకరంగా లేవని తేలింది. ప్రధానంగా ఈకోలి వంటివి అధికంగా ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. క్యాన్సర్, లివర్ సమస్యలు, అల్సర్ వంటి వాటికి ఎక్కువమంది గురవుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు దిగజారిపోవడానికి కారణాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరం అని పేర్కొన్నారు.

 
నీటి కాలుష్యమే పంటలు, పాలు కలుషితం కావడానికి కారణం
తాగునీరు, సాగునీరు కూడా కలుషితమవుతున్న వేళ వాటిని వినియోగించిన ప్రజలు, జంతువులు, పంటలు కూడా కాలుష్యమయంగా మారుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏలూరులో సమస్యకు మూలాలు వెలుగులోకి తీసుకురావడం, పరిష్కారాలను వెదకడం అత్యవసరం అని రైతు సంఘం రాష్ట్ర నేత బి.బలరాం అభిప్రాయపడ్డారు.

 
‘‘ఏలూరు నగరంలో మాత్రమే సమస్య బయటపడింది. ఇంకా అనేక చోట్లు, రెట్టింపు సంఖ్యలో ప్రజల్లో ఇలాంటి సమస్యలు ఏదో స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలో మెదడు, కిడ్నీ, ఊపిరితిత్తులు సంబంధిత సమస్యలు ఎక్కువగా బయటపడుతున్నాయి. వాటన్నింటికీ నీటి కాలుష్యమే కారణం. కలుషిత జలాలతో సాగు చేస్తున్న పంటల మూలంగా ప్రజలకు సమస్యలు వస్తున్నాయి.

 
అవే నీళ్లు తాగుతున్న జంతువుల ద్వారా పాల రూపంలో ప్రజల శరీరాల్లో చేరుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పట్టణ ప్రాంత ప్రజల మురుగునీటితో పాటుగా ఆక్వా సాగు మూలంగా పెరిగిన రసాయనాల మూలంగా సమస్య తీవ్రమవుతోంది. ప్రభుత్వం తాత్కాలిక చర్యలతో సరిపెడితే చిక్కులు వస్తాయి. దీర్ఘకాలిక వ్యూహాలతో నీటి సమస్యను పరిష్కరించాలి. దానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరిష్కారం లభిస్తుంది. ప్రజల ఆరోగ్యానికి రక్షణ ఉంటుంద’’న్నారు.

 
నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటాం...
ఏలూరులో ప్రజలు హఠాత్తుగా అనారోగ్యానికి గురికావడం వెనుక అసలు కారణాలు వెలికితీసే ప్రయత్నం సాగుతోందని ఏపీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి, ఏలూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ల నాని తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ ‘‘ప్రాథమిక నివేదికల ప్రకారం కచ్చితమైన నిర్ధారణలు జరగలేదు. సీసం, నికెల్ వంటి అనుమానాలు ఉన్నాయి.

 
ఫెస్టిసైడ్స్ ప్రభావం కూడా పరిశీలించాల్సి ఉంది. వివిధ బృందాలు పలు కోణాల్లో పరిశోధనలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో సమగ్ర చర్యలకు సిద్ధంగా ఉంది. తాగునీరు విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏలూరులో కొన్ని డివిజన్లకే ఈ సమస్య పరిమితమయ్యింది. దానికి కారణాలు కూడా కనుగొనాల్సి ఉంది. వాటన్నింటికీ సమాధానం వచ్చిన తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తాం’’ అని వివరించారు.

 
సమస్య తీవ్రం, తగ్గట్టుగా చర్యలుండాలి...
ఏలూరు ఘటనలో మృతుల సంఖ్య తక్కువగా ఉండడం, బాధితులు కూడా స్వల్ప వ్యవధిలోనే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం పెద్ద ప్రమాదంగా కనిపించకపోయినప్పటికీ దీర్ఘకాలిక ప్రభావాలు ఖాయమని వైద్యులు అంటున్నారు. ఏలూరుకి చెందిన డాక్టర్ ఎం తులసీరామ్ బీబీసీతో అన్నారు.‘‘క్యాన్సర్ కారకాలయైన పలు కెమికల్స్ నేరుగా శరీరంలో ప్రవేశించడానికి ఏలూరు, ఆ పరిసరాల్లో ఎక్కువగా ఆస్కారం కనిపిస్తోంది. ఆర్వో ప్లాంట్ వాటర్, మునిసిపల్ వాటర్ తాగిన వాళ్లతోపాటు, బోరు నీళ్లు తాగిన వారికి కూడా ప్రస్తుతం ఈ సమస్య రావడానికి అదే కారణం.

 
భూగర్భ జలాల్లో కూడా ప్రమాదకరమైన రసాయనాలు మిళితం అయిపోయాయి. వాటిలో కొన్ని పశుదాణా ద్వారా చేరి, పాలలోని కొవ్వుల ద్వారా మానవులలో ప్రవేశించిన తర్వాత వాటి పరిణామం, ప్రభావం పెరుగుతోంది. ఒకసారి అలాంటి ప్రమాదం కొవ్వులో చేరితే తక్కువ వ్యవధిలోనే అవి ప్రమాద స్థాయికి చేరతాయి.

 
పరిష్కారంగా తాగునీటి నిర్వహణలో ప్రమాదకర రసాయనాల ప్రభావం నామమాత్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. మురుగునీరు ఎట్టి పరిస్థితిలోనూ మంచినీటి కాలువల్లోకి చేరకుండా నియంత్రించాలి. లేదంటే ఆ తర్వాత నష్టం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంటుంద’’న్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmy Kaur : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments