ఆ పబ్బులన్నీ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుగా మారుతున్నాయి. అర్థరాత్రి నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. అంతేకాదు గర్ల్ ఫ్రెండ్ లేకుండా ఒంటరిగా వచ్చే యువకులకు డ్యాన్సర్లను సరఫరా చేయడమే కాకుండా, బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారనే ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించారు హైదరాబాద్ పోలీసులు.
హైదరాబాద్ బేగంపేట్ లోని ప్రముఖ పబ్‌లో అర్థనగ్న నృత్యాలతో డ్యాన్సులు నిర్వహించడంతో పాటు ఒంటరిగా గర్ల్ ఫ్రెండ్ లేకుండా వచ్చే యువకులకు అప్పటికప్పుడు యువతుల్ని డ్యాన్సుల కోసం సరఫరా చేస్తున్నారనే విమర్శలున్నాయి. పబ్‌లో మద్యం వ్యాపారం పెంచుకునేందుకు అందమైన యువతులతో ఒంటరిగా పబ్‌కు వచ్చే మందుబాబులకు వలేస్తున్నారని.. ఒంటరిగా వచ్చిన కుర్రాళ్లకు డ్యాన్సుల కోసం యువతుల్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దాడుల్లో వెల్లడైంది.
మిణుకుమిణుకుమనే చీకట్లలో అసభ్యకరంగా తాగిన మత్తులో మందుబాబులు ప్రవర్తిస్తుండటంతో తరచూ గొడవలు జరగటం పరిపాటిగా మారింది. పబ్‌లో డ్యాన్సర్లు లేరని పైకి చెప్తున్నా, లోపల మాత్రం జరుగుతున్న తంతు వేరుగా ఉంది. డ్యాన్సర్‌ను ఏర్పాటు చేసి, మందుబాబుకు అరెంజ్ చేసి.. గంటకు వెయ్యి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. డ్యాన్స్ చేసిన సమయంలో డ్యాన్సర్ మద్యం తాగినా... తిన్నా.. ఎవరితో డ్యాన్స్ చేస్తే వారి నుంచి ఆ డబ్బును పబ్ నిర్వాహకులు వసూలు చేస్తున్నారు.
పబ్‌లో తాగిన యువతులను వ్యభిచార రొంపిలోకి నిర్వాహకులు దింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. దాంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు, పంజగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 21 మంది యువతులతో పాటు.. 9 మంది యువకులు, ఇద్దరు నిర్వాహకులు పోలీసులకు పట్టుబడ్డారు.
వీరి నుంచి లక్ష 47 వేల రూపాయల్ని పోలీసులు సీజ్ చేశారు. పబ్‌లో డ్రగ్స్ కూడా ఏమైనా సరఫరా చేస్తున్నారేమోనన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మద్యం మత్తులో ఉన్న యువతుల్ని మాయమాటలతో వ్యభిచార రొంపిలోకి దింపితే మాత్రం సహించబోమని... చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.