నేనింతవరకు ఫుల్ యాక్షన్ సినిమా చేయలేదని హీరో విశాల్ సినిమా విడుదలకు ముందు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆ చిత్రం చిత్రీకరణలో బైక్ యాక్సిడెంట్‌కూడా జరిగింది. పైనుంచి చెస్ట్‌మీద పడుతున్నప్పుడు ఇక నేను.. అయిపోయానని అనుకున్నానని కూడా తెలియజేశాడు.
అంత రిస్క్ ఎందుకు సినిమా తీయాల్సివచ్చింది? అనే అనుమానం ప్రేక్షకుడికి కలుగుతుంది. అది తెలియాలంటే తప్పకుండా 'యాక్షన్' సినిమా చూడాల్సిందే. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అటు తమిళంతో పాటు, ఇటు తెలుగులోనూ ఒకేరోజు విడుదలైంది. అది ఎలా వుందో చూద్దాం.
కథ :
విశాల్ (సుభాష్) ఆర్మీ కల్నల్. తమన్నాకూడా ఆర్మీ ఆఫీసరే. ఇద్దరూ పై అధికారి ఆజ్ఞమేరకు ఇస్తాంబుల్‌లో ఓ సీక్రెట్ ఆపరేషన్‌ను సక్సెస్ చేస్తారు. సుభాష్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా. పెద్ద కుటుంబం. తన బంధువు మీరా (ఐశ్వర్య లక్ష్మీ) విశాల్‌ని ప్రేమిస్తోంది. విశాల్ కూడా ఆమెను ప్రేమిస్తాడు.
అనంతరం సి.ఎం. తన తర్వాత వారసుడిగా పెద్ద కొడుకు రాంకీని పెద్ద బహిరంగ సభలో ప్రకటిస్తాడు. ఆ సభకు జాతీయనాయకుడు కాబోయే ప్రధానమంత్రి కూడా వస్తాడు. కానీ అక్కడ జరిగిన బాంబ్ విధ్వంసంలో అతను చనిపోతాడు. కుటుంబంలోకూడా కొందరిని కోల్పోతాడు సుభాష్.
ఈ బ్లాస్ట్‌కు అన్నయ్య రాంకీ అనే ప్రతిపక్షాలు, మీడియా కోడైకూస్తోంది. అందుకు బలమైన సాక్షం కూడా వుంటుంది. దాన్ని రెస్టిఫైచేయడానికి మీడియా సమావేశం ఏర్పాటుచేసిన ముందుగానే ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలనుబట్టి అది హత్యగా తోస్తుంది.
ఆ తర్వాత అసలు సూత్రదారులు ఎవరు ఇందులో వున్నారనే కోణంలో సుభాష్ పై అధికారి పర్మిషన్‌తో పాకిస్తాన్ వెళతాడు. అక్కడ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌ను ఎలా ఇండియాకు రప్పించగలిగాడు? బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరు వున్నారు? అనేది వెండితెరపై చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా ఆరంభంలో కాస్త నత్తనడకగా సాగుతుంది. ఏం జరుగుతుందో అర్థంకాదు. 20 నిముషాల తర్వాత ఒక్కసారిగా కథలో మలుపులు ఆసక్తిరేకిస్తాయి. ఆ తర్వాత జరిగే యాక్షన్ సీన్స్ అన్నీ జేమ్స్‌బాండ్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. విశాల్ తన యాక్షన్‌తో ఈ చిత్రంలోనే ఉత్తమమైన నటనను కనబర్చారు.
ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ యాక్షన్‌తో, నటనతో సినిమాకే హైలెట్‌గా నిలిచారు. తమన్నా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది.
ఇంటర్‌వెల్ ముందు సాగే అపార్ట్‌మెంట్ ఫైట్ చిత్రానికి హైలైట్‌గా నిలిచి టెంపో మెయింట్‌చేయడంతో ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్‌అయిపోతాడు. సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్‌కూడా ఆకట్టుకున్నాయి.
చిత్ర కథ ప్రకారం ఇస్తాంబుల్, కరాచి, పాకిస్తాన్‌లలో షూటింగ్ జరిగిన తీరు, అక్కడ కన్పించే దృశ్యాలు విజువల్ ట్రీట్‌లా వున్నాయి. దర్శకుడు చాలామటుకు భారీ యాక్షన్స్ సీన్స్‌తో సినిమాని నడిపాడు. కొన్ని ఛేజింగ్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
కథగా చెప్పాలంటే ఇది పేద్ద కథ. సి.ఎం. స్థాయి కుటుంబంలో జరిగే సంఘటనలు, అరాచకాలు అనేవి దర్శకుడు కళ్ళకుకట్టినట్లు చూపించాడు. అవి సామాన్యుడికి కూడా కనెక్ట్ అయ్యేలా చూపించడం ప్రత్యేకత. కొన్నిచోట్ల సీక్వెన్స్‌స్ లాజిక్ కన్పించదు. కానీ మొత్తంగా చూస్తే ఆసక్తిరేకెత్తించే చిత్రంగా తీయడంలో దర్శక నిర్మాతలు సఫలం అయ్యారు.
ఇలాంటి సినిమాకు కెమెరా పనితం కీలకం. డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా ఆయన చాలా అందంగా చిత్రీకరించారు.
శ్రీకాంత్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో ఇంట్రస్టింగ్ సాగని సీన్స్‌ను సాధ్యమైనంత వరకు ట్రిమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. ఇక సంగీత దర్శకుడు హిప్‌హాప్ తమీజా సమకూర్చిన పాటలు వినడానికి కంటే కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. నిర్మాణ విలువులు చాల బాగున్నాయి.
సుందర్ సి. కామెడీ, హార్రర్ చిత్రాలేకాదు యాక్షన్ చిత్రం కూడా తీయగలడు ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఓ మంచి యాక్షన్ ట్రీట్‌ను చూపిస్తుంది. విశాల్ ఇందులో పడ్డ కష్టం కన్పిస్తుంది.