మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ పెద్ద మోసగాడంటూ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయులు ఆరోపిస్తున్నారు. ఉయ్యాలవాడ జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, అనుష్క, తమన్నా వంటి హీరోయిన్లు, జగపతిబాబు, విజయ్ సేతుపతి వంటి అనేక స్టార్లు నటిస్తున్నారు.
అయితే, ఈ చిత్ర కథతో సినిమా నిర్మించాలని భావించినపుడే ఉయ్యాలవాడ వంశీయుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీంతో తగిన పరిహారం ఇస్తానని సైరా నరసింహా రెడ్డి చిత్ర నిర్మాతగా రామ్ చరణ్ హామీ ఇచ్చారు. కానీ, రెండు రోజుల క్రితం చెర్రీ మేనేజర్ ఉయ్యాలవాడ వంశీయులకు ఫోన్ చేసి పరిహారం ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఉయ్యాలవాడ వారసులు హైదరాబాద్‌లో కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయం ఎదుట మెరుపు ధర్నా చేశారు.
దీనిపై వారు స్పందిస్తూ, 'సైరా కథను తీసుకుని మాకు న్యాయం చేస్తామని రామ్‌చరణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన్ని కలవడానికి కూడా అవకాశం కల్పించడం లేదు' అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశీయులు ఆరోపించారు. ఆదివారం హీరో రామ్‌చరణ్ కార్యాలయం ముందు వారు ఆందోళన చేశారు. 'ఇటీవల సైరా షూటింగ్ అగ్నిప్రమాదంలో కాలిపోయిన వస్తువులన్నీ మావే. అప్పుడు రామ్‌చరణ్‌ని కలిశాం. మా బాగోగులు అడిగి కనుక్కుని తప్పకుండా న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లని కలవడానికి కుదరడం లేదు. మధ్యలో వాళ్లు అడ్డురాకుంటే, చరణ్, చిరంజీవి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పారు.