అతడో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆర్థిక పరిస్థితులు దిగజారడం, అప్పుల వాళ్లు తరచూ వేధించడంతో ఏం చేయాలో తోచలేదు. జనాల భక్తినే సొమ్ము చేసుకోవాలని... వాళ్ల అమయాకత్వాన్నే పెట్టుబడిగా వ్యాపారం మొదలుపెట్టాడు. కట్టూబొట్టూ మార్చి బాబాగా అవతారమెత్తాడు. భక్తి ముసుగులో అందినకాడికి హుండీల్లో వేసుకుని దాచుకున్నాడు. మహిళలతో రాసలీలలు సాగించాడు. ఏకంగా 11 మందితో అగ్రమ సంబంధం పెట్టుకున్నాడు. కోట్లాది రూపాయలకు పడగలెత్తాడు. మొదటి భార్య విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. చివరికి ఓ భక్తురాలు ఇచ్చిన ఫిర్యాదుతోనే గుడారం గుట్టు మొత్తం రట్టైంది
ఏపీ కృష్ణాజిల్లా నందిగామకు చెందిన సాయి విశ్వచైతన్య... నల్లగొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అజ్మాపురంలో నాలుగేళ్ల క్రితం పదెకరాల భూమిని కొనుగోలు చేశాడు. గత ఏడాది జూన్‌లో అక్కడ శ్రీసాయి సర్వస్వం మాన్సి మహా సంస్థానం ట్రస్ట్ పేరుతో ఆశ్రమం నెలకొల్పాడు. అతడికి గతంలోనూ నేర చరిత్ర ఉంది. పీజీ చదివాడు. 2002లో హైదరాబాద్ న్యూ నల్లకుంటలో ఓ కంప్యూటర్ సెంటర్ పెట్టి జనాల నుంచి రూ.కోటి వసూలు చేసి మోసగించాడు.
మరో ఘటనలో నాంపల్లి పరిధిలో ఓ కేసు నమోదు కాగా జైలు పాలై బెయిల్ మీద బయటకొచ్చి సాయి భక్తుడిగా అవతారమెత్తాడు. పౌరోహిత్యం చేస్తూనే వివిధ టీవీ చానళ్లలో ప్రవచనాలు చెప్పాడు. 2017లో సొంతంగా శ్రీసాయి సర్వస్వం పేరుతో సొంత యూట్యూబ్ చానల్‌ను పెట్టాడు.
ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ పేరుతో భక్తుల నుంచి రూ.500 - రూ.1100 దాకా తీసుకొని మూలికలు, తాయెత్తులు ఇచ్చేవాడు. నిరుటి నుంచి అడిశర్లపల్లిలోని తన ఆశ్రమానికి కుటుంబ, ఆరోగ్య సమస్యలతో వచ్చే భక్తుల నుంచి పూజలు, హోమాల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నాడు.
తనకు సాయిబాబానే కలలోకి కనిపించాడని, భక్తుల నుంచి డొనేషన్లను నగదు, బంగారం రూపంలో తీసుకోవాలని సూచించాడని.. తనకు ఎంత ఇస్తే, అంతకు నాలుగు రెట్ల లాభాలు వస్తాయని జనాలను నమ్మించేవాడు.
దివ్య రక్షణ కవచ యంత్రం, మాయా ఛేదిని, నవధాతు దీపనూనె తదితరాలకు ఒక్కోదానికి భక్తుల నుంచి రూ.1500 దాకా వసూలు చేసేవాడు. ఇవన్నీ రూ.150 చొప్పున నాంపల్లి, మోజంజాహీ మార్కెట్లలో కొనేవాడు! విశ్వచైతన్య ప్రవచనాలకు ఆకర్షితులైన మహిళలు ఆయనకు భక్తులుగా మారారు. వారిలో ఓ 11 మందితో విశ్వ చైతన్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తేలింది. దీంతో అతడి భార్య నాగవల్లి విడాకులు తీసుకుంది. తర్వాత అతడు సుజీత (20) అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
దొంగబాబా విశ్వ చైతన్యతోపాటు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం నారాయణపురానికి చెందిన గాజుల గౌతమ్, ఖమ్మానికి చెందిన వంగరు సృజన్‌కుమార్, ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన ఓర్సు విజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి రూ.26 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలు, రూ.1.5 కోట్ల ఎఫ్‌డీలు, 17 ఎకరాల భూమి తాలూకు పత్రాలు, ఏడు ల్యాప్‌టా్‌పలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వచైతన్య భార్య సుజీత పేరిట రూ.1.3 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నట్లు తేలింది.