జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయలో తనపై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రజా యాత్రలో భాగంగా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన సమయలో తనపై ఘాటైన విమర్శలు చేయడమే కాకుండా, మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి అంటూ పవన్‌పై ఘాటైన విమర్శలు చేసిన నేతల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ (వి.హనుమంతరావు) ఒకరు. అలాగే, పవన్ కల్యాణ్ పార్టీ ‘జనసేన’ కాదని, ‘భజనసేన’ అని ఆయన ఘాటుగా విమర్శించారు. కానీ, ఇపుడు అదే హనుమంతరావును సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజా యాత్రలో ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశమైంది.
బుధవారం ఖమ్మం పర్యటనలో ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)ని తెలంగాణ సీఎం అభ్యర్థిగా కనుక ప్రకటిస్తే, ఆ పార్టీకి తాను మద్దతిస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా చేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి ప్రచారం చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరిపైనా తనకు గౌరవం ఉందని, అలాగే, వీహెచ్ పైనా ఉందని, ఎవరిపైనా ద్వేషం లేదని స్పష్టం చేశారు.
'వీహెచ్ తో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. వీహెచ్.. మీరు నాతో రండి. ఇంటింటికి తిరుగుదాం.. ప్రజాసమస్యలను తెలుసుకుందాం' అని పవన్ అన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి, ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పవన్ కోరారు.