హైదరాబాద్ నగరంలోని మూసీ నదిలో మొసలి ఒకటి స్థానికుల కంట పడింది. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. ఈ మొసలి కండపడినప్పటి నుంచి మూసీ నదివైపు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ భయపడిపోతున్నారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా కుండపోత వాన పడింది. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ నది సైతం పొంగిపొర్లుతోంది. అయితే హైదరాబాదు శివార్లలోని అత్తాపూర్ వద్ద మూసీ నదిలో ఓ మొసలి దర్శనమిచ్చింది.
ఎగువ ప్రాంతాల నుంచి వరదనీటితో పాటు ఈ మొసలి కూడా కొట్టుకుని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మూసీ నదిలో ఓ బండపై విశ్రాంతి తీసుకుంటున్న మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అటు, కిస్మత్ పురాలో రెండు మొసళ్లు చనిపోయినట్టు గుర్తించారు. వీటిపై వారు జంతు ప్రదర్శన శాల అధికారులకు సమాచారమిచ్చారు. కాగా, శని, ఆదివారాల్లో కూడా హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు.