సాంకేతికత- ఛాయాగ్రహణం: రత్నవేలు, సంగీతం: డి.ఇమాన్, నిర్మాణం: సన్ పిక్చర్స్, రచన-దర్శకత్వం: పాండిరాజ్
ఈటి (ఎవరికీ తలవంచడు) చిత్రం ప్రతి మహిళలకు సంబంధించిన కథ. మన చుట్టూ జరుగుతున్న కథే. మహిళలకు అంకితమిస్తున్నట్లు చిత్ర విడుదలముందు సూర్య ప్రకటించారు. కుటుంబకథా చిత్రాలు తీసే పాండిరాజ్ కూడా తొలిసారి ఇటువంటి కథను చేశానని అన్నారు. మరి ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
ఉత్తర పురం, దక్షణి పురం అనే రెండు ఊర్లు. దక్షణిపురంకు కోడళ్ళుగా వెళ్ళినవారితో దేవుని ఉత్సవాలు చేస్తారు. ఉత్తరపురంలో మహిళ పుట్టినా, పెండ్లి చేసుకున్నా ఉత్సవమే. అలాంటి ఉత్తరపురంలో ఓ పెండ్లయిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అందుకు కారణం పెండ్లి చేసుకున్న దక్షణిపురం అబ్బాయి వేధింపులే. ఆ ఉత్తరపురంలో న్యాయవాది కృష్ణమోహన్ (సూర్య). తన దగ్గరకు వచ్చిన కేసుల్లో ఆడవారిని న్యాయంచేస్తుంటాడు. ఇది సహించని దక్షణిపురంలోని వ్యాపారవేత్త అయిన కామేష్ (వినయ్ రాయ్).. కృష్ణమోహన్ ఊరికి చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసి వారి చావుకు కారణం అవుతాడు. ఈ మిస్టరీని ఛేదించేక్రమంలో కృష్ణమోహన్ భార్యను మానసికంగా హింసిస్తారు. అప్పుడు సూర్య తన భార్యకు ఎటువంటి ధైర్యాన్ని నూరిపోశాడు.? లాయర్‌గా వ్యాపారవేత్తను ఎదుర్కొన్నాడా? లేదా? అన్నది మిగిలిన సినిమా.
విశ్లేషణ:
ఈ సినిమా చూస్తే, వకీల్‌సాబ్! సినిమాకు కొనసాగింపుగా అనిపిస్తుంది. అందులో పవన్ కళ్యాణ్ లాయర్‌గా తనకు సంబంధంలేదని ముగ్గురు మహిళలపై పడ్డ అపవాదును కోర్టులో వాదించి గెలుస్తాడు. ఇందులో అలాంటి సంఘటనలే జరిగినా లాయర్ అయిన హీరో ఓడిపోతాడు. ఆ తర్వాత తను జైల్లోవుండి బయటకు వచ్చి ఏం చేశాడన్నది కథ. రెండింటిలోనూ పోలిస్తే, ఇ.టి.లో హీరో సొంత చెల్లెలు 10 ఏళ్ళవయస్సులోనే కామాంధుల దాష్టీకానికి బలైపోతుంది. ఆ తర్వాత తన ఊరిలోని కాలేజీ చదువుతున్న అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోతూ బలైపోతున్నారు. ఈ పాయింట్‌ను హైలైట్ చేశాడు దర్శకుడు.
- పోలీస్ స్టేషన్‌లో తన కూతురు తప్పిపోయిందంటే ఏదో అబాండం వేసి కేసు పెట్టకుండా ఎస్.ఐ. చేసే విధానం ఇప్పటికీ జరుగుతున్న ఘటనలే. ఇలా దేశంలో వర్తమానంలో జరుగుతున్న చాలా సంఘనలను మనకు గుర్తుకు వస్తాయి.
-సినిమా కాబట్టి సినిమాటిక్‌గా హరో ముగింపు ఇస్తాడు. చట్టాలు, ప్రభుత్వాలు చేయలేని పనిని ఎవరికీ తలవొంచని సూర్య ఎలా తీర్పు ఇచ్చాడనేది ముగింపు. ఇది చాలా సినిమాల్లోనూ ఉన్న ముగింపే అయినా తీసేవిధానం బాగుంది.
- ఇక మిగిలిన పాత్రలన్నీ వారి పాత్ర మేరకు నటించాయి. హీరో తల్లిదండ్రులుగా సత్యరాజ్,శరణ్య నటించారు. విలన్‌గా వినయ్ రాయ్ నటించాడు.
- సంగీతపరంగా బాణీలు పర్వాలేదు అనిపించాయి. కెమెరా పనితనం బాగుంది. సూర్య డబ్బింగ్ బాగా చెప్పుకున్నాడు.
- ఇంతకుముందు సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా.. జై భీమ్ చిత్రాలతో కథ రీత్యా తన పరిధిని చాటాడు. కానీ ఇ.టి. మాత్రం పూర్తి కమర్షియల్ చిత్రంగా చూపించాడు. అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి ఈ చిత్రానికి ఎంచుకున్న నేపథ్యం కాస్త భిన్నంగానే అనిపించినా.. మిగతా వ్యవహారమంతా రొటీన్‌గా మారిపోయాయి.
- . దర్శకుడు పాండిరాజ్ మహిళా సమస్యల్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. తీసుకున్న పాయింట్ బాగున్నా.. దానికి సరితూగే కథను.. కథనాన్ని తీర్చిదిద్దుకోలేకపోయాడు. అతడి కథనం కాస్త గందరగోళంగా సాగతీతగా అనిపిస్తుంది. రచయితగానే కాక దర్శకుడిగా పాండిరాజ్ మెప్పించలేకపోయాడు. తల్లిదండ్రులు కొడుకుల్ని ఎలా పెంచాలనేది సూర్య చెప్పే డైలాగ్ సినిమాకు హైలైట్. ఈ సినిమాను ఒక్కసారి చూడొచ్చు.