Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూపర్ సిక్స్‌ అమలు... ఏపీ ప్రజలకు దీపావళి కానుక.. ఏంటది?

chandrababu

ఠాగూర్

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపావళి కానుక ప్రకటించారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్‌ల వంటి కార్యక్రమాలను అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం... ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలు మొదలు పెట్టింది. ఇందులోభాగంగా ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 
 
ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏదాదికి ఉచితంగా ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సమీక్ష జరిపారు.
 
మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.... దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీపం పథకంతో ఈ దీపావళి పండుగ ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని అన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా... పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. 
 
ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్దిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుండి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఈనెల 31వ తేదీ నుండి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్దిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమచేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
 
గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 లు కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్‌కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం ప్రతి సిలిండర్ ధర రూ.851లుగా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడుతుందని, అదే ఐదేళ్ళకు కలిపి రూ.13,423 కోట్ల భారం పడుతుందని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బులంద్‍‌షర్ జిల్లాలో విషాదం... సిలిండర్ పేలి ఐదుగురి దుర్మరణం