గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తమిళ దర్శకుడు విజయ్ తెరదించారు. తాను, తన భార్య, నటి అమలాపాల్ విడిపోతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరు 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలాపాల్ సినిమాల్లో నటించే విషయంపై వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో వీరిద్దరి అంశం గత కొంతకాలంగా మీడియాలో చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ దీనిపై స్పందించారు. కొంతకాలంగా తనకు, అమలాపాల్‌కు సంబంధించి పలు వార్తలు వస్తున్నాయని, తాను, అమలాపాల్ విడిపోతున్నామన్న విషయం నిజమేనని ప్రకటించారు. విడిపోవడానికి సంబంధించిన వార్తల్లో వచ్చిన కారణాల్లో ఏమాత్రం నిజం లేదని, తాము విడిపోతున్నందుకు కారణమేమిటో తనకు మాత్రమే తెలుసునన్నారు.
తన స్నేహితులు, కొందరు మీడియా మిత్రులు కారణం చెప్పమని అడిగినా తన వ్యక్తిగత విషయాన్ని పంచుకోవడం ఇష్టం లేక చెప్పలేదన్నారు. మహిళలపై, సమాజంపై గౌరవం ఉన్న వ్యక్తినని, అందువల్లే తాను దర్శకత్వం వహించిన తొమ్మిది సినిమాల్లోనూ వారి ఆత్మగౌరవం ప్రతిబింభించేలా స్త్రీల పాత్రలను చిత్రీకరించానన్నారు. పెళ్లి తర్వాత కూడా నటించాలని అమలాపాల్ కోరడంతో సంతోషంగా సరేనన్నానని పేర్కొన్నారు.
కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నందువల్లే తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ సత్యదూరమేనన్నారు. తామిద్దరం విడిపోతామని తాను కలలో కూడా వూహించలేదని, కానీ నమ్మకం, నిజాయితీ లేనప్పుడు కూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడంలో అర్థం లేదన్నారు. అందువల్లే తీవ్రమైన ఆవేదనతో విడిపోతున్నానని, వాస్తవాలు తెలియకుండా కొన్ని పత్రికలు రాసిన వార్తలతో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యా'నని చెప్పారు.