Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు-స్టాలిన్: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పదేపదే ఎందుకు అంటున్నారు?

బిబిసి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (20:44 IST)
దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి జనాభా నియంత్రణ మీద మరొకసారి చర్చ మొదలైంది. ఇది పాత అంశమే కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రస్తావించడంతో ఇప్పుడు కాస్త ప్రాధాన్యం సంతరించుకుంది. జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇది ఇంకాస్త పెరిగింది.
 
అమరావతిలో ప్రజలు వృద్ధులు అవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని చంద్రబాబు అక్టోబర్ 19న అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మరొకసారి పిలుపునిచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ‘అనర్హులుగా’ చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామన్నారు. ఆ మరుసటి రోజే అంటే ఆదివారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పార్లమెంటులో సీట్ల ప్రాతినిధ్యం మీద జనాభా నియంత్రణ చూపించే ప్రభావాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక వివాహ వేడుకకు హాజరైన ఆయన, ‘‘పార్లమెంటు స్థానాలు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లలను ఎందుకు కనకూడదు?’’ అని ప్రశ్నించారు.
 
జనాభా నియంత్రణ మీద చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం, జనాభా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజింగ్ గురించి చంద్రబాబు ప్రస్తావించగా, పార్లమెంటులో ప్రాతినిధ్యం గురించి స్టాలిన్ మాట్లాడారు.
 
వృద్ధుల సంఖ్య పెరుగుతోందా?
‘‘దక్షిణాది రాష్ట్రాల్లో యువత సంఖ్య క్రమంగా తగ్గుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని చంద్రబాబు అన్నారు. జపాన్, చైనా వంటి అనేక దేశాలు ఈ సమస్యతో ఎలా పోరాడుతున్నాయో కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రాభివృద్ధి కోసం రూపొందిస్తున్న విజన్‌-2047లో జనాభా మీద ‘‘ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన చెబుతున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం సంతానోత్పత్తి రేటు 2.0గా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అది 1.7గా ఉంది. చంద్రబాబునాయుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. 2014 నుంచే ఆయన దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. జనాభా పెరిగితేనే మానవ వనరులు వృద్ధి చెంది సంపద పెరుగుతుందని చెబుతూ వచ్చారు.
 
‘‘సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువగా ఉంటే సంబంధిత దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం చూపుతుంది’’ అని ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌)కి చెందిన ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ బీబీసీతో అన్నారు. 2001లో ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధుల జనాభా 12.6 శాతం. కొంత కాలంగా అది పెరుగుతూ వస్తోందని డేటా చెబుతోంది. ‘‘భారత రిజిస్ట్రార్ జనరల్ గణాంకాల ప్రకారం ఈ జనాభా 2011లో 15.4 శాతంగా ఉండగా 2021లో 18.5 శాతం, 2031 నాటికి 24.7 శాతానికి పెరగొచ్చని అంచనా వేస్తున్నట్లు’’ ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ అన్నారు.
 
వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను సౌత్ కొరియా ప్రకటించింది. జపాన్‌ అయితే మ్యారేజ్‌ బడ్డెట్‌ కేటాయించింది. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లోనే అలా ఉంటే, ఇంకా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగా మేల్కోవడం మంచిదే కదా. ప్రస్తుత లెక్కల ప్రకారం మగవాళ్ల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు కాగా, మహిళల సగటు ఆయుర్దాయం 72గా ఉంది. ఇక దేశంలో ఆధారపడుతున్న వృద్ధుల శాతం 20 శాతంగా నమోదైంది’’ అని ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక, భారతదేశ జనాభా గురించి అంచనాలను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరుగుతుందని అంచనా. ‘‘ఏపీలోనే కాదు దక్షిణాదిలోనే జనాభా తగ్గుతోంది. 1980 ప్రాంతంలో ఆయా రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్‌ పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇప్పుడు యువశక్తి తగ్గి ఆధారపడే వృద్ధుల సంఖ్య పెరుగుతోంది’’ అని విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని జనాభా పరిశోధనా కేంద్రం (పాపులేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌) డైరెక్టర్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి. మునిస్వామి తెలిపారు.
 
పార్లమెంటులో ప్రాతినిధ్యం
దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్ చెబుతోంది అదే. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖకు చెందిన 2020 నివేదిక ప్రకారం, 2011తో పోలిస్తే 2036 నాటికి దేశ జనాభా 31.1 కోట్లు పెరుగుతుంది. ఇందులో సుమారు 17 కోట్ల జనాభా బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్‌లలోనే ఉంటుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు (9శాతం). జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి..
 
‘‘సంతానోత్పత్తి తగ్గుదల ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. దాంతో ఆయా రాష్ట్రాల్లో లోక్ సభ సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. ఓ అంచనా ప్రకారం, 2026 నాటికి అవి 20కి తగ్గుతాయి. తెలంగాణలో 17 నుంచి 15 సీట్లకు తగ్గుతాయి. తమిళనాడులో 39 నుంచి 30, కేరళలో 28 నుంచి 26 కి, కర్ణాటకలో 20 నుంచి 14కి తగ్గే అవకాశం ఉంది’’ ప్రొఫెసర్ గోలి శ్రీనివాస్ తెలిపారు. పార్లమెంటులో ప్రాతినిధ్యం మాత్రమే కాదు కేంద్రం పంచే నిధులకు సంబంధించి కూడా ఆందోళనలున్నాయి. ఈ ఏడాది ఫ్రిబవరిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిల్లీలో నిరసన కూడా చేపట్టారు.
 
‘‘పన్నుల రూపంలో తాము కేంద్రానికి కట్టేదానికి కేంద్రం నుంచి తమకు తగ్గేదానికి పొంతనే లేదు’’ అనేది వారి వాదన. ‘‘కేంద్రం న్యాయబద్ధంగా పన్నుల్లో వాటా ఇవ్వకుంటే దక్షిణాది ప్రజలు ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతారు’’ అని కర్ణాటకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ అనడం కూడా వివాదమైంది. 15వ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 2020-21లో కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 10శాతం కంటే తక్కువ నిధులు వస్తుంటే అదే ఉత్తరప్రదేశ్‌కు 15శాతానికి పైగా వస్తున్నాయి. బిహార్‌ విషయంలో అది 30శాతం పైగా ఉంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ విషయంలో 10శాతం కంటే తక్కువగా ఉంది.
 
జనాభాను పెంచడం సులువేనా?
ఒకప్పుడు జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. పంచవర్ష ప్రణాళికల్లో లక్ష్యాలు పెట్టుకుని కుటుంబ నియంత్రణ అమలు చేశారు. ‘‘చిన్న కుటుంబం- చింతలేని కుటుంబం’’ అనే స్లోగన్ అప్పట్లో చాలా పాపులర్. కేంద్రం చేపట్టిన జనాభా నియంత్రణను ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాలు బాగా అమలు చేశాయి. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ఆ రాష్ట్రం ప్రకటించింది.
 
కానీ దక్షిణాది రాష్ట్రాల మాదిరిగా ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను అమలు చేయలేదు. దాంతో ఆ అంతరం నేటికీ కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు సంతానోత్పత్తిని పెంచడం అంత సులభం కాదు అని నిపుణులు అంటున్నారు. ‘‘ఆర్థికం, కెరియర్ వంటి కారణాల వల్ల నేడు చాలా మంది ఒకరిద్దరు పిల్లలు ఉంటే చాలనే పరిస్థితికి వచ్చారు. ఈ తీరును మార్చడం అంత సులభం కాదు’’ అని ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ అన్నారు. ‘‘ఉద్యోగాలు, స్వశక్తితో వ్యాపారాలు చేసుకునే మహిళలు పిల్లలను కని ఇంట్లోనే ఎక్కువకాలం ఉండిపోలేరు. చిన్న పిల్లల పెంపకంలో పురుషులు కూడా బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మహిళలు పిల్లలను కనేందుకు ముందుకు వస్తారు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
జీవన ప్రమాణాల మాటేమిటి?
జనాభా పెరుగుదల గురించి మాట్లాడేటప్పుడు జీవనప్రమాణాల గురించి కూడా మాట్లాడాలి అని ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అన్నారు. ‘‘ఉద్యోగ ఉపాధి అవకాశాలు, నాణ్యమైన విద్య అందించినప్పుడే జనాభా పెరిగినా ఇబ్బందులు తలెత్తవు. సంపన్నులు ఎంతమంది పిల్లలను కన్నా వారిని చక్కగా చూసుకునే సామర్థ్యం ఉంటుంది. కానీ రెక్కాడతే కానీ డొక్కాడని ఓ పేద జంట నలుగురు పిల్లలని కంటే పోషించడానికే చాలా ఇబ్బందులు పడాలి. ఇక ఆ పిల్లల జీవన, విద్యా ప్రమాణాల సంగతేంటి? వీటన్నింటి గురించి పాలకులు ఆలోచించాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం... మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రతిమ

ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో చెర్రీ సందడి...

రసవత్తరంగా బాలకృష్ణ - చంద్రబాబు "అన్‌స్టాపబుల్ షో"

క్వీన్ ఎలిజబెత్ II తరహాలో పెంపుడు జంతువు రైమ్ తో రామ్ చరణ్ మైనపు విగ్రహం

మట్కా సెకండ్ సింగిల్ తస్సాదియ్యా రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక్కసారి 4 టీ స్పూన్ల తులసి రసం తాగితే?

జీడిపప్పుకు అంత శక్తి వుందా?

ఫెర్టిలిటీ ఆవిష్కరణలపై ఫెర్టిజ్ఞాన్ సదస్సు కోసం తిరుపతిలో సమావేశమైన 130 మంది నిపుణులు

కాఫీలో నెయ్యి వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ఖర్జూరం పాలుని పవర్ బూస్టర్ అని ఎందుకు అంటారు?

తర్వాతి కథనం
Show comments