Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా ఉన్నవాళ్లకు ఎక్కువ జీతం వస్తుందా?

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (20:40 IST)
తనకు తరచుగా ఫ్రీ డ్రింక్స్, ఫ్రీ లంచ్, ఫ్రీ పార్టీ టికెట్లు వస్తుంటాయని కేప్ టౌన్‌కు చెందిన ఫ్యాషన్ మోడల్ మార్కీ చెప్పారు. ఎందుకు మీకు ఫ్రీ టికెట్లు ఇస్తుంటారు? అని అడిగితే, తన అందమే తనకు ఈ టికెట్లు తెచ్చి పెడుతుంటుందని ఆమె చెబుతుంటారు. ‘‘నాకు ఇలా ఫ్రీ టికెట్లు ఇవ్వడం సరికాదని కొందరు అనుకోవచ్చు’’అని సన్నంగా, పొడుగ్గా ఉండే ఆమె బీబీసీ బిజినెస్ డైలీ రేడియో ప్రోగ్రామ్‌లో చెప్పారు. ‘‘చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో.. ఇలా ఉండేందుకు మీరు చాలా శ్రమించి ఉంటారు. అందుకే మీకు ఉచిత టిక్కెట్లు వస్తున్నాయి. వీటిని మీరు హాయిగా తీసుకొని, ఆస్వాదించండి’’అని ఆమె అన్నారు.
 
మీరు నమ్మినా, నమ్మకపోయినా తక్కువ అందంగా ఉండేవారిపై పక్షపాతం అనేది హాలీవుడ్, సోషల్ మీడియా, ప్రకటనలు దాటి బయట ప్రపంచంలోనూ కనిపిస్తుంది. అందంగా ఉండే వారి జీవితం సాఫీగా సాగడంతోపాటు వీరికి వచ్చే ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే, అందంగా కనిపించడంతో మన జీవితం ఎంతవరకు మెరుగ్గా ఉంటుంది? ఒకసారి చూద్దాం.
 
సోషల్ మీడియాతో..
‘‘అందం’’ గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతుంటుంది. వీరు అందంగా ఉండటం వల్లే ‘‘ఉచితాలు’’ వచ్చిపడుతున్నాయని కొందరు చెబుతుంటారు. ఒక మహిళ అయితే, తను అందంగా ఉండటం వల్లే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు లేనప్పటికీ తనకు ఇంటర్వ్యూకు పిలిచారని సోషల్ మీడియా వేదికగా చెప్పారు. సోషల్ మీడియా వల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండానే తమ అందంతో మెరుగైన ఆఫర్లను ఒడిసిపట్టే అవకాశం లభిస్తోంది. ‘‘ఇలాంటి అవకాశాలు నేడు చాలా పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఇన్‌స్టాగ్రామ్‌ అని చెప్పుకోవచ్చు’’అని మార్కీ వివరించారు. యువతకు చేరువయ్యేందుకు నేడు బ్రాండ్లు పోటీపడుతున్నాయి. నేటి యువత ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియానే ఎక్కువగా ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే.
 
‘‘మీకు చాలా ఫ్రీ ప్రోడక్టులు వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా వీటిని మీ ఇన్‌స్టాలో షేర్ చేయడం. ప్రజలకు వీటి గురించి వివరించడం.. అంతే’’అని మార్కీ వివరించారు. రెస్టారెంట్ల ప్రారంభం లాంటి చాలా కార్యక్రమాలకు కూడా మార్కీకి ఆహ్వానాలు అందుతుంటాయి. ‘‘మీరు అక్కడికి వెళ్లి, హాయిగా గడిపితే చాలు. రెస్టారెంట్ నిర్వాహకులకు కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే వారు తీసుకునే ఫోటోలలో అందమైన అమ్మాయిలు తమ రెస్టారెంట్‌లో కనిపిస్తుంటారు’’అని ఆమె వివరించారు. మరోవైపు వ్యక్తిగతంగా తనకు కూడా ఇలాంచి ఉచితాలు, తన గురించి ప్రజలు మాట్లాడుకోవడం ఇష్టమని ఆమె వివరించారు. ‘‘అందంగా ఉండటం, మోడల్‌గా కొనసాగడంతో ఇలాంటి ఆఫర్లు రావడం అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ మనం కూడా పెద్దపెద్ద నగరాల్లో జీవించాల్సి ఉంటుంది. మనకు కూడా చాలా ఖర్చులు ఉంటాయి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి’’అని ఆమె చెప్పారు.
 
‘‘బ్యూటీ బయాస్’’
టెక్సస్ యూనివర్సిటీకి చెందిన డేనియేల్ హెమర్మేష్ ఏళ్ల నుంచి ఈ ‘‘బ్యూటీ బయాస్’’పై అధ్యయనం చేపడుతున్నారు. ‘‘అందంగా కనిపించేవారికి ఎక్కువ జీతం ఇస్తారు. బ్యాంకు రుణాలు పొందడం కూడా వీరికి కాస్త సులువే. వీరికి మంచిమంచి ఉద్యోగ అవకాశాలు వరుస కడుతుంటాయి. ప్రత్యేక ఆఫర్లు కూడా అలానే ఉంటాయి’’అని డేనియేల్ చెప్పారు. ‘‘మనం అందంగా కనిపిస్తున్నారని అనుకునేవారు కూడా తాము మరింత అందంగా కనిపించేందుకు, మరిన్ని ఆఫర్లు ఒడిసి పట్టేందుకు ప్రయత్నిస్తుంటారు’’అని ఆయన వివరించారు. ‘‘మీరు యూనివర్సిటీలో పాఠాలు చెప్పడాన్నే తీసుకోండి.. నిజానికి ఇక్కడ అందానికి పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ, అందంగా ఉండే ఎకానమిస్టులు కాస్త ఎక్కువగా సంపాదిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి’’అని ఆయన తెలిపారు.
 
అందంగా కనిపించడంతో ఒక వ్యక్తికి జీవితంలో సగటున 2,30,000 డాలర్లు (రూ.1.9 కోట్లు)అదనంగా సంపాదించొచ్చని ఆయన అంచనా వేశారు. ఇక్కడ ఒక గంటకు 20 డాలర్లు (రూ.1,650) వేతనాన్ని అంచనాగా తీసుకొని ఆయన లెక్కవేశారు. ఇదే మోడల్‌ను మనం ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ లేదా ఇన్వెస్టిమెంట్ బ్యాంకర్‌ జీతాలతో పోల్చిచూస్తే, అందంగా ఉండేవారు, కాస్త తక్కువగా ఉండేవారి మధ్య చాలా తేడా కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడ లింగ వివక్ష కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన వివరించారు. అందంగా ఉండే మహిళల కంటే అందంగా ఉండే మగవారే ఎక్కువ సంపాదిస్తారని ఆయన అంచనా వేశారు. అందంగా ఉండే మగవారు, కాస్త తక్కువ అందంగా ఉండే మగవారి మధ్య వేతనంలో దాదాపు 10 శాతం తేడా కనిపిస్తోందని, అదే మహిళల విషయంలో ఇది కేవలం 5 శాతమేనని తెలిపారు. ఇక్కడ వ్యక్తిత్వం, మేధస్సు, విద్య, వయసు, జెండర్, జాతి లాంటి అంశాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని, కానీ, ఇక్కడ అందానికి దేనితోనూ సంబంధం ఉండదని ఆయన అన్నారు.
 
అందం అంటే?
అందాన్ని నిర్వచించడం చాలా కష్టమని చాలా మంది అంటుంటారు. కానీ, డేనియేల్ దీనితో విభేదిస్తున్నారు. ఎవరు అందంగా ఉన్నారు?, ఎవరు తక్కువ అందంగా ఉన్నారు? అనే విషయంలో చాలా మంది ఒకే అభిప్రాయంతో ఉంటారని ఆయన చెప్పారు. ‘‘మీరు, నేను కలిసి వీధిలో అలా నడుచుకుంటూ వెళ్లాం అనుకోండి. అక్కడ ఒక పది మంది కనిపిస్తారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు చాలా అందంగా ఉంటారు. ఈ విషయంలో చాలా మందికి ఒకే అభిప్రాయం ఉంటుంది’’అని ఆయన చెప్పారు. బ్యూటీ బయాస్ విషయంలో జాతి అనేది పెద్దగా ప్రభావం చూపిందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ‘‘జాతి వేరైనప్పటికీ, అందం విషయంలో మన అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. అందంగా కనిపించే నల్లజాతి మహిళను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు మెచ్చుకుంటారు. ఆసియా మహిళలు, యూరప్ మహిళలు అందరి విషయంలోనే అందం ఇలానే పనిచేస్తుంది’’అని ఆయన అన్నారు.
 
ఊబకాయం..
మరింత అందంగా కనిపించేందుకు లిప్ ఫిల్లర్లు, బొటాక్స్ లాంటి చికిత్సలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. అయితే, వీటి వల్ల అందంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని డేనియేల్ అభిప్రాయపడుతున్నారు. ‘‘దీని వల్ల అందం పెరుగుతుందని ప్రజలు అనుకుంటారు. మంచి బట్టలు వేసుకోవడం, ఖరీదైన కాస్మెటిక్స్ వాడటం, జుట్టును అందంగా అలంకరించుకోవడం లాంటివి కూడా చేస్తుంటారు. కానీ, షాంఘైలో మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో అందంపై ఎక్కువ ఖర్చుపెట్టేవారు తక్కువ ఖర్చుపెట్టేవారికంటే అంత గొప్పగా ఏమీ కనిపించడంలేదని తేలింది’’అని ఆయన చెప్పారు. అందం, ఉద్యోగాల మధ్య సంబంధం విషయానికి వస్తే, ఇక్కడ బరువు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని రచయిత ఎమిలీ లారెన్ అంటున్నారు.
 
జాతి, జెండర్, వైకల్యం, వయసు ఆధారంగా వివక్షపై నిషేధం విధిస్తూ చాలా దేశాలు చట్టాలు తీసుకొచ్చినప్పటికీ, అందం విషయంలో ఇవేమీ పనిచేయవని ఎమిలీ అన్నారు. ఈ విషయంలో మార్పులు రావాలని, దీనిపై అవగాహన కల్పించాలని ఆమె వివరించారు. ‘‘ఊబకాయులపై వివక్ష చూపే ఫ్యాట్ ఫోబియా కూడా రేసిజమే’’అని ఆమె అన్నారు. ‘‘బానిసత్వం మొదలైనప్పుడు, నల్లజాతి మహిళల కంటే తమను తాము భిన్నంగా చూసుకునే అవసరం తెల్లజాతి మహిళలకు వచ్చింది. అప్పుడు వారికి సన్నగా కనిపించడం అనే సమాధానం దొరికింది’’అని కెనడాకు చెందిన ఎమిలీ చెప్పారు. ప్రకటనలు, సినిమాల్లో లావుగా కనిపించేవారిని ఎవరికీ నచ్చనట్లుగా, మేధస్సు తక్కువగా ఉండేవారిగా చూపిస్తారని ఆమె అన్నారు. ‘‘సన్నగా ఉండేవారితో పోల్చినప్పుడు లావుగా ఉండేవారు ఎక్కువ జీతం సంపాదించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇక్కడ అభిప్రాయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’అని ఆమె వివరించారు.
 
ఈ సిద్ధాంతాలతో సైన్స్ కూడా ఏకీభవిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్రిటన్‌లోని షెఫ్ఫీల్డ్ హలామ్ యూనివర్సిటీ పరిశోధన ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఉద్యోగ సంస్థలకు లావుగా ఉండేవారివి, సన్నగా ఉండేవారివి ఒకేలాంటి రెస్యూమ్‌లను ఈ అధ్యయనంలో ఇచ్చారు. దీనిలో ఉద్యోగ సంస్థలు సన్నగా ఉండే వారివైపే ఎక్కువగా మొగ్గుచూపించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య వంద కోట్లు దాటిందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అందుకే లావు విషయంలో మన పక్షపాత ధోరణిని మార్చుకోవడానికి ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఇదేమీ కొత్తకాదు..
బ్యూటీ బయాస్ అనేది కొత్తేమీ కాదు. తరాల నుంచీ ఇది మనపై ప్రభావం చూపిస్తోంది. హాలీవుడ్ తారల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ దీనికి ప్రభావితం అవుతున్నారు. సమాజంలో అందంపై ఉండే అభిమానంపై వ్యతిరేకత నేడు క్రమంగా పెరుగుతోందని, ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ అంచనాలు నేడు మారుతున్నాయని మార్కీ అంటున్నారు. ‘‘నేడు తమ కంటూ ప్రత్యేక కథ ఉండే మోడల్స్, ఆర్టిస్టులు, నటులపై ప్రజలు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ మోడలింగ్, యాక్టింగ్‌తోపాటు ఇతర అంశాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తిత్వం కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది’’అని ఆమె అన్నారు. ‘‘ఇది ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్. ఇది అద్భుతమైనది కూడా’’అని ఆమె అన్నారు. బీబీసీ వరల్డ్ సర్వీస్ రేడియో ప్రోగ్రామ్ ‘‘బిజినెస్ డైలీ’’ ఆధారంగా ఈ కథనం రాశాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

సమంత శోభిత కంటే ఏడురెట్లు ఆ విషయంలో బలంగా వుందట!?

Allu Arjun Pressmeet, సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments