నెల్లూరులో ట్యాంక్‌బండ్... రూ.230 కోట్ల అభివృద్ధి పనులు జాతికి అంకితం
పర్యాటక అభివృద్ధికి బాటలు వేసే ఏ ఒక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేజారనివ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటంలోనూ అదే వేగాన్ని ప్రదర్శిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పర్య
పర్యాటక అభివృద్ధికి బాటలు వేసే ఏ ఒక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చేజారనివ్వటం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవటంలోనూ అదే వేగాన్ని ప్రదర్శిస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగ పటిష్టత కోసం నిర్ధేశించిన స్వదేశీ దర్శన్ పథకాన్ని ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో వినియోగించుకున్న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఆ ఫలితాలను ఇప్పుడు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానుంది.
కోస్తా తీర పర్యాటక అభివృద్దిలో భాగంగా అటు నెల్లూరు, ఇటు కోనసీమ ప్రాంతాలలో జరిగిన పర్యాటక అభివృద్ది కార్యక్రమాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలవనున్నాయి. ఇలా దాదాపు రూ.130 కోట్లతో రూపుదిద్దుకున్న పర్యాటక ప్రాజెక్టులను, రూ.100 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన జాతీయ పాకశాస్త్ర సంస్ధ నూతన భవన సముదాయాన్ని సోమవారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడు స్వయంగా జాతికి అంకితం చేయనున్నారు.
తిరుపతి కేంద్రంగా జరిగే కార్యక్రమంలో ఏకకాలంలో వీటి ప్రారంభోత్సవాలు పూర్తి కానున్నాయి. డిజిటల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమాల ద్వారా కోట్లాది రూపాయల వ్యయంతో జరిగిన పర్యాటక అభివృద్దిని ఇకపై అందరికీ అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయిడు బాధ్యతలు స్వీకరించిన తదుపరి పర్యాటక రంగానికి ప్రాధన్యత పెరగగా, ఆయన నిరంతర సమీక్షలతో ఈ శాఖ తీరుతెన్నులను పరిశీలిస్తూ వచ్చారు. ఇదే దిశలో అధికార గణం కూడా తమదైన పాత్రను పోషిస్తూ అందివచ్చే అవకాశాలను చేజారనివ్వకుండా పనిచేస్తూ వచ్చారు. పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లాలు ఈ క్రమంలో వేగంగా అడుగులు వేసి, కేంద్రం అడిగిన ప్రతి సమాచారాన్ని ఎప్పటి కప్పుడు అందిస్తూ వచ్చారు. ఫలితంగానే రూ.130 కోట్లను ఆంధ్రప్రదేశ్ సాధించగలిగింది.
ఈ నేపధ్యంలో శుక్లా మాట్లాడుతూ కేంద్ర పర్యాటక శాఖతో సత్సంబంధాలను నెరపుతూ రాష్ట్రం కోసం నిధులు దక్కించుకోగలిగామన్నారు. తమ కార్యదర్శి మీనా సైతం స్వయంగా పలుమార్లు హస్తిన సందర్శించి అధికారులతో చర్చిస్తూ రావటం వల్ల మరే రాష్ట్రానికి దక్కని రీతిలో ఆంధ్రప్రదేశ్ నిధులు దక్కించుకోగలిగిందన్నారు.
కోస్తా తీర ప్రాంత పర్యాటక అభివృద్దిలో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రూ.60.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టటం జరిగింది. దేశంలోనే రెండో అతిపెద్ద సరస్సుగా ఉన్న పులికాట్ అభివృద్దికి రూ.22.76 కోట్లు, ఉప్పలమడుగు జలపాతం కోసం రూ.3.5 కోట్లు వ్యయం చేసారు. ఇక్కడ పర్యాటకులు అనుభూతికి లోనయ్యేలా పలు కార్యక్రమాలు చేపట్టారు.
నేలపట్టు పక్షుల కేంద్రాన్ని సైతం ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతూ రూ.6.32 కోట్లు ఖర్చు చేసారు. నెల్లూరు ట్యాంక్ బండ్‌ను సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ ఇక్కడ రూ.42.6 కోట్లను వ్యయం చేసింది. మైపాడు బీచ్ కోసం రూ.8.79 కోట్లు, రామతీర్ధం బీచ్ కోసం రూ.2.99 కోట్లు, ఇసకపల్లి బీచ్ కోసం అరకోటి ఖర్చు చేసి పర్యాటకులకు అవసరమైన మౌళిక సదుపాయాలను పూర్తి చేసారు.
కాకినాడ-హోప్ ఐలాండ్-కోనసీమ సర్య్కూట్ అభివృద్ది కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ పెద్ద కసరత్తే చేసింది. ఎకో టూరిజం సర్య్కూట్‌గా దీని అభివృద్ది కోసం రూ.69.83 కోట్లు వ్యయం చేయగలగటం చిన్న విషయం కాదు. ఈ పనుల ఫలితంగా ఇక్కడ పెద్ద ఎత్తున పర్యాటక ఆకర్షణలు సమకూరాయి. కాకినాడ బీచ్ ముఖద్వారాన్ని విశేషరీతిగా అభివృద్ది చేసేందుకు రూ.45.66 కోట్లు వ్యయం చేసారు.
నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రైవేటు ఏజెన్సీలు ఏర్పాటు చేసారు. హోప్ ఐలండ్ అభివృద్ది కోసం రూ. 80 లక్షలు, కోరింగ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం కోసం రూ.8.46 కోట్లు పాసర్లపూడిలో రూ.2.68 కోట్లు, ఆదుర్రులో రూ.5 కోట్లు, ఎస్ యానమ్‌లో అరకోటి రూపాయలు, కోటి పల్లిలో రూ.2.14 ఖర్చు చేయగా, ఈ అభివృద్ది కార్యక్రమాలనే ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు.