డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీలో ఆసుపత్రి చిరంజీవి కట్టిస్తానని ప్రకటించడంతో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్రాస్ నుంచి చిత్రపరిశ్రమ నగరానికి వచ్చే సమయంలో పరిశ్రమలో 24 క్రాఫ్ట్‌ల్లో పనిచేస్తున్న వారి కోసం ఎంతో శ్రమించి అప్పటి ముఖ్యమంత్రు లతో మాట్లాడిన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పేరుతో చిత్రపురి కాలనీ ఏర్పాటు చేస్తే పరిశ్రమలోని కొంతమంది పెద్దలు 'ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ' అని చెప్పరని కేవలం 'చిత్రపురి కాలనీ' అనే పిలుస్తారని ప్రముఖ నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆసుపత్రి నెలకొల్పుతామని చిత్రపురి కమిటీకి రెండేళ్ల క్రితం తాము నివేదిక పంపి, ఆసుపత్రి ఏర్పాటు, అనుమతుల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా ఇప్పుడు చిత్రపరిశ్రమలోని ఓ ప్రముఖ వ్యక్తి వచ్చి తన తండ్రి పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని ప్రకటించడం బాధాకరమని వారు వాపోయారు. సోమవారంనాడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
మేం ఆసుపత్రి ఏర్పాటుచేసి స్వంత ఖర్చుతో సేవలు చేస్తామంటే డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి చిత్రపురి కాలనీకి చెందిన సొసైటీ కమిటీ అంగీకరించారనీ, కానీ షడెన్‌గా మాట మార్చారని ఆవేదన చెందారు. ఈ చర్య వల్ల చిత్రపురి కాలనీలో డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి పేరును లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభాకర్ రెడ్డి కుమార్తెలు శైలజారెడ్డి, విశాలాక్షి, రాధారెడ్డి, లక్ష్మిరెడ్డి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
'పేద కళాకారుల కోసం ఆసుపత్రి నిర్మించడాన్ని మేము వ్యతిరేకిండంలేదని, కాని ఆస్పత్రి విషయమై గతంలో ప్రతిపాదించిన మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేరొక వ్యక్తి పేరుతో ఆస్పత్రి నిర్మాణం చేపడతామనడం సరికాదు. మాకు అవకాశం ఇచ్చి స్థలం కేటాయిస్తే సంవత్సరంలోపు ఆసుపత్రి నిర్మించి పేద కళాకారులకు అందుబాటులోకి తెస్తాం. ఇప్పటికే చిత్రపురి కాలనీలో ఉన్న పాఠశాలను ప్రైవేట్‌కు అప్పగించారని, ఇప్పుడు ఆసుపత్రి నిర్మించి దాన్ని కూడా ప్రైవేట్‌కు అప్పగించరని గ్యారంటీ ఏమిట'ని ప్రశ్నించారు.