అమరావతి కోసం తాను ఎంతో కష్టపడి సింగపూర్ కంపెనీలను తీసుకొస్తే వాటిని వెళ్లగొట్టారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయనకు కొన్ని చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి. సీఆర్డీయే పరిధిలో గతంలో రాజధాని కోసం శంకుస్థాపన చేసిన ప్రాంతంతో పాటుగా నిర్మాణంలో ఉన్న పలు భవనాలను ఆయన పరిశీలించారు.
తొలుత చంద్రబాబు తన నివాసానికి సమీపంలో, గతంలో ప్రభుత్వం తొలగించిన ప్రజావేదికను పరిశీలించారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన గ్రీవెన్స్ భవనాన్ని కూల్చేసి, ఆ సామగ్రిని కూడా ఇంకా తొలగించలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వెంకటాయపాలెం చేరుకోగానే చంద్రబాబు కాన్వాయ్‌కి పలువురు అడ్డుతగిలారు. నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై ఒకరు చెప్పులు విసరగా, మరొకరు రాయి కూడా విసరడంతో బస్సు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.
ఆ సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఇరువర్గాలను వారించారు. అక్కడి నుంచి ఉద్దండరాయుని పాలెం చేరుకున్న చంద్రబాబుకి స్థానికులు స్వాగతం పలికారు. అమరావతి నగర నిర్మాణం కోసం 2015లో శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు పరిశీలించారు. నీరు-మట్టి పేరుతో గతంలో సేకరించి, నిల్వ ఉంచిన చోట చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.
అమరావతి డిజైన్లను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యేల క్వార్టర్స్ నిర్మాణాలను సందర్శించారు. అనంతరం కీలకమైన 5 టవర్ల నిర్మాణాలను చూస్తూ నిర్మాణంలో ఉన్న అధికారుల నివాస భవనాలను ఆయన సందర్శించారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట టీడీపీ సీనియర్ నేతలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మాజీ మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావులతో పాటు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, వాసుపల్లి గణేష్ సహా పలువురు నేతలున్నారు.
తన పర్యటన ముగింపు దశలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించిన ఆయన అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సుడు ప్రాజెక్టుగా తాను చేపట్టినట్టు వివరించారు. ఆయన మాట్లాడుతూ... ''నా కష్టం వల్ల వచ్చినవి ప్రైవేటు కంపెనీలు కాదు.. అవన్నీ సింగపూర్ ప్రభుత్వ కంపెనీలు. అయినా వాటిని కూడా పోగొట్టారు. బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఎక్కడికో వెళ్తుందని ఊహించాం. కానీ మంత్రులు కొడాలి నాని, బొత్స సత్యన్నారాయణ వంటి వారి మాటలు వింటే బాధేస్తుంది. స్మశానంలో కూర్చుని క్యాబినెట్ నడుపుతున్నారా? స్మశానంలో అసెంబ్లీలో కూర్చుని చట్టాలు చేస్తున్నారా? స్మశానం నుంచే హైకోర్ట్ ధర్మం చెబుతోందా?'' అని ప్రశ్నించారు.
''ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలి. రైతుల త్యాగంతో, నా తెలివితేటలతో వచ్చిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది. హ్యాపీనెస్ట్ కడితే ప్రపంచంలో ఉన్న వారంతా డబ్బులు పెడుతున్నారు. అదనపు ఆదాయం వచ్చింది. ఈ భూమిని డీమానిటైజ్ చేసుకుంటే మంచి డబ్బులు వస్తాయి. దాంతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ సంపద సృష్టిస్తుంది. లక్ష నుంచి రెండు లక్షల కోట్లు ఆదాయం వస్తుంది. అది చంద్రబాబు సొంతం కాదు. ప్రభుత్వానికి వస్తుంది. దానిని సృష్టించింది తెలుగుదేశం పార్టీ.
ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. హైదరాబాద్‌లో కూడా ఇలాంటి అభ్యంతరాలు వచ్చినా, ఇండియాలోనే బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దాం. ప్రజల ఆస్తులను ఆదిలోనే చంపేస్తారా? పిల్లల భవిష్యత్తు, ఐదు కోట్ల ప్రజల ఆశలను చంపేసే ప్రయత్నంతో దుష్ట ఆలోచన చేస్తున్నారు..." అంటూ ఆయన ఆరోపించారు.
''అన్ని పార్టీలతో సమావేశం జరుపుతాం...''
ప్రస్తుత పరిస్థితులపై , అమరావతి ప్రాజెక్ట్‌పై చర్చించడానికి వచ్చే వారం రాష్ట్రంలోని అన్ని పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబు తెలిపారు. ''నాపైనే చెప్పులు, రాళ్లు విసురుతారా? పైగా వారి నిరసనలకు అనుమతి ఇచ్చామని పోలీసులు చెబుతారా? పోలీసు లాఠీ మా బస్సు మీదకు వచ్చింది. దానికి డీజీపీ సమాధానం చెప్పాలి. ఇక్కడ పులివెందుల పంచాయితీ జరగనివ్వను. ఐదు కోట్ల ప్రజలు ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతున్నాను. సంపద సృష్టించడానికి... ఈ ప్రాజెక్ట్ వల్ల సంపద వస్తుందా లేదా అనేది ప్రజలు ఆలోచించాలి'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
''70 శాతం లోకల్ రిజర్వేషన్లు మంచిదే. కానీ ఎవరూ పెట్టుబడులు పెట్టడానికి రావడం లేదు. ఉన్న కంపెనీలు తరలిపోతుంటే యువత భవిత ఏం కావాలి? నాది వ్యక్తిగత పోరాటం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే చేస్తున్నాను. అమరావతి అభివృద్ధి చేస్తూనే కర్నూలు, నెల్లూరు, విశాఖ, రాజమండ్రి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం. కానీ ఇది చేయకుండా అవన్నీ చేస్తామని అంటే అది ఏపీ భవిష్యత్తు నాశనం చేయడమే అవుతుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలతో వచ్చే వారం సమావేశం నిర్వహిస్తాం. మీడియా పెద్దలతో సమావేశం జరుపుతాం. మరింత మెరుగ్గా చేస్తామంటే సంతోషిస్తాం గానీ, నిర్వీర్యం చేస్తామంటే సహించబోం" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు పర్యటన మీద పలువురు వైసీపీ నేతలు మండిపడ్డారు. ఆయనకు పర్యటించే హక్కు లేదని మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "అమరావతి రైతులకు చంద్రబాబు అన్యాయం చేయడంతో అక్కడి రైతాంగం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. మేము చంద్రబాబు మీద దాడి చేశామనడం అర్థరహితం. చంద్రబాబు మీద దాడి చేయాలనుకుంటే... ఆయన కడప వెళ్లారు, అంతకు ముందు అన్ని జిల్లాల్లోనూ తిరుగుతున్నారు, అక్కడ జరగదా? మా ప్రాంతానికి రావద్దని అమరావతి జనం చెబుతుంటే.. నేను వెళ్తాను అంటే ఎవరో ఒకరు రాయి విసురుతారు. చంద్రబాబు పెద్ద గజినీలా మాట్లాడుతున్నారు" అని వ్యాఖ్యానించారు.