హీరోయిన్ నిధి అగర్వాల్‌ను చంపుతామంటూ ఓ అగంతకుడు బెదిరిస్తున్నాడు. దీంతో ఆమె భయపడి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హీరోయిన్ హనిరోజ్ కూడా సోషల్ మీడియా ద్వారా తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. తాజాగా నిధి అగర్వాల్ కూడా పోలీసులను ఆశ్రయించారు.
సోషల్ మీడియా ద్వారా తనను ఇబ్బందికి గురిచేస్తూ, వేధిస్తున్న వ్యక్తిపై సైబర్ క్రైమ్ విభాగంలో నిధి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తి తనను చంపేస్తానంటూ సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా లక్ష్యంగా చేసుకుని, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు నిధి అగర్వాల్ ప్రస్తావించారు.
ఈ బెదిరింపుల వల్ల తాను మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నానని, ఆ అగంతకుడుని గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని హీరోయిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఆమె ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ వింగ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇద్దరు అగ్రహీరోల చిత్రాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాగా, మరొకరు ప్రభాస్. పవన్ హీరోగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు' మూవీలో నిధి అగర్వాల్ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే, ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'రాజాసాబ్' మూవీలో నటించారు. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా మూవీలు కావడం గమనార్హం. దీంతో నిధి అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకున్నారు.