ఢిల్లీ మద్యం కుంభకోణంలో గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టు అయి ఇటీవలే బెయిలుపై విడుదలైన నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్లలో ఒకరైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఈ పరిణామం ఈ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవితకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.
అప్రూవర్‌గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తికి ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై విడుదలైన విషయం తెల్సిందే. ఆయన అప్రూవర్‌గా మారిన నేపథ్యంలో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పెద్ద పెద్ద వ్యక్తులపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు చాలా రోజుగా జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అలాగే, సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఉంది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కవిత వ్యక్తిగత ఆడిటర్ అప్రూవర్‌గా మారిన విషయం తెల్సిందే.