తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి గోస తీర్చడమే తమ లక్ష్యమని, ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ సకల దరిద్రాలు తొలగిపోతాయన్నారు. తెలంగాణ జిల్లాలు సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా రైతులు 2 పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని 3 మండలాల్లో 70 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పారు.
15 నెలల వ్యవధిలో పంప్‌హౌజ్‌ల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానమంటూ లేదని ధ్వజమెత్తారు. అందుకే వారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులపై విమర్శలు గుప్పిస్తున్నారంటూ మండిపడ్డారు. ఏపీలోని కొన్ని రాజకీయపక్షాలు చిల్లర రాజకీయలు చేస్తున్నాయని, వీటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు 1300 టీఎంసీలు కేటాయించారని.. ఆ మొత్తం వాడుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.