హైదరాబాద్ నగరంలో అందమైన అమ్మాయిలు, మహిళలతో వ్యభిచారం చేయిస్తూ వచ్చిన ఓ పట్టభద్రుడుని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, మూడు ఫోన్లు, 2 క్యామ్ సెల్ఫీ స్టాండ్స్ స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో ఆన్‌లైన్ డేటింగ్ యాప్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్(ఏహెచ్‌టీయూ)టీమ్‌కు సమాచారం అందింది.
దీంతో ఎల్‌బీనగర్ పోలీసుల సహకారంతో బుధవారం రాత్రి ఆ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పశ్చిమ బెంగాల్ ఖానాపూర్, సేన్‌పూర్‌కు చెందిన దేబ్‌జ్యోతిదాస్(27)ను అదుపులోకి తీసుకున్నారు. బీఎస్సీ, ఎలక్ట్రానిక్స్‌లో పీజీ చేసిన ఈయన కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. గత 2016లో నాగోల్‌లో వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్టయ్యాడు. 2018లో బెయిల్‌పై విడుదలయ్యాడు.
అప్పటి నుంచి నాగోల్ ఫతుల్లగూడ, శివపురి కాలనీలో అద్దె ఇంట్లో కుటుంబంతో ఉంటూ వెబ్స్ ఇయోటిప్ గ్యాన్ పేరిట వెబ్ డిజైనింగ్ యూ ట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో లాక్డౌన్ అతన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టింది. ఈ సమస్యలను అధిగమించడానికి అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.
గతంలో పరిచయం ఉన్న మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహించాలని భావించాడు. కోల్‌కతా, ముంబై తదితర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొస్తున్నాడు. వారు గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండేలా ఏర్పాటు చేశాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఇద్దరు, మహారాష్ట్రకు చెందిన మహిళను నగరానికి తీసుకొచ్చాడు.
గత ఏడాది నుంచి ఆన్‌లైన్ డేటింగ్ యాప్ లొకాంటో పేరిట ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అందమైన యువతుల అర్ధనగ్న ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ, లైవ్ క్యామ్ సెక్స్ సర్వీస్ అందుబాటులో ఉందని, విటులు సంప్రదించడానికి తన ఫోన్ నెంబర్లను యాప్‌లో పోస్ట్ చేస్తున్నాడు. హార్డ్ కోర్ క్యామ్ సెక్స్ షో లైవ్ బై హైదరాబాదీ అని ఫోస్టు చేసి ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షిస్తున్నాడు.
తనను సంప్రదించిన వారి నుంచి ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా డబ్బు వసూలు చేస్తాడు. ఒక్కొక్కరి నుంచి రూ.2 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించామని ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ కె. చంద్రశేఖర్, ఎల్‌బీనగర్ ఎస్‌హెచ్‌వో వి. అశోక్‌రెడ్డి తెలిపారు.