యాద్రాద్రి ఉద్ఘాటన తర్వాత తొలిసారిగా కురిసిన భారీ వర్షంతో యాదాద్రి క్షేత్రం అతలాకుతలమైంది. బుధవారం నుంచి కురిసిన భారీవర్షంతో పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.
ఘాట్‌రోడ్ల వద్ద మట్టి కుంగింది. కొండపైన ఆలయం, క్యూకాంప్లెక్స్, పరిసర ప్రాంతాల్లో నీరు చేరింది. దీనితో భక్తులు ఇబ్బందిపడ్డారు. ఇంజనీరింగ్ లోపాలు, నాసిరకం పనుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
కొత్తగా నిర్మించిన మూడో ఘాట్‌రోడ్డు ప్రారంభంలో వాననీటి ధాటికి కుంగిపోయి పెద్ద గొయ్యి పడింది. దీనితో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. రెండోఘాట్ రోడ్డుకు అనుబంధంగా వీఐపీల కోసం నిర్మించిన ఈ ఘాట్‌రోడ్డును ఆలయ ఉద్ఘాటనకు కొద్దిరోజుల ముందే ప్రారంభించడం గమనార్హం.
ఇక వాననీటి ధాటికి మట్టికొట్టుకు వచ్చి మొదటి ఘాట్‌రోడ్డు బురద మయంగా మారింది. ప్రధానాలయంలో పంచతల రాజగోపురం నుంచి ధ్వజ స్తంభం వరకు వాన నీరు చేరింది.
ఇందుకోసం గంటకుపైగా దర్శనాలు నిలిపివేశారు. అష్టభుజి మండపాలు, ప్రాకార మండపాలు, లిఫ్ట్ మార్గంలో పలుచోట్ల వాన నీరు లీకైంది. కొండపై బస్టాండు పక్కన క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల గదుల్లో నీళ్లు నిలిచాయి. లడ్డూలు తడిసిపోయినట్టు సిబ్బంది పేర్కొన్నారు.
భక్తులు ఇబ్బందిపడుతూనే దర్శనాలకు వెళ్లారు. క్యూకాంప్లెక్స్ పక్కన కార్యాలయంలో ఉన్న సామగ్రి, కంప్యూటర్‌లు, స్టోరేజీ రూమ్ జలమయం అయ్యాయి. ప్రధానాలయం బయట వాన నీరు నిండి చిన్నపాటి చెరువును తలపించింది.
భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్లు, ఇతర పనులను వెంటనే పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు.