తెలుగులో హిట్ కాంబినేషన్‌గా పేరుగాంచిన విక్టరీ వెంకటేష్, మీనా జంట మరోమారు వెండితెరపై సందడి చేయనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన దృశ్యం-1కు సీక్వెల్‌గా దృశ్యం-2 రానుంది.
మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలలో జీతూ జోసెఫ్ దృశ్యం 2ను తెరకెక్కించారు. ఈ విభిన్నమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని తెలుగులోను రీమేక్ చేస్తుండగా, మలయాళ మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు సీక్వెల్‌కు నిర్దేశక బాధ్యతల్ని తీసుకున్నారు. డి.సురేష్‌బాబు, ఆంటోని పెరుంబపూర్, రాజ్‌కుమార్ సేతుపతి నిర్మిస్తున్నారు.
సోమవారం నుండి దృశ్యం 2 తెలుగు వర్షెన్ మొదలు కాగా, మీనా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. పూర్ణ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
జీతూ జోసెఫ్ తెలుగు దృశ్యం 2తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానుండగా, ఇందులో నదియా, నరేష్, ఏస్తర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ సతీష్ కురూఫ్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు.