Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్లింగ్స్: ఈ సినిమా చూశాక భర్తలంతా భార్యను చూసి వణుకుతున్నారా?

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2022 (17:43 IST)
గృహ హింస అంటే నవ్వుకునే విషయం కాదు. కానీ, గృహ హింస కథావస్తువుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఒక కామెడీ భారతీయ సినీ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది ఒక ముస్లిం జంట ప్రేమ కథ. ఈ ప్రేమ కథ హింసాత్మకంగా మారి పగ తీర్చుకునేవరకు దారి తీసిన ప్రయాణమే ఈ సినిమా. ఇద్దరు ప్రేమికులు బద్రున్నీసా (అలియా భట్), హంజా (విజయ్ వర్మ) పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో సినిమా మొదలవుతుంది. కానీ, వారి కథ సుఖాంతం కాదు.

 
వీరు దిగువ మధ్య తరగతి నివాసముండే గృహ సముదాయాల్లో ఉంటారు. పెళ్లయి మూడేళ్లు పూర్తవుతుంది. కానీ, బద్రున్నీసా తన శత్రువుతో కాపురం చేస్తున్నట్లుగా ఉంటుంది. హంజా ఇంట్లో భార్యను నిత్యం వేధిస్తూనే ఉంటాడు. రాత్రి పూట వేధింపులు, పొద్దునే సారీ చెప్పడం. ఇదే తంతు సాగుతూ ఉంటుంది. కానీ, ఈ హింసకు ఆమెపై ఉన్న ప్రేమే కారణం అని తనను తాను సమర్ధించుకుంటూ ఉంటాడు. ఆమె కూడా ఈ రకమైన ప్రేమను ఆమోదిస్తూ ఉంటుంది. "అవును నేను వెధవనే కానీ, నీ పై ప్రేమతోనే నీపై చేయి చూసుకుంటున్నాను" అని చెబుతూ ఉంటాడు హంజా.

 
ఆమె వీటన్నిటినీ భరిస్తూ బతుకుతుంటుంది. అతని తాగుడు అలవాటును మాన్పిస్తే అన్నీ సర్దుకుంటాయి అని ఆమె అనుకుంటూ ఉంటుంది. లేదా పిల్లలు పుడితే వారి బంధం బలపడుతుంది అనే నమ్మకంతో ఉంటుంది. కానీ, ఇంట్లో బానిస బతుకు కొనసాగుతూనే ఉంటుంది. చివరకు ఒక రోజు వారి కథ అటుది ఇటు అవుతుంది. అలియా తల్లి సహాయంతో భర్తను వేధించడం మొదలుపెడుతుంది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ కలిసి హంజాను కిడ్నాప్ చేస్తారు. వాళ్లింట్లోనే బంధించి అలియాను హంజా హింసించిన తీరులోనే ఆయన్ను హింసించడం మొదలుపెడతారు.

 
ఈ సినిమా స్క్రిప్ట్‌ను జస్మీత్ కే రెయిన్ పర్వేజ్ షేక్‌తో కలిసి రాశారు. ఈ కథ తొలుత తల్లీ కూతుళ్ళ సంభాషణ నుంచి ఒకే ఒక్క లైనుగా పుట్టిందని చెప్పారు. "తల్లీ కూతుళ్లకు ఉండే కలలు, అవి కూలిపోవడం... కూతురి పెళ్లి నాశనమవుతుంది. దీంతో ఆ బంధాన్ని నిలబెట్టేందుకు ఇద్దరూ హాస్యాస్పదమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు". ఈ సినిమాలో తల్లి పరిస్థితుల పట్ల అవిశ్వాసంతో ఉంటారు. ఆమె సొంత అనుభవం వల్ల అల్లుడు మారడని ఆమెకు గట్టి నమ్మకం ఉంటుంది. ఆమె లాంటి జీవితాన్ని తన కూతురు అనుభవించకూడదనే ఉద్దేశంతో అల్లుడిని వదిలిపెట్టి రమ్మని సలహా ఇస్తూ ఉంటుంది. వదిలిపెట్టి రా, లేదా చంపేయమని కూతురికి సలహా ఇస్తూ ఉంటుంది.

 
"కానీ, ఇది కూతురి ప్రయాణం. ఆమె సహనం నుంచి ప్రతీకారం తీర్చుకునే వరకు మారి చివరకు ఆ హింసాత్మక వాతావరణం నుంచి బయట పడుతుంది" అని రీన్ చెప్పారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి సానుకూల రివ్యూలు లభించాయి. ఈ సినిమా ఒక్క భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా బాగా ఆదరణ లభిస్తోందని నెట్‌ఫ్లిక్స్ చెబుతోంది. "ఆంగ్లేయేతర సినిమా డార్లింగ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఆదరణ వచ్చిందని చెబుతున్నారు. సినిమా విడుదల చేసిన మొదటి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఒక కోటి గంటలకు పైగా గడిపారు" అని నెట్ ఫ్లిక్స్ బీబీసీతో చెప్పింది. ఈ సినిమా అమెరికా, ఆఫ్రికా, ఆసియా, యూఏఈ, సింగపూర్, మలేసియా, కెన్యా, ట్రినిడాడ్, టొబాగోలతో సహా మొత్తం 16 దేశాల్లో టాప్ టెన్ సినిమాల్లో ట్రెండ్ అవుతోందని ప్రకటనలో తెలిపింది.

 
ఈ సినిమాకు ఇంత ఆదరణ ఎందుకు లభిస్తోంది?
ఇది అర్థం చేసుకోవడం అంత కష్టమైన విషయమేమి కాదు. బాలీవుడ్‌లో అగ్ర నటిగా ఉన్న భట్‌కు అభిమానులు బాగా ఉన్నారు. ఈ సినిమాను షారుక్ ఖాన్ ప్రొడక్షన్ సంస్థ సహకారం ఉంది. వీటన్నిటితో పాటు ఈ సినిమాలో గృహ హింస ప్రధానాంశంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో కనీసం ఒకరు హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఈ హింస ముఖ్యంగా సన్నిహిత భాగస్వాముల నుంచి ఎదురవుతోంది. భారతదేశంలో మహిళల పై చోటు చేసుకుంటున్న హింస గురించి నమోదవుతున్న కేసుల్లో గృహ హింస కేసులు ఎక్కువగా ఉన్నాయి. వీటి సంఖ్య ప్రతి ఏడాది స్థిరంగా ఉంటోంది.

 
2020లో మొత్తం 112,292 మంది మహిళల నుంచి హింసకు గురవుతున్నట్లు పోలీసులు ఫిర్యాదులు అందుకున్నారు. కానీ, ఈ దేశంలో బాధితులు మౌనంగా ఉండాలనే సంస్కృతికి బలవుతూ ఉంటారు. గృహ హింసను సాధారణం చేసి చూడటం కూడా ఉంది. ఇటీవల నిర్వహించిన ఒక ప్రభుత్వ సర్వేలో 40% పైగా మహిళలు, 38% పైగా పురుషులు గృహ హింసను సమర్ధించారు. మహిళ అత్తింటివారిని గౌరవించకపోయినా, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినా, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినా, సెక్స్ కు అభ్యంతరం చెప్పినా, సరిగ్గా వంట చేయకపోయినా పురుషులు కొట్టడం సరైందేనని అన్నారు.

 
అందుకే చిన్న చిన్న కారణాలకు హంజా ఇంట్లో భార్యను కొడుతున్నప్పుడు ఇరుగు పొరుగు చూడలేనట్లు తప్పుకొంటారు. "ఈ సినిమా కోసం అధ్యయనం చేస్తున్నప్పుడు, చాలా మందికి గృహహింస సరైందేననే అభిప్రాయం ఉందని రీనాకు అర్ధమయింది. చాలా మంది గృహ హింసను భరిస్తూ అందులోనే జీవించాలని అనుకుంటారు". "నేను చాలా మంది మహిళలు, గృహ హింస నుంచి బయటపడిన వారు, గృహ హింస గురించి ఫిర్యాదులు చేసే వివాహితులతో మాట్లాడాను. వారు మోసానికి గురవుతున్నారని వారికి తెలుసు కానీ, భర్త మారతాడనే ఆశతో జీవించేస్తూ ఉంటారు. సొంతంగా వారు గాని, లేదా వారు బాగా ప్రేమించిన వ్యక్తులు ఈ విషయాలకు ప్రభావితమైనప్పుడు మాత్రమే స్పందిస్తారు" అని అన్నారు.

 
ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా పురుషులపై హింసను ప్రేరేపిస్తోందని అంటూ పురుషుల హక్కుల ప్రచారకర్తల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంది. భట్ ను "ఇండియా అంబర్‌హెర్డ్" అంటూ పిలవడం మొదలుపెట్టారు. హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్ ఇటీవల ఆమె మాజీ భర్త జానీ డెప్ పై నమోదు చేసిన గృహ హింస కేసులో ఓడిపోయారు. "ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత గృహ హింసకు గురైన కొన్ని వేల మంది పురుషులు వణికిపోయారు. ఈ సినిమాతో పాటు అలియా భట్ నటించిన సినిమాలను బహిష్కరించాలి" అంటూ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే పురుషుల హక్కుల సంస్థ ట్వీట్ చేసింది. ఈ సినిమా పురుషులపై గృహ హింసను ప్రచారం చేస్తుందనే ఆరోపణను రీన్ తోసి పుచ్చారు.

 
"గృహ హింస ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఇది పురుషులకు కూడా జరగొచ్చు. ఇది చాలా తీవ్రమైన విషయం. మేమీ విషయాన్ని చాలా సున్నితంగా, సహానుభూతితో చూశాం" అని ఆమె బీబీసీతో చెప్పారు. "హింస సమాధానం కాదని మాకు తెలుసు. మేము ఏ ఒక్కరి పైనా హింసను ప్రచారం చేయడం లేదు. ఈ సినిమా హింసకు వ్యతిరేకంగా ఉండాలనే సందేశాన్నిస్తోంది. ఈ సినిమా చూస్తే మీకర్ధమవుతుంది. ఈ సినిమాను చూడకుండా విమర్శిస్తే నేనేమి చెప్పగలను" అని ప్రశ్నించారు. ఈ సినిమాను సమర్ధిస్తూ చాలా మంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు. కొందరు ఈ సినిమాను చూడటాన్ని ఎంజాయ్ చేశామని చెబుతుండగా, కొందరిని ఈ సినిమా కదలించిందని చెబుతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత సాధికారత సాధించినట్లుగా అనిపించిందని కొందరు బాధితులు చెబుతున్నారు. భారతదేశం లాంటి పితృస్వామ్య సమాజంలో మహిళలే ఎక్కువగా హింసకు గురవుతూ ఉంటారని కొందరు చెప్పారు.

 
"డార్లింగ్స్ పురుషులకు వ్యతిరేకం కాదు. చుట్టూ చోటు చేసుకునే లింగ వివక్ష, పితృస్వామ్య విధానాల పట్ల మౌనం వహించే తీరును సహజంగా చూడటం గురించి ఈ సినిమా మాట్లాడుతుంది" అని దీప్ జైస్వాల్ అన్నారు. "వీధుల్లో మహిళల భద్రత గురించి చాలా దృష్టి పెట్టే మనం ఇంట్లో, చుట్టూ తెలిసిన సమాజంలో జరిగే హింస గురించి పట్టించుకోకపోవడం మరింత ప్రమాదకరం" అని ఆయన అన్నారు. ఈ సినిమాకు వచ్చిన స్పందన చాలా సంతోషంగా ఉందని రీన్ అన్నారు. "సినిమాను వినోదం కోసం, ఆలోచింపచేసేందుకు తీస్తారు. కళలు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలని నేను నమ్ముతాను. మా సినిమా ఒక సున్నితమైన విషయాన్ని స్పృశించింది". "మేమీ విషయం గురించి ఒక చర్చను మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. మా సినిమాలో పాత్రలు సమాజాన్ని ప్రతిబింబిస్తాయి. గృహ హింస గురించి చర్చ మొదలుపెట్టేందుకు మా సినిమా నాంది కావాలని అనుకుంటున్నాం. ఈ విషయంలో మేము విజయవంతం అయ్యాం" అని అన్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం