తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న అభ్యర్థుల పూర్వాపరాల పరిశీలన, వైద్య పరీక్షల నిర్వహణను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్లకు, ఎస్పీలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) సూచన చేసింది. న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే శారీరక సామర్థ్య, రాత పరీక్షల్లో అర్హత సాధించడం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్య పరీక్షలను నిర్వహించి శిక్షణకు పంపించేందుకు మండలి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే తుది ఎంపిక సరిగా లేదని పలువురు అభ్యర్థులు కొద్దిరోజుల క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రశ్నపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కేసు వేశారు. ఈ క్రమంలో అభ్యర్థులకు నాలుగు మార్కులను కలిపిన అనంతరం మరోసారి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను వెలువరించాలని న్యాయస్థానం ఈ నెల మొదటి వారంలో ఉత్తర్వులిచ్చింది. అయితే మార్కులను కలిపే ప్రక్రియపై కసరత్తు చేయకుండా పూర్వాపరాల పరిశీలనతోపాటు వైద్యపరీక్షలనూ నిర్వహిస్తోందంటూ పిటిషనర్లు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో మండలి ఈ నెల 4వ తేదీన వెలువరించిన అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను తాత్కాలికంగా నిలిపివేయాలని న్యాయస్థానం గురువారం ఆదేశించింది.